అర్హత ఉన్నా దళితబంధు ఇస్తలేరని నిలదీతలు.. దాడులు

  • అర్హత ఉన్నా దళితబంధు ఇస్తలేరని నిలదీతలు..దాడులు..ధర్నాలు
  • కోపంతో రగిలిపోయిన దళితులు 
  • సూర్యాపేట జిల్లా నెమ్మికల్లులో సర్పంచ్ ​ఇంటిపై దాడి..ధర్నా 
  • మంత్రి ఇచ్చిన గడియారాలను పగలగొట్టిన రాస్తారోకో
  • మెదక్ ​జిల్లా వెంకటాపూర్ లో జడ్పీ వైస్ చైర్మన్ కు నిరసన సెగ​
  • సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్​కు ఓటెయ్యమంటూ తీర్మానం
  • ధర్మపురిలో ఆరు గ్రామ పంచాయతీల ముట్టడి 
  • మంత్రి కొప్పుల దగ్గరకు వెళ్తే అడ్డుకున్న పోలీసులు

అర్హులకు దళితబంధు ఇవ్వకుండా అనర్హులకు, బీఆర్ఎస్ ​లీడర్లకు, పైరవీ చేసుకున్నవాళ్లకే ఇస్తున్నారంటూ దళితులు రగిలిపోయారు. బుధవారం పలు చోట్ల ప్రజాప్రతినిధులను నిలదీశారు. దళితబంధు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సూర్యాపేట జిల్లాలో దళితులపై సర్పంచ్​కొడుకు దాడి చేయగా ఎదురుతిరిగారు. ఈ సందర్భంగా సర్పంచ్​ కు, దళితులకు  మధ్య తోపులాట చోటుచేసుకుంది. తర్వాత సర్పంచ్​ ఇంటికి తాళం వేశారు. మంత్రి ఫొటోతో ఉన్న గడియారాలను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆరు గ్రామ పంచాయతీలను ముట్టడించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే  పోలీసులు అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా చీలాపూర్​లో తమను మోసం చేసిన బీఆర్​ఎస్​కు ఓటేసేది లేదంటూ దళిత కుటుంబాలు తీర్మానం చేశాయి.  తమ ఊరికి పథకం ఇవ్వలేదంటూ మెదక్​ జిల్లా వెంకటాపూర్ గ్రామస్తులు మీటింగ్​కు వచ్చిన జడ్పీ వైస్​చైర్​ పర్సన్​ను నిలదీశారు. 

సూర్యాపేట, వెలుగు : అన్ని అర్హతలున్న తమకు మంత్రి జగదీశ్​ రెడ్డి రూ.100 విలువైన గోడ గడియారాలిచ్చి..అనర్హులకు దళితబంధు ఇచ్చారంటూ సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డుపై బుధవారం దళితులు ధర్నాకు దిగారు. మంత్రి ఫొటోతో ఉన్న గడియారాలను కాళ్లతో తొక్కి ధ్వంసం చేశారు. దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తమపై సర్పంచ్ ​కొడుకు దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లులో 24 దళిత బంధు యూనిట్లు మంజూరు కాగా సర్పంచ్ గంపల సతీశ్​తన కుటుంబంలోని నలుగురికి ఇచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. 

దీంతో అర్హులైన దళితులు సర్పంచ్ ఇంటికి ప్రశ్నించడానికి వెళ్లగా అతడి కొడుకు నరేందర్ తిడుతూ దాడికి దిగాడు. దీంతో ఆగ్రహించిన దళితులు తమ ఇండ్లల్లోని మంత్రి జగదీశ్​రెడ్డి ఫొటోతో ఉన్న గోడ గడియారాలు రోడ్డుపైకి తీసుకొచ్చి చెప్పులతో కొట్టి కింద పడేసి తొక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఆందోళన విరమింపజేయడానికి అక్కడికి వచ్చిన ఆత్మకూర్ ఎస్సై వెంకట్ రెడ్డి కాళ్లపై పడి తమ బాధ చెప్పుకున్నారు. ఎస్​ఐ సర్ధి చెప్పడంతో ఆందోళన విరమించారు.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో...

