హైదరాబాద్, వెలుగు: డీజిల్, పెట్రోల్ వెహికల్స్‌కు త్వరలో కాలం చెల్లనుంది. నాలుగైదేండ్లలో మొత్తం ఎలక్ట్రిక్ బండ్లే రోడ్లపై తిరగనున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 2023 నాటికి దేశమంతా ఎలక్ట్రిక్ టూ వీలర్లే కన్పించనున్నాయి. 2030 నాటికి ఫోర్ వీలర్లనూ ఎలక్ట్ట్రిక్ బండ్లుగా మార్చాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వారికి సబ్సిడీ, టాక్స్‌లు తగ్గించేందుకు అడుగులు వేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ దిశగా ఏ ప్రయత్నమూ కన్పించడం లేదు.
నో రిజిస్ట్రేషన్ ఫీజు
కేంద్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు (ఈవీ) ప్రాధాన్యమిస్తోంది. 2030 నుంచి అన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే మార్కెట్‌లో ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ చార్జీల్లేకుండా చేయాలని భావిస్తోంది. కొత్త టూ, త్రీ, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొన్నాళ్లపాటు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయించాలనే ఆలోచన చేస్తోంది. 100% రోడ్ టాక్స్‌ను రీయింబర్స్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇవే కాకుండా నో ఇన్సూరెన్స్, పార్కింగ్ ఫ్రీ సౌకర్యాలు ఇవ్వనుంది.
ఈ-కామర్స్‌లో ఈ- వెహికిల్స్
ఈ -కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీల్లో 10, బెంగళూరులో 30 ఈవీలను వాడుతోంది. 2020 మార్చి నాటికి తన సంస్థలో 40% ఈవీలను వాడనున్నట్లు ఇటీవల ఆ సంస్థ పేర్కొంది. ఈవీలు వాడటం వల్ల ఒక కిలోమీటర్‌కు రూపాయే ఖర్చవుతోందని, అదే పెట్రోల్‌కు మూడున్నర వరకు అవుతోందని తెలిపింది. ఇక ఓలా, ఉబర్ కూడా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బండ్లను ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మొత్తం 500 బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నారు.
చార్జింగ్ పాయింట్లు ఏవీ?
హైదరాబాద్‌లో 136 చార్జింగ్ స్టేషన్లు అవసరం ఉంది. అందుకోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని డిస్కంలకు కేంద్రం సూచించినా ఇప్పటివరకు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కనీసం స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తున్నా విద్యుత్‌శాఖలో మాత్రం కదలిక లేదు. మరో వైపు ఎస్పీడీసీఎల్ గ్రేటర్ జోన్‌లో అందుబాటులో ఉన్న సబ్‌స్టేషన్ల పక్కన చార్జింగ్ స్టేషన్లు పెడితే డిస్కంకు ఇన్‌కం పెరిగే అవకాశముంది. ప్రస్తుతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిటీలోని మియాపూర్, బాలానగర్ మెట్రో స్టేషన్ల వద్ద మూడు ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలకే చార్జింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.