- ములుగులో మూలుగుతున్న ధరణి
- భూ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది స్పెషల్ ప్రోగ్రామ్
- సీఎం నియోజకవర్గంలోని ములుగులో నిర్వహించిన అధికారులు
- వచ్చిన అప్లికేషన్లు 262.. పరిష్కారమైనవి 183
- పెండింగ్‌లో పెట్టిన అప్లికేషన్లపై పెదవి విప్పని ఆఫీసర్లు
- ఇక రాష్ట్రమంతా అమలుచేసేదెప్పుడు?
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు:
భూ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది జూన్ లో సిద్దిపేట జిల్లాలోని ములుగులో నిర్వహించిన ధరణి పైలెట్ ప్రాజెక్ట్ పత్తా లేకుండా పోయింది. ఆ టైంలో రైతులు పెట్టుకున్న చాలా దరఖాస్తులకు ఇప్పటివరకు మోక్షం లభించలేదు. అధికారులను అడిగితే కొన్ని పరిష్కారమయ్యాయని, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. దీంతో తమ సమస్యలు తీరతాయని ఆశ పడ్డ రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో ఏర్పడిన సమస్యలకు పరిష్కారం చూపడం కోసం గత ఏడాది జూన్ 14 నుంచి 24 వ తేదీ వరకు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగులో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్బంగా జరిగిన తప్పులు, ధరణి పోర్టల్‌లో లోపాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాడ్యుల్స్ లో మార్పు కోసం తీసుకోవాల్సిన చర్యలపై ములుగు గ్రామ పంచాయతీని యూనిట్ గా తీసుకుని 11 రోజుల పాటు స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ములుగు పంచాయతీ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లోనే వీటిలో 140 దరఖాస్తులను కలెక్టర్ లాగిన్ కు పంపగా, మాడ్యుల్స్ లో లేని 122 అప్లికేషన్లను సీసీఎల్ ఏకు పంపించారు. అధికారులను వీటి అప్డేట్ గురించి అడిగితే 183 దరఖాస్తులను పరిష్కరించామని, 47 అప్లికేషన్లపై నిర్ణయం తీసుకోలేదని, 32 దరఖాస్తులకు అధారాలు లేవని పక్కన పెట్టామని చెబుతున్నారు. అయితే, దరఖాస్తు చేసుకున్న చాలా మందికి అధికారుల నిర్ణయాలపై సమాచారమే లేదు.
పెండింగ్‌లో ఎందుకు ఉంచారో చెప్పట్లే
పైలెట్ప్రాజెక్టులో అన్ని భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని అధికారులు ప్రకటించినా 47 దరఖాస్తులపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఎందుకు ఉంచారో చెప్పడం లేదు. దీనికి తోడు సాదా బైనామాలను పక్కన పెట్టేయడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ములుగు పరిధిలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించి 262 దరఖాస్తులు వస్తే ఇందులో 35 దరఖాస్తులు సాదా బైనామాలకు సంబంధించినవే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి ముందు సాదా బైనామాల సమస్య పరిష్కరిస్తామని చెప్పినా తర్వాత మాట మార్చారు. మలుగు, వర్గల్ మండలాలు హెచ్ఎండీఎ పరిధిలో ఉన్నందున సాధ్యం కాదని చేతులెత్తేశారు. ఆ రెండు మండలాలు 2005 నుంచే హెచ్ఎండీఎ పరిధిలో ఉన్నాయని, అలాంటప్పుడు దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వీటికి తోడు16 పీఓటీ (ప్రొహిబిషన్ఆఫ్ట్రాన్స్ఫర్) కేసులను సైతం పెండింగ్ లోనే పెట్టారు.
ఇప్పటికే ఇద్దరు మృతి
పైలెట్ ప్రొగ్రామ్ లో దరఖాస్తు చేసుకున్న రైతుల్లో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఎక్కలి కుమార్ అనే రైతు భూ విస్తీర్ణంలో కరెక్షన్ కోసం అప్లై చేసుకున్నాడు. దీనికోసం చాలాసార్లు అధికారుల చుట్టూ తిరిగాడు. సమస్య పరిష్కారం కాకుండానే నెల రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇప్పుడు ఈయన కుటుబీంకులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి చెందిన రాములు అనే మరో రైతు కూడా తన సమస్యకు పరిష్కారం దొరకకముందే చనిపోయాడు.
