ఎస్టీల్లో చేర్చాలని కాయితీ లంబాడీల లడాయి

ఎస్టీల్లో చేర్చాలని కాయితీ లంబాడీల లడాయి
  • బీసీ నుంచి  ఎస్టీలో చేర్చాలని ,​
  • పోడు పట్టాలు ఇవ్వాలని కొన్నేళ్లుగా పోరాటం
  • ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు 3,100 కుటుంబాలు దూరం
  • రాష్ట్రంలో  154 తండాల్లో వీరి స్థిర నివాసం 

తమ డిమాండ్లను  ప్రభుత్వం నెరవేర్చాలని గత కొన్నేళ్లుగా  కాయితీ( లబాన్​) లంబాడీలు పోరాటం చేస్తున్నారు.  బీసీల్లో  ఉన్న తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని,  పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు కామారెడ్డి జిల్లాలోని 3,100  కాయితీ (లబాన్​) లంబాడీలు  కుటుంబాలు దూరంగా ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వీరు సర్వేను అస్త్రంగా ఎంచుకున్నారు.  దశాబ్దాలుగా తాము పోరాటం చేస్తున్నా, తమను ఎస్టీల్లో చేర్చకపోవటంతో పాటు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లో తమ తెగ పేరు లేదంటూ సర్వేను బహిష్కరించారు.  

కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో కాయితీ ( లబాన్​) లంబాడీలు 154 పైగా తండాల్లో ఉన్నారు. కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లో వీరి ఉనికి ఎక్కువ. కామారెడ్డి, ఆదిలాబాద్​ జిల్లాల్లో  100కు పైగా తండాల్లో ఉంటారు.  ఆదిలాబాద్​ జిల్లాలో ఉట్నూర్, బోథ్, కామారెడ్డి జిల్లాలోని గాంధారి, పిట్లం, పెద్దకొడప్​గల్​, బిచ్​కుంద,  లింగంపేట, బాన్సువాడ ఏరియాలు,  నిజామాబాద్​ జిల్లాలోని వర్ని, మోపాల్​ మండలాలు,  సంగారెడ్డిజిల్లాలో కంగ్టీ ఏరియాలో ఉన్నారు. వ్యవసాయం, పశుపోషణ వీరి ప్రధాన వృత్తి.  రాజస్తాన్​ స్టేట్​ నుంచి వందల ఏండ్ల క్రితం వలస వచ్చిన వీరి కుటుంబాలు ఫారెస్ట్​ ఏరియాలు, సమీప ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తూ  జీవనం సాగిస్తున్నారు.  

వీరి వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. దీంతో వీరిని వివిధ పేర్లతో పిలుస్తారు. కాయితీ, మధుర, లబాన్​,  జుట్టు లంబాడీలు అంటారు.  వీరు గతంలో  ఎస్టీలో జాబితాలో ఉండేవారు.  వీరిని ఎస్టీలుగా గుర్తిస్తూ ఉద్యోగ, విద్య, రాజకీయాల్లో  ఎస్టీ రిజర్వేషన్లు  ఉండేవి. 1987లో  వీరిని మధుర లంబాడీ అనే పదం చూపి అప్పటి ఉన్నతాధికారులు ఎస్టీల నుంచి తొలగించి బీసీల్లో చేర్చారని చెబుతారు. ప్రస్తుతం బీసీ- (డీ) లో ఉన్నారు.  

ఎస్టీలుగా గుర్తించాలని ఆందోళనలు

బీసీ కేటగిరీలో ఉన్న తమను ఎస్టీలుగా గుర్తించాలని పోడు భూములను పట్టాలు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.  గతంలో వైఎస్సార్​ హయాంలో కూడా వీరి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  వీరిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని కేసీఆర్​ కూడా ప్రకటించారు.  చెల్లప్ప కమిషన్​ రిపోర్టు కూడా నివేదిక  ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో  కాయితీ లంబాడీల జీవన విధానం, పరిస్థితులపై అధ్యయనం చేశారు.  

గత సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.  అయినా వీరి సమస్య పరిష్కారం కాలేదు.   తాజా సర్వే నేపథ్యంలో రాష్ర్టంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు.  ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్​తో కలెక్టర్లకు,  ప్రజాప్రతినిధులకు  వినతి పత్రాలు అందించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా వినతి పత్రం ఇచ్చారు. 

తాజాగా సర్వేను అస్ర్తంగా చేసుకొని..

వివిధ మార్గాల్లో నిరసనలు తెలుపుతూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది.  ప్రతి కుటుంబానికి సంబంధించి వివరాల్ని సేకరించారు. సర్వేలో తమ జాతి పేరు లేదని, దీంతో పాటు తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్​ చేస్తూ సర్వేలో పాల్గొనకూడదని ఆ కులం  ప్రతినిధులు ప్రకటించారు. అయితే కామారెడ్డి జిల్లాలో మినహా మిగతా జిల్లాల్లో  ఎక్కువ శాతం మంది  సర్వేలో
 పాల్గొన్నారు.   

మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి

ఎస్టీల్లో ఉన్న  తమను అకారణంగా  బీసీలోకి మార్చారు.  మాకు దక్కాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్ని కొల్పోయాం.   మేము పోడు వ్యవసాయం చేస్తాం.   మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగానే మాకు పోడు పట్టాలు ఇవ్వాలి. మా ప్రధాన డిమాండ్లు​ మమ్మల్ని ఎస్టీలుగా మార్చాలి, పోడు పట్టాలు ఇవ్వాలి.  లబాన్​ కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి.   మమ్మల్ని ఎస్టీల్లో చేర్చినా  ఎస్టీ రిజర్వేషన్​10 శాతం దాటదు.

 గత ప్రభుత్వం  సమస్యను పరిష్కరిస్తామంది.  అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ముందుకెళ్లలేదు. మా డిమాండ్లు నేరవేరే వరకు ఆందోళనలు చేస్తాం.  ప్రభుత్వం చేసిన సర్వేలో  కామారెడ్డి జిల్లాలో ఎవరూ పాల్గొనలేదు. మిగతా జిల్లాల్లో కూడా కొందరు వివరాలు ఇవ్వలేదు.

- తాన్​సింగ్​, కాయితీ ( లబాన్​) లంబాడీల సంఘం  స్టేట్​ ప్రెసిడెంట్​