కలుషిత నీళ్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతి

కలుషిత నీళ్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతి

గద్వాల పట్టణంలో విషాదం 
బాధితుల్లో ఎనిమిది మంది చిన్నారులు
మురుగు నీళ్లు కలవడం, పాడుబడ్డ ట్యాంకు ద్వారా సరఫరానే కారణమంటున్న స్థానికులు

గద్వాల : జోగులాంబ గద్వాలలోని మూడు కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా ఐదు రోజులుగా కలుషిత నీరు తాగి చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన గంటవీధికి చెందిన బిబి ఫాతిమా (40 ఏళ్లు) అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.  జోగులాంబ గద్వాలలోని మూడు కాలనీల్లో మిషన్ భగీరథ  ద్వారా ఐదురోజులుగా కలుషిత నీరు సప్లయ్​ కావడంతో అవి తాగిన 50  మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమించి నర్సింగమ్మ (56), సీకలి కృష్ణ(46) అనే ఇద్దరు బుధవారం (జులై 6న) మృతిచెందారు. కొత్త ట్యాంకుల ద్వారా కాకుండా పాడుబడ్డ పాత ట్యాంకు నుంచి నీళ్లు సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. కొన్నేండ్లుగా ట్యాంకును క్లీన్​చేయడం లేదని, దాని చుట్టుపక్కల మురుగునీటితో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని చెబుతున్నారు. నల్లా నీళ్లు మురికిగా ఉంటున్నాయని, దుర్వాసన వస్తున్నాయని మొత్తుకుంటున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే ముగ్గురు చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మిషన్ భగీరథ పైపులైన్​కు డైరెక్ట్​ కలిపి..!

గద్వాల మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కొత్త ట్యాంకులు, వాటర్​ట్రీట్​మెంట్​ ప్లాంట్లు, కొత్త కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు.గత వేసవిలో నీటి కొరత ఏర్పడగా కృష్ణా బ్యాక్​వాటర్​ నుంచి ధరూర్​ వెళ్లే మిషన్​భగీరథ మెయిన్​పైపులైన్ కు నోబుల్ స్కూల్ దగ్గర కనెక్షన్​ఇచ్చి గంటగేరి, వేదనగర్, మోహిన్ మల్ల కాలనీకి సప్లై చేస్తున్నారు. కొత్త ట్యాంకులు లేకపోవడంతో రాఘవేంద్ర కాలనీ, మోహిన్ మల్ల కాలనీలోని పాత పాడుబడ్డ వాటర్​ట్యాంకులను వాడుతున్నారు. మోహిన్ మల్ల వాటర్ ట్యాంకు దగ్గర పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గంటగేరి, వేదనగర్​కు నీళ్లు వదిలే పైప్​లైన్ దగ్గర మురుగునీరు నిల్వ ఉండి లీకైనట్లు భావిస్తున్నారు. మోహిన్​మల్ల వాటర్ ట్యాంక్​ను కొన్నేండ్లుగా క్లీన్​ చేయలేదని కాలనీవాసులు చెప్తున్నారు. కృష్ణాలో కొత్త నీళ్లు రావడం, ట్యాంకు శుభ్రం చేయకపోవడం, మురుగునీరు కలవడం లాంటి కారణాల వల్లే నీరు కలుషితమై, ఇద్దరు చనిపోయారనే  స్థానికులు అంటున్నారు. కలుషిత నీరు తాగి అస్వస్థత గురైన వేదనగర్​, గంటగేరి కాలనీల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ బుధవారం పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మూడు రోజుల నుంచి ఒక్కొక్కరుగా..
గద్వాల పట్టణంలోని గంటగేరి, వేదనగర్, మోహిన్ మల్ల కాలనీ కి ఐదురోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతున్నది. ఈ కాలనీల్లో అందరూ పేద ప్రజలే కావడంతో నీళ్లు కొనుక్కునే స్తోమత లేక ఈ కలుషిత నీటినే తాగుతున్నారు. మూడు రోజుల నుంచి ఒక్కొక్కరుగా మూడు కాలనీలకు చెందిన 50 మందికిపైగా  వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై సర్కారు దవాఖానలో జాయిన్​ అయ్యారు. వీరిలో గంటగేరి కాలనీకి చెందిన నర్సింగమ్మ, సీకలి కృష్ణ పరిస్థితి విషమించడంతో బుధవారం కర్నూల్ ఆస్పత్రికి రెఫర్​ చేశారు. వీరిద్దరినీ అక్కడికి తరలిస్తుండగా కృష్ణ మార్గమధ్యలో చనిపోగా.. నర్సింగమ్మ కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం 40 మంది గద్వాల సర్కార్ దవాఖానలో, మరో పదిమంది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 

కేటీఆర్‌‌ రాజీనామా చేయాలే: డీకే అరుణ

కలుషిత నీళ్లు తాగడంతో జోగులాంబ జిల్లాలో  ఇద్దరి మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌‌ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.