చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువుల దాడి

నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

అసలేం జరిగింది..? 

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన లింగయ్య..తలనొప్పితో ప్రైవేటు హాస్పిటల్ లో చేరాడు. అయితే.. లింగయ్య టీబీ పెషేంట్ కావడం, మెడిసిన్ వాడకపోవడంతో తీవ్ర అనారోగ్యం బారిన పడి హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందాడని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను మృతుడి కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. వైద్య సిబ్బంది వల్లే లింగయ్య చనిపోయాడంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. 

లింగయ్య మృతితో కోపం ఆగలేక కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ పై దాడి చేశారు. హాస్పిటల్ డాక్టర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. పేషెంట్ ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన చనిపోయారని, ఇప్పుడు తమను రాజకీయాల్లో భాగంగా బలి పశువులను చేస్తున్నారని ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్స్ ఆరోపిస్తున్నారు.