వరంగల్, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజగోపురం డిజైన్ ఖరారైంది. కంచి కామాక్షి, యాదాద్రి కంటే పెద్దదిగా దీనిని నిర్మించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ నిధులను వెచ్చించనున్నారు. ఇప్పటివకే ఆలయ మాడ వీధుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20కోట్లు, కుడా రూ.10కోట్లు కేటాయించింది. ఈ రెండు పనుల నిర్మాణంపై బుధవారం చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఆలయ ప్రధాన అర్చకుడు శేషు రివ్యూ నిర్వహించారు.
మాడ వీధులు ఉండాలి..
గర్భగుడిలోని అమ్మవారి పాదాల కంటే తక్కువ ఎత్తులోనే మాడవీధులు ఉండాలని పూజరులు ఓ నిర్ణయానికి వచ్చారు. భద్రకాళి ఆలయంలో శాకంబరి, నవరాత్రులు, బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించేలా 60 అడుగుల వెడల్పుతో దారులు నిర్మించాలని భావించారు. భక్తులు ఆలయం చుట్టూరా తిరిగే క్రమంలో అమ్మవారి కంటే వారంతా తక్కువ ఎత్తులో నడవాల్సి ఉంటుందని ప్రధాన పూజరులు వెల్లడించారు. ఈ లెక్కన ప్రస్తుతం భక్తులు ప్రధాన గేటు నుంచి ఆలయంలోకి వచ్చే దారుల ఎత్తులను చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. గర్భగుడిలోని అమ్మవారి పాదాల కంటే తక్కువ ఎత్తులో మాడవీధులు నిర్మించాల్సి ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తుల తాకిడితో ఓవైపు చెరువు, మరోవైపు పొడవాటి గుట్ట ఉన్నందున టెక్నాలజీ ఆధారంగా వీధుల నిర్మాణం పెద్ద సవాల్ అవనుంది.
కాజ్ వే.. బ్రిడ్జిలు అవసరం పడొచ్చు..
ఆలయ మాడవీధుల్లో అమ్మవారి రథం తిరగడాన్ని దృష్టిలో పెట్టుకుని ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా దారులు నిర్మించాల్సి ఉంటుందని నిట్ ప్రొఫెసర్లు కామేశ్వరరావు, రమణామూర్తి తెలిపారు. ఆలయానికి రెండు వైపులా చెరువు, మరోవైపు గుట్ట ఉన్న నేపథ్యంలో నీటిలో మాడవీధులు నిర్మించాలంటే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా.. ఆలయంలో వాడే రెగ్యూలర్, డ్రైనేజీ వాటర్ సాఫీగా వెళ్లడానికితోడు భారీ వర్షాలు కురిసే సమయాల్లో వరద నీరు ఎక్కడ నిలవకుండా 'కాజ్ వే' వంటివి అవసరం ఉంటాయన్నారు. ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయినందున నిర్మాణాలకు అనువుగా ఉందో లేదో చూడటానికి అక్కడి నేల స్వభావం (సాయిల్ టెస్ట్) తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు.
యాదగిరి గుట్ట కన్నా పెద్దగా రాజగోపురం
భద్రకాళి ఆలయానికి నిర్మించే గోపురం కంచి కామాక్షి, యాదాద్రి టెంపుల్ కంటే కూడా పెద్దదని రివ్యూలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. మిగతాచోట్ల 7 అంతస్తులు ఉండగా.. భద్రకాళి ఆలయానికి 9 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుందన్నారు. దీనికి రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు కానుందని అభిప్రాయపడ్డారు. వానలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో కొన్నిచోట్ల రాజగోపురాలు దెబ్బతిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఇలాంటి కట్టడాలు నిర్మించే క్రమంలో కంచి, మహాబలిపురం వంటి గోపురాలను నిర్మించిన అనుభవజ్ఞులైన సంస్థలకు ఇస్తే మేలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. మొత్తంగా నేల, వాతావరణం, ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సర్వేల చేసేందుకు అనువైన కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించాలని డిస్కస్ చేశారు. ఎండోమెంట్ ఆఫీసర్లు సునీత, ఆలయ ఈవో శేషుభారతి తదితరులు ఉన్నారు.
వచ్చే దసరా నాటికి నిర్మాణాలు పూర్తి కావాలి..
భద్రకాళి ఆలయ మాడవీధులు, రాజగోపురం నిర్మాణ పనులు వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ చీఫ్‍విప్ వినయ్‍భాస్కర్ ఆదేశించారు. వరంగల్‌ను టెంపుల్ టూరిజం కాన్సెప్టులో స్పిర్చువల్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లతో భద్రకాళి బండ్ ఏర్పాటు చేయగా.. వేల ఏండ్ల కింది జైన మతానికి చెందిన అగ్గలయ్య గుట్ట ప్రాంతం ఉన్నట్లు పేర్కొన్నారు. మాడవీధులు, రాజగోపురం నిర్మాణంలో ఎన్‍ఐటీ ప్రొఫెసర్ల సేవలు తీసుకోనున్నట్లు చెప్పారు.