
- నిర్మాణ పనుల్లో పదేండ్లు జాప్యం చేసిన బీఆర్ఎస్ పాలకులు
- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో పూర్తయిన పనులు
కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి రైల్వే గేటు సమస్య ఎట్టకేలకు తీరనుంది. రూ.35 కోట్ల ఫండ్స్‌తో క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కానున్నాయి. మరో 10 రోజుల్లోగా బ్రిడ్జి రాకపోకలకు అందుబాటులోకి రానుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవచూపడంతో దశాబ్దకాలంగా నిరీక్షిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కలలు సాకారం కానున్నాయి.
రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం డిమాండ్…
మందమర్రి, నెన్నెల మండల పరిధిలోని రామకృష్ణాపూర్, మందమర్రి పట్టణాలతో పాటు 30 ఊర్లకు చెందిన వేలాది మంది నిత్యం క్యాతన్‌పల్లి రైల్వే గేటు మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. చెన్నై న్యూఢిల్లీ బ్రాడ్‌గేజ్ మార్గంలో రైల్వే గేటు ఉంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు వస్తుండగా.. సుమారు 140 రైళ్లు రాకపోకలు జరుగుతుండడం వల్ల గేటు వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుండేది. ప్రజలు గంటల తరబడి గేట్ వద్ద నిరీక్షించాల్సి వచ్చేది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక రైల్వేగేటు వద్దనే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మించాలని స్థానికులు ఏళ్లుగా డిమాండ్ చేశారు.
పదేండ్లు దాటిన పూర్తికాని అప్రోచ్‌రోడ్డు
రైల్వే శాఖ ఆధ్వర్యంలో ట్రాక్‌పై ఆర్వోబీ పూర్తి చేయగా దానికి ఇరువైపులా 1100 మీటర్ల పొడవున చేపట్టిన అప్రోచ్‌రోడ్డు నిర్మాణ పనులను అప్పటి బీఆర్ఎస్ పాలకులు పదేండ్లలో చేయించలేకపోయారు. అప్రోచ్ రోడ్డు కోసం సుమారు 8.22 ఎకరాల స్థలాన్ని సేకరించారు. భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యం కాగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. స్థలసేకరణ, భూనిర్వాసితుల సమస్య పరిష్కారంపై అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేదు. చెన్నూరు ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు కొనసాగుతున్న కాలంలో రాష్ట్ర సర్కార్ అప్రోచ్ రోడ్డు, భూనిర్వాసితుల పరిహారం కోసం రూ. 30.50 కోట్లను శాంక్షన్ చేసింది.
రైల్వే గేటు వద్ద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పదేండ్లు ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు తరచూ టెక్నికల్ ప్రాబ్లమ్, రిపేర్ల పేరుతో రోజుల తరబడి మూసి ఉండేది. వైద్యం కోసం వెళ్తూ గేటు వద్ద నిరీక్షించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. నవంబర్15, 2023లో రైల్వే గేటు పడడంతో కింది నుంచి బైక్ తీసుకువెళ్తుండగా రైలు ఢీకొని భూక్యా సురేశ్, కుంబాల చందు అనే యువకులు చనిపోయారు. కాంట్రాక్టర్ బ్రిడ్జి ఫిల్లర్ల కోసం గుంత తవ్వి వదిలివేయడంతో ప్రమాదవశాత్తు ఒకరు అందులో పడి చనిపోయాడు.
ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో పనుల్లో స్పీడ్..
రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మంచిర్యాల వైపు సుమారు 25 మంది, రామకృష్ణాపూర్ వైపు 11 మంది రైతులు తమ భూములను కోల్పోయారు. రామకృష్ణాపూర్ వైపు ఉన్న వారికి పదేండ్లలో ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా సర్వీసు రోడ్డు కోసం భూమి కూడా సేకరించలేదు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయించడంపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 11 మంది భూనిర్వాసితులు పరిహారం రాకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి రూ. 50 నుంచి 70 లక్షల పరిహారం ఇప్పించారు. రామకృష్ణాపూర్ వైపు సర్వీసు రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆఫీసర్లతో మాట్లాడి అప్రోచ్ రోడ్డుకు అవసరమైన ఫ్లైయాష్‌ను ఇప్పించారు. పనుల్లో నిర్లక్ష్యం చూపుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మరో లేయర్ బీటీ, రంగులు వేయాల్సి ఉందని ఆర్అండ్బీ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో ఫండ్స్…
పదేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు దూరం చేసేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేక్‌వెంకటస్వామి 2014లో రూ.32కోట్లు నిధులను ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్రం నుంచి శాంక్షను చేయించారు. 2014 సంవత్సరం సెప్టెంబర్‌లో క్యాతనపల్లి గేటు వద్ద గల రైల్వే ట్రాక్ పైభాగంలో రైల్వేశాఖ ఆర్వోబీ(బ్రిడ్జి) పనులు చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసింది.