పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ ఖాతాలో ఫండ్స్ మస్తుగున్నా..మొదలు పెట్టిన పనులు ముందుకు కదలడం లేదు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం రూ.7 కోట్ల నిధులు శాంక్షన్చేసి రెండేళ్లు దాటినా ఏడి పనులు ఆడనే ఉన్నాయి. ఏడాదిన్నర కాలంలో డివైడర్పనులు మాత్రమే పూర్తి చేసిన అధికారులు రోడ్ల నిర్మాణ పనులు మరిచిపోయారు. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు వస్తలేరని చెప్తున్నారు. దీంతో మున్సిపాలిటీలో గతుకు రోడ్లపై ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు విస్తరణ పేరుతో హైవే రెండు వైపులా షాపుల ముందు రోడ్డుతవ్వడం, ఇటీవల తరచుగా ముసురు పడుతుండడంతో పెబ్బేరు ప్రజల బాధలు వర్ణణాతీతం.
అడుగుకో గుంత..
అడుగుకో గుంత.. ప్రయాణానికి చింత అన్నట్లుగా మారింది.. పెబ్బేరు రోడ్ల పరిస్థితి. వనపర్తి రోడ్డులో కొద్ది రోజుల కింద రిపేర్లు చేసినా.. తరచుగా ముసురు పడుతుండడంతో చాలా చోట్ల డాంబర్ ఎగిరిపోయి గుంతలు పడ్డాయి. శివబాబా రైస్ మిల్ ముందు స్టార్ట్ అయిన డివైడర్ నుంచి మొదలుకుని దాని చివరి వరకు రోడ్డు మరీ అధ్వానంగా తయారయింది. బస్టాండు ముందు, చౌరస్తా దాటిన తర్వాత, పెట్రోల్ బంక్ ముందు రోడ్డు దుస్థితి, ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. రోడ్డుపై వెళ్లేవారు అక్కడికి రాగానే పాలకులను తిట్టని వారు లేరంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిత్యం ప్రమాదాలు..
కొద్దిరోజుల కింద నారాయణరెడ్డి కాంప్లెక్స్ ముందు భార్యభర్తలు బైక్పై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో పడి ప్రమాదానికి గురయ్యారు. మరికొద్ది రోజుల కింద డివైడర్ను ఢీకొని ఒకరు చనిపోయారు. ఇవన్నీ గమనించిన కొందరు యువకులు బస్టాండు వద్దనున్న రోడ్డుపై సొంత ఖర్చులతో మట్టి తెప్పించి పోయించారు. మున్సిపల్ఆఫీసర్లు ఇది చూసినా.. పట్టించుకుంటలేరు.
బిల్లులు ఆలస్యం చేస్తరని.. కాంట్రాక్టర్లు వెనుకడుగు..మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి 3డ సార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. గతంలో డివైడర్ వేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారులు నేటికీ బిల్లులు ఇవ్వలేదు. రోడ్డు నిర్మాణానికి ముందుకొస్తే ఈ బిల్లులు కూడా వస్తయో రావోనని జంకుతున్నట్లు తెలుస్తోంది.
దుమ్ము భరించలేకపోతున్నం..
మాది పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు పక్కన చిన్న హోటల్. రోడ్డుపై గుంతలు పడడంతో వెహికల్స్వెళ్లినప్పుడల్లా దుమ్ము రేగి కళ్లు నిండిపోతున్నాయి. అటుగా వచ్చిన అధికారులకు చెప్పినా వారు పట్టించుకుంటలే. ఎప్పుడో ఓ సారి మట్టి వేసి చేతులు దులుపుకుంటున్నరు.
- మురళి, పెబ్బేరు
వానొస్తే వణుకే..
పెబ్బేరు పట్టణంలోని ప్రధాన రోడ్లు గుంతలమయంగా మారాయి. వానొస్తే గుంతల్లో నీళ్లు చేరడంతో అవి కనిపించక వాహనదారులు కిందపడుతున్నారు. ఇటీవల కొంతమందిమి కలిసి సొంత ఖర్చులతో అక్కడక్కడ పెద్దగుంతలుంటే మట్టి వేస్తున్నం. అయినా వానొస్తే అది కొట్టుకుపోయి మళ్లీ ఎప్పటిలాగే అవుతోంది. నిర్మాణానికి నిధులున్నా.. పనులు చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యం ఎంతుందో తెలుస్తోంది.
– దిలీప్, పెబ్బేర
మరో సారి టెండర్లు పిలుస్తాం
రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు వస్తలేరు. ఇప్పటికే 3సార్లు టెండర్లు పిలిచినం. వచ్చే నెలలో మరోసారి పిలుస్తాం. ఈసారి కూడా ముందుకు రాకపోతే ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్కు అప్పగిస్తాం. వారితో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
జాన్కృపాకర్, మున్సిపల్ కమిషనర్, పెబ్బేరు