యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా ఆలేరులో వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షకు శుక్రవారం మద్దతు ప్రకటించి మాట్లాడారు. వీఆర్‌ఏలు 54 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వీఆర్‌ఏలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్, వైస్ ఎంపీపీ లావణ్య, కాంగ్రెస్ లీడర్లు కట్టెగుమ్ముల సాగర్‌రెడ్డి, వెంకటేశ్వరాజు, ఎండి.ఎజాజ్, సాగర్ పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17ను బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
మునుగోడులో కాంగ్రెస్ విజయం ఖాయం
చండూరు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూరులో శుక్రవారం పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ. 22 వేల కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగింది తప్ప, టీఆర్‌ఎస్ గెలిచాక చేసిందేమీ లేదన్నారు. అనంతరం కస్తాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, చలమల కృష్ణారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, మంచుకొండ సంజయ్ పాల్గొన్నారు.
‘పేట’ హాస్పిటల్‌లో శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో శుక్రవారం ఓ శిశువు చనిపోయింది. ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన కేతేపల్లి ఇంద్ర డెలివరీ కోసం ఈ నెల 12న సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చింది. ఆమెకు పెయిన్స్ వస్తున్నప్పటికీ నార్మల్ డెలివరీ అవుతుందని వెయిట్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇంద్రకు శుక్రవారం మరోసారి పెయిన్స్ రావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. కానీ అప్పటికే శిశువు చనిపోయింది. దీంతో డాక్టర్ల రెండు రోజుల పాటు నిర్లక్ష్యం చేయడం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. శిశువు మృతికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విమోచన దినోత్సవాన్ని సక్సెస్ చేయాలి
నార్కట్‌పల్లి, వెలుగు : నిజాం నిరంకుశ వ్యవస్థకు ఎదురు నిలిచి పోరాటం చేసిన గ్రామాల్లో గుండ్రాంపల్లి ముఖ్యమైనదని బీజేపీ మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జి మురళీధర్‌రావు చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుండ్రాంపల్లిలో అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన పోరాటాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ ఎంఐఏంకు కీలుబొమ్మగా మారి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేకపోయిందని విమర్శించారు. ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడంతో విధి లేని పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ప్రకటన చేసిందన్నారు. విమోచన దినోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, నల్గొండ పార్లమెంట్ బీజేపీ ఇన్‌చార్జి బండారు ప్రసాద్ పాల్గొన్నారు.
మృతుడి ఫ్యామిలీకి రాజగోపాల్ పరామర్శ
మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామానికి చెందిన కందాల సత్యనారాయణ గురువారం విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం సత్యనారాయణ ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించి, సంతాపం తెలిపారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గుజ్జ కృష్ణ, పెంబల జానయ్య ఉన్నారు.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
మునగాల (నడిగూడెం), వెలుగు : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన పలువురికి మంజూరైన పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇస్తామన్నారు. అనంతరం ఇటీవల చనిపోయిన టీఆర్‌ఎస్ కార్యకర్తల ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవిత నాగరాజు, సొసైటీ చైర్మన్లు పుట్ట రమేశ్, రాజేశ్ పాల్గొన్నారు.
ఎడమ కాల్వ గండిని త్వరగా పూడ్చండి
హాలియా, వెలుగు : సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని త్వరగా పూడ్చాలని కోరుతూ రైతులు, అఖిలపక్ష నాయకులు శుక్రవారం నల్గొండ జిల్లా నిడమనూరు సమీపంలోని మూడో నంబర్ కాల్వ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గండి పూడ్చే పనులు స్లోగా జరుగుతున్నాయన్నారు. ఓ వైపు కాల్వ నీళ్లు రాక, మరో వైపు కరెంట్ సక్రమంగా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గండి రిపేర్లు త్వరగా పూర్తి చేసి కాల్వకు నీళ్లు అందించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు కాంగ్రెస్, సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి రైతు సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకోలో నాయకులు అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, సీపీఎం నాయకులు కొండేటి శ్రీను, కోటేశ్ పాల్గొన్నారు.
