నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లా టూర్ముగియగానే సీనియర్ కాంగ్రెస్ నేతలు చేరికలపై దృష్టి పెట్టారు. నాగర్ కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో విబేధాలు పెరగడంతో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఇంట్లో చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో భేటీ ఉంటుందని సమాచారం. మరో వైపు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. కొల్లాపూర్కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న సీఆర్ జగదీశ్వర్ రావుతోనూ భేటీ అయ్యారు. త్వరలో టీపీసీసీ సెక్రటరీ రంగినేని అభిలాష్ రావును కూడా త్వరలో కలుస్తారని తెలుస్తోంది.
ఈ నెల చివర్లో చేరిక
ఈ నెల చివర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూచుకుళ్లతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం. దీంతో నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీపై కాంగ్రెస్ సీనియర్లు దృష్టిపెట్టారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటమి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించిన దామోదర్ రెడ్డి తన కొడుకు డాక్టర్ రాజేశ్ రెడ్డిని ఏడాది కింద రంగంలోకి దించారు. నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో తిరుగుతున్న రాజేశ్ రెడ్డి తన తండ్రి అనుచరులతో పాటు బీఆర్ఎస్ అసంతృప్తులను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూచుకుళ్ల చెప్పినట్లు సమాచారం.
సీఆర్ ను బుజ్జగిస్తున్న నేతలు
కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ఆశించిన సీఆర్ జగదీశ్వర్ రావు, రంగినేని అభిలాష్‌రావు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని భావిస్తున్న సీఆర్ ను బుజ్జగించేందుకు మాజీ మంత్రి జూపల్లి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సుమారు 2 గంటల పాటు చర్చించినట్లు తెలిసింది. తాను కొల్లాపూర్నుంచి రేస్‌లో ఉన్నానని అభిలాష్‌రావు హింట్ ఇస్తున్నారు.
గెలవడమే లక్ష్యం
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్అభ్యర్థులు గెలవడమే లక్ష్మంగా పని చేయాలని పార్టీ పెద్దలు ప్లాన్చేస్తున్నారు. ప్రజల మధ్య ఉండకుండా, పార్టీ కార్యక్రమాలను నిర్వహించకుండా కేవలం సీనియార్టీ ఆధారంగా టికెట్లు ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ ఇప్పటికే పలు రకాల సర్వేలు నిర్వహించి రిపోర్ట్స్తెప్పించుకుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలిచి తీరాల్సిందేనని ఆ స్థాయిలో అధికార పార్టీని ఢీకొనే సత్తా, ప్రజాకర్షణ ఉన్న వారినే ఎంపిక చేస్తారని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు.
బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా..
బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడానికి డిసైడ్అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్తులను కాంగ్రెస్‌వైపు లాగేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు. దాదాపు నెల రోజులుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో భేటీ అవుతున్న జూపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేద్దామని కోరినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్ గా పనిచేసిన ఎమ్మెల్సీ కూచుకుళ్లకు నాగర్‌కర్నూల్‌పై పట్టుంది. మాజీ మంత్రి నాగంతో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకోలేదు.
కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్సీగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన కూచుకుళ్ల 2014లో మర్రి జనార్దన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే మర్రి తన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని, తనను అవమానిస్తున్నారని కేటీఆర్‌కు చెప్పినా స్పందన లేకపోవడంతో ఆయన పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా అంటున్నారు. ఈ నెల 6న కేసీఆర్జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసున్న కూచుకుళ్ల సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే కూచుకుళ్ల పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.