అగ్గువకే భూముల అమ్మకం
తమ సమస్య పరిష్కారమవుతుందని భావించిన రైతులు ఇప్పుడు నమ్మకం లేక భూములను అగ్గువకే అమ్ముకుంటున్నారు. గ్రామ సమీపంలోని రాజీవ్ హైవేకి అనుకుని ఉన్న ఓ సర్వే నంబర్లోని 30 గుంటల పట్టా భూమిని ఐదు గుంటల చొప్పున మార్చాలని ఆరుగురు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆ భూమిని రూ.6 లక్షలకే అమ్ముకోవడానికి రెడీ అయ్యారు. కొందరు తమ దరఖాస్తుల సంగతి ఏమైందని ఆఫీసర్లను అడగడానికి భయపడుతుండగా, సమస్య పరిష్కారమైనవాళ్లు పాస్ బుక్స్ ఇవ్వకపోయినా అడగడానికి జంకుతున్నారు.
మేకల కనకయ్య ఉండేది సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో..
ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 99 లో ఇతడి నానమ్మ సత్తమ్మ పేరిట 2.26 ఎకరాల వ్యవసాయ భూమికి పట్టా ఉంది. గత ఏడాది ములుగులో నిర్వహించిన ధరణి పైలెట్ ప్రాజెక్టు సందర్భంగా ఇతడి తల్లి పోచమ్మ పేరు మీదికి 2.26 ఎకరాల భూమిని ఫౌతి చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ జరిపిన అధికారులు ధరణి వెబ్ సైట్లో 2.16 గుంటల భూమిని మాత్రమే పొచమ్మ పేరు మీదికి మార్చారు. మిగిలిన పది గుంటల గురించి అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదు.
ములుగుకే చెందిన బట్టు కిష్టారెడ్డికి 353/ ఈ సర్వే నంబర్లోని 1.10 గుంటల పట్టా భూమి తాత ముత్తాల నుంచి వారసత్వంగా వస్తోంది. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఈ భూమి వివరాలు కనిపించడం లేదు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్టులో సర్వే నెంబర్ మిస్సింగ్ కింద భూమిని ధరణి పోర్టల్‌లో తన పేరిట నమోదు చేసి పట్టా పాస్ బుక్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తన సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా అని కిష్టారెడ్డి ఎదురు చూస్తున్నాడు.
ఎరుకలి బక్కయ్య ములుగులోని 222/ఇ సర్వే నంబర్లో 9 గుంటల వ్యవసాయ భూమి ఇతడి తండ్రి ఎల్లయ్య పేరిట నమోదై ఉంది. గత ఏడాది గ్రామంలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్టు సందర్భంగా 9 గుంటల భూమిని తనతో పాటు నలుగురు సోదరుల పేరిట 2.25 గుంటల చొప్పున ఫౌతి చేసి పట్టా పాస్ బుక్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు అధికారులు చేసిందేమీ లేదు. దీంతో పాటు 100/4 సర్వే నంబర్లో బక్కయ్య పేరిట 1.08 ఎకరాల లావాణి భూమి ఉండగా, ధరణి పోర్టల్‌లో అది 8 గుంటలు మాత్రమే చూపుతోంది. మిగిలిన ఎకరం తన పేరుపైకి మార్చాలని మరో దరఖాస్తు పెట్టుకోగా అది అధికారుల జాబితాలోనే లేదు.
రైతులకు సమాచారం లేదు
ములుగులో పైలెట్ ప్రాజెక్ట్‌లో దరఖాస్తులపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కొద్ది టైం మాత్రమే తీసుకుంటామని చెప్పినా ఏడాదవుతోంది. సాదా బైనామాల దరఖాస్తులు తీసుకుని పరిష్కరించలేమని చెప్పడం రైతులను మోసం చేయడమే. వీలైనంత తొందరగా అందరి సమస్యలు పరిష్కరించాలి.
- సీహెచ్. కనకరాజు, వార్డు మెంబర్