‘సాయుధ పోరాటంతోనే నిజాం లొంగిపోయిండు’
యాదగిరిగుట్ట/నార్కట్‌పల్లి/మేళ్లచెరువు, వెలుగు : రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం లొంగిపోయిండని సీపీఐ జిల్లా అధ్యక్షుడు గోద శ్రీరాములు చెప్పారు. సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్టలో అమరులకు నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. వర్గ పోరాటాన్ని మత పోరాటంగా బీజేపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. సాయుధ పోరాటంతో సంబంధం లేని వాళ్లు దాని గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, జిల్లా సమితి నాయకుడు బబ్బూరి శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఉస్మానియా ప్రొఫెసర్ కాశీం, సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణంపై లోకాయుక్త విచారణ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నమాత్‌పల్లి వద్ద రూ. 65 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి పనులు నాసిరకంగా జరిగాయని గ్రామానికి చెందిన పలువురు ఇటీవల లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన లోకాయుక్త రిజిస్ట్రార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాథ్యూ కోషి శుక్రవారం గ్రామానికి వచ్చి బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లర్లలో హెచ్చుతగ్గులు, పైకి తేలిన రాడ్లు, వాటర్ లీకేజీ విషయాన్ని గ్రామస్తులు ఆయనకు వివరించారు. బ్రిడ్జి నిర్మాణంలో క్వాలిటీ పాటించని కాంట్రాక్టర్‌తో పాటు, అతడికి సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకొని, డబ్బులను రికవరీ చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ఎల్లంల వెంకటేశ్, జిట్ట అంజిరెడ్డి, తేల్జూరి మల్లేశ్, జిట్ట సత్తిరెడ్డి, రాజిరెడ్డి, దయాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, బబ్బూరి నర్సింహ పాల్గొన్నారు.
సంబురంగా సమైక్యతా ర్యాలీ
తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజైన శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీల్లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, స్టూడెంట్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చండూరులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరుకాగా, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ర్యాలీల అనంతరం మీటింగ్‌లు నిర్వహించారు.
- వెలుగు నెట్‌వర్క్
టీఆర్‌ఎస్ జెండాలతో ఉత్సవాలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరులో నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో టీఆర్‌ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ జెండాలకు బదులు పార్టీ జెండాలు, మెడలో కండువాలతో ర్యాలీలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే సంఘాల మీటింగ్ పేరుతో మహిళలను రప్పించి ర్యాలీలో పాల్గొనేలా చూశారు. ర్యాలీ ముగియగానే మహిళలు, స్టూడెంట్లు ఎక్కడివాళ్లు అక్కడే వెళ్లిపోవడంతో మీటింగ్‌లో ఖాళీ కుర్చీలు కనిపించాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతుండగా ప్రజలు వెళ్లిపోవడంతో ఆయన తన ప్రసంగాన్ని త్వరగా ముగించేశారు.
సాగర్ 20 గేట్లు ఓపెన్
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,12,429 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్ 20 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 2,95,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 9,500 క్యూసెక్కులు, వరదకాల్వకు 400 క్యూసెక్కులు, మెయిన్ పవర్ హౌజ్ ద్వారా 32,399 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పులిచింతలలో 13 గేట్ల ద్వారా...
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : పులిచింతలకు ఇన్‌ఫ్లో భారీగావస్తోంది. 3.09 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 13 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి
చండూరు (మర్రిగూడ), వెలుగు : ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా వివక్ష చూపడం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీ చర్లగూడెం ప్రాజెక్ట్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పరిహారం చెల్లించడంతో పాటు, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శివన్నగూడెం ప్రాజెక్ట్ పైలాన్ నుంచి మర్రిగూడ తహసీల్దార్ ఆఫీస్ వరకు శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో వారు మాట్లాడారు. ఒకే రాష్ట్రంలో రెండు రకాల ప్యాకేజీలు ఇస్తే ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమించాలని, నిర్వాసితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి, దేవరకొండ, నకిరేకల్ ఇన్‌చార్జులు విజయనాయక్, యాతాకుల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శులు రవీందర్, మన్నె సంజీవరావు పాల్గొన్నారు.