అమీర్‌పేట స్టేషన్ ముందు బైఠాయించి నిరసన
సమస్యలు పరిష్కరించే వరకు డ్యూటీలకు వెళ్లమని స్పష్టం
హైదరాబాద్ : మెట్రో రైలు రెడ్‌లైన్ టికెటింగ్ సిబ్బంది మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్వరకు ఉన్న 27 స్టేషన్లలోని దాదాపు 150 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ముందు బైఠాయించి ఆందోళన చేశారు. స్పందించిన మెట్రో అధికారులు ధర్నాకు దిగినవారిలోని ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరిపారు. అనంతరం టికెటింగ్ సిబ్బంది తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదేండ్లుగా తమకు జీతాలు పెంచడం లేదని వాపోయారు. ఇప్పటికీ తమకు నెలకు రూ.10 వేల నుంచి 12 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంచ్ బ్రేక్ టైమ్ సరిపోవడం లేదని, 15 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. తమకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని, డ్యూటీకి వచ్చి పోవాలన్నా టికెట్ కొనుక్కోవాల్సిందేనని వాపోయారు.
జీతాలు పెంచడంతోపాటు తమ ప్రధానమైన మూడు సమస్యలు పరిష్కరించాలని కోరారు. కియోలిస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారని టికెటింగ్ ఉద్యోగులు తెలిపారు. మరోసారి చర్చలకు రమ్మన్నారని వివరించారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తాము విధులకు వెళ్లమని తేల్చి చెప్పారు. అప్పటివరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. అయితే మొత్తం 27 స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ధర్నాలో పాల్గొనడంతో ఆయా స్టేషన్లలో టికెట్లు ఇచ్చే వారు లేక కౌంటర్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. మెట్రో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వెంటనే అప్రమత్తమైన హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఇతర ఉద్యోగులతో టికెటింగ్ కొనసాగించారు. ఎటువంటి అంతరాయం లేకుండా మెట్రో సర్వీసులు నడిపిస్తామని ప్రకటించారు.
ధర్నాకు దిగిన సిబ్బందిపై చర్యలుంటాయ్: హెచ్ఎంఆర్ఎల్
మెట్రో రైళ్ల ఆపరేషన్ ను నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదని, టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని హెచ్‌ఎంఆర్‌ఎల్ చెప్పింది. ధర్నాకు దిగిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపింది. సిబ్బంది మరింతగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరుపుతామని వెల్లడించింది. రైళ్లు టైం ప్రకారమే నడుస్తాయని, తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేసింది.
ఎన్‌సీసీ ముందు ధర్నా చేస్తం
చాలీచాలని జీతాలతోనే పనిచేస్తున్నం. మెట్రో అధికారులు మూడు రోజుల్లో మా డిమాండ్లపై స్పందిస్తామని చెప్పారు. అప్పటి వరకు మేం విధులకు వెళ్లం. నాగోలు ఎన్‌సీసీ ముందు ధర్నా చేస్తం. అధికారుల నుంచి లిఖితపూర్వ హామీతో నోటీసులు వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తం. – మణిదీప్, దిల్సుఖ్నగర్
ఐదేళ్లుగా జీతం పెంచలేదు
ఐదేండ్లుగా నా జీతం రూ.11 వేలే. డ్యూటీకి కొంచెం లేటుగా వెళ్లినా శాలరీ కట్ చేస్తరు. పైగా పై అధికారులకు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ టైం చాలా తక్కువ. తక్కువ జీతంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఏజెన్సీ వాళ్లు, మెట్రో అధికారులు స్పందించి జీతాలు పెంచాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. డిమాండ్లు తీర్చే వరకు నిరసన కంటిన్యూ చేస్తం.
– కల్యాణ్, పంజాగుట్ట
లంచ్ బ్రేక్ టైం పెంచాలి
జీతాలు పెంచాలి. లంచ్ బ్రేక్ టైంని అర గంట చేయాలి. మెట్రో కార్డు కొని ప్రయాణించాల్సి వస్తోంది. యాక్సెసింగ్ కార్డుతో వెళ్తే పెనాల్టీ వేస్తున్నారు. మాకు ఉచితంగా మెట్రోలో ప్రయాణించేలా అలవెన్స్ ఇవ్వాలి. – అర్చన, లక్డీకాపూల్