నల్గొండ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోస్(ప్రికాషనరీ) వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు ఇటు పీహెచ్‌సీలు, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాక్ లేకపోవడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రోజురోజుకీ పెరుగుతున్న వైరల్ ఫీవర్స్, కరోనా పాజిటివ్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఫస్ట్, సెకండ్ డోస్ వేసుకున్న వాళ్లు బూస్టర్ డోస్ వేసుకునే గడువు దగ్గరపడటంతో వ్యాక్సిన్ కోసం పీహెచ్ సీలు, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సర్కారు నుంచి వ్యాక్సిన్ సప్లై ఆగిపోయి చాలా కాలమైంది. గతంలో సప్లై చేసిన వ్యాక్సిన్ల డేట్ కూడా దాటిపోవడంతో పాత స్టాక్ అంతా హెల్త్ డిపార్ట్మెంట్కు తిప్పి పంపించారు. ప్రస్తుతం జులై ఎక్సైపైరీ డేట్ కలిగిన వ్యాక్సిన్లు మాత్రమే అక్కడకక్కడ అందుబాటులో ఉన్నాయి. 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వేసే కార్బెవాక్స్ వ్యాక్సిన్ల కొరత సైతం తీవ్రంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఎక్కడా వ్యాక్సిన్ స్టాక్ లేదని అంటున్నారు.
స్పెషల్ డ్రైవ్ పూర్తయి 9 నెలలు
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సర్కా రు గతేడాది సెప్టెంబర్ నుంచి మార్చి వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో వంద శాతం ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని పూర్తి చేసింది. రెండు డోస్‌లు పూర్తయిన తొమ్మిది నెలలకు బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వాళ్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మాత్రం ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్ సప్లై చేసింది. మిగిలిన వాళ్లంతా ప్రైవేటులో వ్యాక్సి న్ వేసుకోవాలని చెప్పింది. ప్రైవేట్‌లో వ్యాక్సిన్‌కు రూ.250 రేట్ ఫిక్స్ చేసింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి జూన్ నాటికి తొమ్మిది నెలలు పూర్తయింది. కానీ వ్యాక్సిన్ల ఎక్సైపైరీ డేట్ ముగియడంతో అన్ని జిల్లాల్లో మిగిలిపోయిన స్టాక్ ను హెల్త్ డిపార్ట్మెంట్కు రిటర్న్ పంపించారు. దీంతో 60 ఏళ్లు దాటిన వాళ్లతో సహా, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కూడా ఫ్రీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు మిగిలిన ఏజ్ గ్రూపు వారు కూడా బూస్టర్ డోస్ కోసం ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా నో స్టాక్ అనే చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది.
పెరుగుతున్న కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జనాల రద్దీ ఎక్కువగా ఉన్న సిటీల్లో, ప్రధాన పట్టణాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. సీజన్ మార్పుతో డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, ఫ్లూ, జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ పర్సంటేజీ ఆదివారానికి 1.8 శాతానికి చేరింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,762 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ విషయానికొస్తే నల్గొండ జిల్లాలోనే డెంగ్యూ కేసులు ఈ సీజన్లో 18 నమోదయ్యాయి. జ్వరాల లెక్కలను హెల్త్ డిపార్ట్మెంట్పరిగణలోకి తీసుకోవడం లేదు కానీ, వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉందంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు కూడా టెస్టులు చేయించుకోకుండా సొంతంగా ఇంటి వైద్యాన్నే ఫాలో అవుతున్నారని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి విషమిస్తే తప్ప ఆసుపత్రుల్లో జాయిన్ కావడం లేదంటున్నారు.