వెల్గటూర్ :  ఎలక్షన్ కోడ్ రావడానికి ఒక్కరోజు ముందు ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లికి దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ లీడర్లు, ఆర్థికంగా ఉన్నవారికి, అనర్హులకు ఇచ్చారంటూ మంగళవారం నుంచి దళితులు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం ధర్మపురి మండలం నేరెళ్ల, దమ్మన్నపేట, రామయ్య పల్లె, ఆరపెల్లి, రాజారాం, వెల్గటూర్ మండలంలోని జగదేవ్ పేట్​గ్రామాల్లో జీపీలను ముట్టడించి సర్పంచ్, ఎంపీటీసీలను నిలదీశారు. జీపీల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నెరెళ్లకు చెందిన దళితులు మంత్రి కొప్పుల ఈశ్వర్​కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. 

జగదేవ్ పేట్​సర్పంచ్ కు ఫోన్​ చేసినా రాకపోవడంతో తమ గ్రామాలకు ఓట్ల కోసం రావొద్దని హెచ్చరించారు. ధర్మపురి మండలం రామయ్యపల్లి లో దళిత బంధు అడిగినందుకు సర్పంచ్ అనుచరులు ఓ దళితుడిపై దాడి చేశారు. దీంతో గ్రామపంచాయతీ దగ్గర గొడవ మొదలుకావడంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దమ్మన్నపేట్,రాజారాం గ్రామాలకు  చెందిన సుమారు వందమంది ధర్మపురి తహసీల్దార్​ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. తిమ్మాపూర్ కు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ను దళితులు నిలదీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అర్హులకు దళిత బంధు ఇవ్వనప్పుడు మంత్రికి ఓట్లడిగే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు. 

మెదక్ ​జిల్లా వెంకటాపూర్​లో..

మెదక్ టౌన్ : గ్రామంలో 100 దళిత కుటుంబాలుంటే ఒక్కరికి కూడా ఎందుకు దళితబంధు ఇవ్వలేదని మెదక్​ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామస్తులు జడ్పీ వైస్ చైర్​ పర్సన్​ లావణ్యరెడ్డిని ప్రశ్నించారు. బుధవారం గ్రామంలో బీఆర్ఎస్ కార్య కర్తల మీటింగ్​కు జడ్పీ వైస్ చైర్​ పర్సన్​ లావణ్య రెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, రైతుబంధు సమితి  మండల అధ్యక్షుడు కిష్టయ్య వచ్చారు. లావణ్య రెడ్డి మాట్లాడుతుండగా దళితులు అక్కడికి చేరుకుని తమ గ్రామంలో దళితబంధు, గృహలక్ష్మి ఎందుకు ఇవ్వలేరని నిలదీశారు.  

బీఆర్ఎస్​కు ఓటేసే ముచ్చటే లేదు 

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ లో దళిత బంధు రాకపోవడంతో దళితులు గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసి ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఓటు వేయబోమని తీర్మానం చేశారు. గ్రామంలో 64 దళిత కుటుంబాలుండగా నలుగురికే పథకం మంజూరైంది. అవి కూడా సర్పంచ్​తన అనుచరులకే ఇచ్చుకున్నాడని ఆరోపించారు. దీనిపై సర్పంచ్ కి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. తర్వాత మండల కేంద్రానికి వెళ్లి ఎంపీడీవోను కలిస్తే  తమ దగ్గర ఏమీ లేదని, గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే ఇవ్వడం జరిగిందని చెప్పారన్నారు. సర్పంచ్ రావుల మొండయ్య మాట్లాడుతూ పథకం మంజూరులో తన ప్రమేయం లేదని, అధికారులకి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.