వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు ప్రజల మద్దతు ట్రంప్ వైపు మళ్లింది. చిట్టచివరి సర్వేలోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు. ప్రత్యర్థి కమలా హారిస్ కంటే 1.8 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ అనూహ్యంగా ముందుకు రావటం విశేషం. స్వింగ్ స్టేట్స్ లో మొన్నటి వరకు కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ నెల1 నుంచి నిర్వహించిన సర్వేల్లో మాత్రం ట్రంప్ దూసుకొచ్చారు. సర్వే ప్రకారం.. స్వింగ్స్ స్టేట్స్ లోని అరిజోనా స్టేట్ లో ట్రంప్ కు 51.9 శాతం మద్దతు ఉంటే.. హారిస్ కు కేవలం 45.1 శాతం మద్దతు ఉంది.
నెవాడాలో 51.4 శాతం మంది ట్రంప్ కు సపోర్ట్ చేస్తుంటే.. 45.9 శాతం మంది హారిస్ వైపు మొగ్గుచూపుతున్నారు. నార్త్ కరోలినాలో ట్రంప్ కు 50.4 శాతం మద్దతు లభిస్తే.. హారిస్ 46.8 శాతమే మద్దతు లభించింది. ఇక జార్జియా, మిచిగాన్, నెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లో పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఈ రాష్ట్రాల్లో హారిస్ భారీ ఆధిక్యంలో ఉన్నా.. పోలింగ్ ముందు రోజుకు వచ్చే సరికి ఆమె ఆధిక్యత భారీగా తగ్గింది. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో 2 శాతంపైనే ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. మిగతా స్వింగ్ రాష్ట్రాల్లోనూ హారిస్ ఆధిపత్యాన్ని తగ్గిస్తే ఆయన విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. పోలింగ్ డే(మంగళవారం)కు కొన్ని గంటల ముందు విడుదల అవుతున్న సర్వేల్లో.. ట్రంప్ అధ్యక్షుడు కావడం ఖాయంగా కనిపిస్తుంది.