- మనిషికిన్ని పైసలేసుకుని గల్ఫ్ కార్మికుడి మృతదేహం పంపించిన్రు
- వీ6 వెలుగు కథనానికి స్పందన
- పట్టించుకోని సర్కారు
మేడిపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన మొగిలి శ్రీనివాస్ (46) అనే గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో సౌదీలో చనిపోగా, అతడి చివరి చూపు కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. వారి వేదనపై డిసెంబర్ 19న వెలుగులో ‘చివరి చూపు కోసం బిడ్డల తండ్లాట’ అనే హెడ్డింగ్‌తో కథనం ప్రచురితమైంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాలకు చెందిన తేలు నరేశ్, బొబ్బల రాకేశ్, నాగేశ్, శేఖర్, రఘు తదితరులు కలిసి రూ.2 లక్షల వరకు చందాలు సేకరించారు.
అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆదివారం సాయంత్రం విమానంలో పంపించారు. దీంతో సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి సోమవారం సాయంత్రం గోవిందారానికి శ్రీనివాస్ డెడ్ బాడీ చేరుకుంది. చనిపోయిన నెల తర్వాత మృతదేహం చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తర్వాత నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులంతా పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు , గల్ఫ్ జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు.