మర్రిగూడలో బైఠాయించిన భూ నిర్వాసితులు.. చర్చలకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ 

నల్గొండ జిల్లా : కిష్టారాయిన్ పల్లి, చర్లగూడెం ప్రాజెక్టు ముంపు బాధితులు చేపట్టిన ఆమరణ దీక్ష ఇవాళ 4వ రోజు కొనసాగుతోంది. మర్రిగూడ మండల కేంద్రంలో నాలుగు రోజులుగా  దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న సుమారు 4 గంటలకుపైగా మర్రిగూడ చౌరస్తాలోని ప్రధాన రహదారిపై 4 గంటలపాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపిన భూ నిర్వాసితులు ఇవాళ కూడా రోడ్డుపై బైఠాయించారు. 
నిన్నటి ఘటన నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే అడిషనల్ కలెక్టర్ భూ నిర్వాసితుల దీక్షా శిబిరానికి వచ్చి చర్చించారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానంటూ హామీ ఇచ్చారు. అయితే తక్షణం సమస్యను పరిష్కారం చేసే వరకు దీక్ష  విరమించేది లేదని భూ నిర్వాసితులు  తెగేసి చెప్పారు. తమ కుటుంబ సమేతంగా రోడ్డున పడి.. కష్టాలు తెలియజేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా ఆమరణ దీక్ష చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. నేతలు, అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూ నిర్వాసితులకు రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ నిన్న ఉదయం రైతులతో కలసి దీక్షలో కూర్చుని  మద్దతు తెలిపారు. రహదారిపై బైఠాయించిన విషయం తెలుసుకుని సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివిధ రైతు సంఘాలు ఆందోళన ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలియజేశారు. 
ప్రతిపక్షాల నాయకులంతా భూ నిర్వాసితులను కలసి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈరోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, అధికారులు దీక్షా శిబిరానికి హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.