జగిత్యాల జిల్లాలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ల దావత్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు డ్యూటీ టైమ్ లో దావత్ లకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామిల్ నిర్వహకులు ఇచ్చిన మందు పార్టీకి హాజరైనట్లు ఫారెస్ట్ ఆఫీసర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఇష్యూపై అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది.
మద్యం పార్టీకి వెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (డీఆర్ఓ) అరుణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తో పాటు మరో అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం (21న ) జరిగిన పార్టీకి మామూళ్లు రావడంతోనే పార్టీ చేసుకుని ఉంటారని సామిల్ నిర్వాహకుడు ఒకరు చెప్పారు. కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు తమ వద్ద నుంచి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని ఆరోపిచాడు. ఫారెస్ట్ పనులకు వెళ్లితే మామూళ్లు డిమాండ్ చేస్తారని చెప్పారు. చిన్న పనికి కూడా దాదాపు రూ. 5వేలు వసూలు చేస్తారని అన్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ ఆఫీసర్ల దావత్ వీడియో, సామిల్ యజమాని ఫోన్ కాల్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.