ఏండ్లుగా ఎదురుచూపులు.. ఎస్టీల జాబితాలో చేర్చాలని లబాన్​ లంబాడీల డిమాండ్​

ఏండ్లుగా ఎదురుచూపులు.. ఎస్టీల జాబితాలో చేర్చాలని లబాన్​ లంబాడీల డిమాండ్​
  • ఇచ్చిన హామీ నేరవేర్చాలంటూ ఆందోళన
  • అయిదు జిల్లాలో వీరి ప్రభావం 


కామారెడ్డి, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా అయిదు జిల్లాల్లో విస్తరించి ఉన్న లబాన్​ లంబాడీ (కాయితీ) లను ఎస్టీల జాబితాలో  చేర్చాలనే డిమాండ్​ ఏండ్లుగా పెండింగ్​లో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరిని ఎస్టీ జాబితాలో  చేరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తమకు ఎస్టీ రిజర్వేషన్​వర్తింప జేయడంతో పాటు, పోడు పట్టాలివ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్​ఏర్పాటు చేయాలంటూ వీరు ఆందోళన చేస్తున్నారు. 

Also Read : - 9ఏళ్లకు మోక్షం.. వారివన్నీ కపట మాటలు.. కేంద్రంపై ప్రియాంక చతుర్వేది ఫైర్డ్

హామీ నెరవేర్చకపోతే తమ ప్రభావమున్న చోట వచ్చే ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని ప్రతినిధులు ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో లబాన్​లంబాడీలు అధికంగా ఉన్నారు. వీరిని ఆయా ఏరియాల్లో లబాన్, కాయితీ, మథుర, జుట్టు లంబాడీల పేర్లతో పిలుస్తారు. 

ఫస్ట్​ ఎస్టీల్లోనే ..

లబాన్​(కాయితీ) లంబాడీలు మొదట ఎస్టీల్లోనే ఉన్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు ఇతర సౌకర్యాలు పొందారు.  1986లో వీరిని ఎస్టీ జాబితా నుంచి తొలగించి బీసీల్లోకి మార్చారు. దీంతో ఎస్టీలు పొందే  అవకాశాల్ని కోల్పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ తమను ఎస్టీలుగా మార్చాలని డిమాండ్​ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ​ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య నేతలను కలిసి విన్నవించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లారు.  ప్రభుత్వం చెల్లప్ప కమిషన్​ను నియమించగా, కామారెడ్డి తో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించిన కమిషనల్​ వీరి స్థితిగతులను అధ్యయనం చేసింది. కొద్దిరోజుల కింద లబాన్​(కాయితీ) లంబాడీలను ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తీర్మానం తర్వాత ప్రక్రియ  ముందుకెళ్లలేదు.

రోడెక్కిన లబాన్ ​లంబాడీలు

తమను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ కామారెడ్డి జిల్లాలో లబాన్​ లంబాడీలు ఇటీవల రోడెక్కారు. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన తమ నిరసన వ్యక్తం చేశారు. గాంధారి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. లబాన్​లంబాడీలు ప్రభుత్వానికి ప్రధానంగా మూడు డిమాండ్లు విన్నవిస్తున్నారు. అవి బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చడం, పోడు పట్టాలు ఇవ్వడం, ప్రత్యేక కార్పొరేషన్​ఏర్పాటు. 

రిజర్వేషన్​ వర్తింపజేయాలి

గతంలోనే కేసీఆర్​ను కలిసి విన్నవించాం, సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం మమల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఏండ్ల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నాం. మాకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలి. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మా బలం ఉన్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తాం.
– తాన్​సింగ్, లబాన్​ లంబాడీల 
సంఘం స్టేట్​ ప్రెసిడెంట్​