బర్త్​ డే తెల్లారే..  బస్సు ఢీకొట్టి యువకుడి మృతి

  •    ఫ్రెండ్స్​ను సాగనంపేందుకు వచ్చి ప్రమాదం బారిన.. 
  •     ఆగ్రహంతో మూడు బస్సుల అద్దాలు పగలుగొట్టిన బంధువులు

వరంగల్ సిటీ, వెలుగు :  తన బర్త్​డే వేడుకలకు వచ్చిన ఫ్రెండ్స్​ను సాగనంపేందుకు వెళ్లి ఓ యువకుడు బస్సు ఢీకొట్టి చనిపోయాడు.  వరంగల్ కాశిబుగ్గకు చెందిన చింత సారంగపాణి,  మల్లిక దంపతులకు ఇద్దరు బిడ్డలు,  ఒక కొడుకు ఉన్నారు. కొడుకు చింత చరణ్ (17)   మొన్నటి టెన్త్​ ఎగ్జామ్స్​ రాశాడు.  19వ తారీఖున చరణ్ బర్త్ డేకు   ఫ్రెండ్స్​ చాలా మంది వచ్చారు. గురువారం ఉదయం చరణ్ తన ఫ్రెండ్స్​ను వారి ఊళ్లకు పంపించడానికి వరంగల్ బస్టాండ్ కు వచ్చాడు. 

ఇంతలోనే ఖమ్మం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ప్లాట్ ఫామ్  నుంచి రివర్స్ లో  వచ్చి చరణ్ కు బలంగా తాకింది. దీంతో చరణ్ తల పగిలి రక్తస్రావం కాగా స్పాట్​లోనే చనిపోయాడు. ఆగ్రహానికి గురైన అతడి ఫ్రెండ్స్​, స్థానికులు అక్కడ ఉన్న మూడు బస్సుల అద్దాలను పగలగొట్టి ఆందోళన కు దిగారు.  సమాచారం అందుకున్న  ఇంతేజార్​ గంజ్​ పోలీసులు బస్టాండ్​ చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. అనంతరం డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.