సీఎంఆర్​ గడువు ఇయ్యాల్టితో పూర్తి

  • ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ సెంట్రల్ ఆఫీసు నుంచి రాని స్పష్టత
  • 9 లక్షల టన్నుల బియ్యం ఇప్పటికీ అందలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిరుడు యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కస్టమ్‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ డెలివరీకి గురువారంతో గడువు ముగియనుంది. పోయినేడాది సెప్టెంబరులోనే గడువు ముగిసింది. అయితే సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, మిల్లర్ల అభ్యర్ధనలతో ఫుడ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ) గడువు పొడిగిస్తోంది. పొడిగించిన గడువు కూడా గురువారంతో ముగియనుంది. అయినా ఇప్పటికీ రైస్ డెలివరీ పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇటీవల లెటర్ రాశారు. ఒకనెల వరకు గడువు పెంచాలని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుకు రీజనల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనలు పంపించారు. అయితే గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిలిపివేయనున్నట్టు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ డీజీఎం కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. దీంతో మార్చి 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ గోడౌన్లకు చేరిన బియ్యం లారీలను మాత్రమే అన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి అనుమతిస్తామని సివిల్ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మిల్లర్లకు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 9 లక్షల టన్నుల బియ్యం రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు.