అణచివేత ఉన్న దగ్గరే తిరుగుబాటు వస్తది

అణచివేత ఉన్న దగ్గరే తిరుగుబాటు వస్తది

ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన హక్కుగా రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకోవడం సాధ్యపడుతుందని అనుకున్నాం. అంతెందుకు తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవమూ స్వరాష్ట్రం వస్తేనే నిలబడుతుందని నమ్మాం. కానీ తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబమే అన్నట్టుగా టీఆర్ఎస్ నియంతృత్వ పాలన సాగుతుండడం దురదృష్టకరం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లాంటి వాటిని మర్చిపోయి ఆ ఫ్యామిలీని ప్రసన్నం చేసుకుంటే చాలన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ గల్లీ లీడర్లు సైతం దాడులకు దిగుతున్నారు. టీఆర్ఎస్‌‌కు ఎవరైనా ఎదురు తిరిగితే అడ్డుతొలగించుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగదని పాలకులు గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రశ్నించేవారిని అణచివేసే పనిలో సర్కారు పెద్దలు బిజీగా ఉంటారో, అక్కడ  తిరుగుబాటు వచ్చి ప్రజలు మరో బలమైన ఆల్టర్నేటివ్‌‌ వైపు చూస్తారన్నది తెలుసుకోవాలి.

తెలంగాణ ఏర్పడితే న్యాయమైన మన హక్కులను పొందవచ్చన్న ఆకాంక్షతో రాష్ట్రమంతా ఏకమై పోరాడింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించి, రాష్ట్రం సాధించుకున్నాక ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమ లక్ష్యాలను గాలికొదిలేస్తోంది. వాటిని నెరవేర్చాలని ఎవరైనా గొంతెత్తినా, నిరసన చేపట్టినా అణచివేస్తోంది. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి, ప్రజల తరఫున పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనమైపోయాయి. ఈ క్రమంలో బీజేపీనే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ప్రజలు చూస్తున్నారు. ఆల్టర్నేటివ్‌‌ పవర్‌‌‌‌గా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోవాలని టీఆర్‌‌‌‌ఎస్ నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు దాడులు నిత్యకృత్యమయ్యాయి.

ప్రశ్నిస్తున్న నేతలపై వేధింపులు

టీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు మొదలు సామాన్య కార్యకర్తల వరకూ ఎవరినీ వదలకుండా అధికార పార్టీ వేధిస్తోంది. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఇంటిపై ఆ సమయంలో దాడి చేయడంతో ప్రారంభమైన అధికార పార్టీ దుశ్చర్యలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌‌లో రఘునందన్‌‌రావును ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన తీరు, అదే సమయంలో బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని అక్రమంగా ఓ కేసులో ఇరికించేందుకు విఫలయత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలైనాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌‌ నిర్బంధం, వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా లాఠీ చార్జ్ చేసిన తీరు.. ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా అణచివేస్తున్న తీరును రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ వాటి అమలు టైమ్‌‌లో సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలతో పాటు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల ఫొటోలు లేకపోవడంపై ప్రశ్నించినా బీజేపీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తున్న బీజేపీ సామాన్య కార్యకర్తలను వారికి న్యాయంగా అందాల్సిన సంక్షేమ పథకాలు దక్కకుండా చేస్తామని బెదిరింపులు, కొన్ని పథకాల అర్హుల జాబితా నుంచి బీజేపీ వాళ్ల పేర్ల తొలగింపు లాంటి పనులకు పాల్పడడం టీఆర్ఎస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిదర్శనం.

సామాన్యులనూ వదలని టీఆర్ఎస్

అధికార పార్టీ నేతల వేధింపులు ఒక్క బీజేపీ నేతలు, కార్యకర్తల వరకే పరిమితం కావడం లేదు. టీఆర్ఎస్‌‌ను ప్రశ్నిస్తే సామాన్య జనాలు, యువకులు, టీచర్లు, న్యాయవాదులు, ఉద్యోగులు ఎవరినీ వదలడం లేదు. టీఆర్ఎస్ నేతలను నిలదీస్తే ఫోన్లు చేసి బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టి మరోసారి తమకు అడ్డురావద్దని వార్నింగ్స్ ఇవ్వడం, ఏకంగా ప్రాణాలు తీయడానికీ వెనుకాడకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరసన తెలిపే నిరుద్యోగ యువతను, తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం పోరాడే ఉద్యోగులు, టీచర్లు, వారి యూనియన్లను అణచేస్తోంది టీఆర్ఎస్ సర్కారు. అందుకోసం ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికైనా వెనుకాడడం లేదు. మళ్లీ పోరాటం అనే మాట వినిపించకూడదన్నట్టు నియంతృత్వ ధోరణితో కేసీఆర్ సర్కారు పాలన సాగిస్తోంది. ప్రశ్నించే జర్నలిస్టులను మీకేం తెలియదంటూ దబాయించడం, ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాసి, కథనాలు ప్రసారం చేసే పత్రికలు, టీవీ చానళ్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. టీఆర్ఎస్ నేతల అక్రమాలపై లీగల్‌‌గా పోరాడుతున్న న్యాయవాద దంపతులను మంథనిలో కేసీఆర్ బర్త్‌‌ డే రోజున దారుణంగా హత్య చేయడాన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి.

దాడులతో దారికి తెచ్చుకోవడమా?

జాతీయవాద సిద్ధాంతంతో నిబద్ధతగా పని చేసే బీజేపీ నేతలు, కార్యకర్తలను దాడులతో తమ దారికి తెచ్చుకోవచ్చని, ప్రజలకు దూరం చేయొచ్చని టీఆర్ఎస్ అనుకుంటే అది మూర్ఖపు ఆలోచనే అవుతుంది. దేశహితం, జాతి పునర్నిర్మాణం, ప్రపంచంలో భారత్‌‌ను బలమైన శక్తిగా నిలపాలన్న ఆశయ సాధన కోసం ఏనాడూ బీజేపీ ప్రాణ త్యాగాలకు సైతం వెరవలేదు. నిత్యం ఉగ్రవాదుల దాడులతో అల్లకల్లోలంగా ఉండే కాశ్మీర్‌‌‌‌లో సైతం బీజేపీ కార్యకర్తలు భయపడలేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌‌ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు, తృణమూల్ అరాచకాలను తట్టుకుని నిలబడి, అక్కడ ఇప్పుడు బలమైన శక్తిగా బీజేపీ ఎదిగింది. ప్రజల తరఫున పోరాటాలను ఎప్పుడూ విడవలేదు. అణచివేతలు, హత్యాకాండలకు భయపడకుండా, మరింత కసిగా పోరాడుతోంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌‌లో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరింది. వీటిని చూసైనా టీఆర్‌‌‌‌ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ కండ్లు తెరుచుకోవాలి. పాలకుల అణచివేతలు కొనసాగిన చోట ప్రజలు మరో బలమైన ప్రత్యామ్నాయాన్ని  కోరుకుంటారని గుర్తించాలి. ఇప్పుడు ఆ బలాన్ని తెలంగాణ ప్రజలు బీజేపీలో చూస్తున్నారు. అందుకే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్లలోనూ టీఆర్ఎస్‌‌కు బుద్ధి చెప్పాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా అహంకారపూరిత, నియంతృత్వ ధోరణికి టీఆర్ఎస్ ఫుల్‌‌స్టాప్ పెట్టకుంటే ఆ పార్టీ ఒక చరిత్రగానే మిగిలిపోవడం ఖాయం.

ప్రజలకు అండగా నిలిస్తే భౌతిక దాడులా?

తెలంగాణ ఏర్పడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి తమ జీవితాలు బాగుపడతాయని ఉద్యమంలోకి ఉరికిన యువత ఏండ్ల తరబడి తమ చదువులను లెక్క చేయలేదు. ప్రాణ త్యాగాలు చేసైనా రాష్ట్రం సాధించుకోవాలని పోరాటం చేశారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరుతాయని భావించారు. కానీ నాడు ఉద్యమంలో పాల్గొన్న యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులపై సర్కారు
కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రజలకు మంచి చేసి వారి విశ్వాసం పెంచుకోవాల్సిన ప్రభుత్వం, మాయమాటలతో మభ్యపెడుతూ ప్రశ్నిస్తే అణచివేస్తూ పాలన సాగిస్తోంది. ఈ తీరును గట్టిగా ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు ప్రభుత్వం భౌతిక దాడులే మార్గంగా ఎంచుకుంది. ఇది టీఆర్‌‌‌‌ఎస్‌‌లో పెరుగుతున్న భయానికి సంకేతం.                       – సోలంకి శ్రీనివాస్, స్టేట్ సెక్రటరీ, బీజేవైఎం