డిండి పూర్తికాలే.. ఫ్లోరైడ్​ పీడ పోలే

నల్గొండ జిల్లాలో పనులకు ఏడేండ్ల కింద సీఎం కేసీఆర్​ శంకుస్థాపన
రూ.6 వేల కోట్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా చుక్క నీళ్లు వస్తలే 
ప్రాజెక్టుకు నీళ్లెట్ల తేవాలో ఇప్పటికీ తేల్చని సర్కారు

నల్గొండ, వెలుగు : మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్​ గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేసేందుకు చేపట్టిన డిండి లిఫ్ట్​ఇరిగేషన్​ ప్రాజెక్టు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. ఈ లిఫ్ట్ స్కీం ఆధారంగా నల్గొండ జిల్లాలో నిర్మించతలపెట్టిన 9 రిజర్వాయర్లకు సీఎం కేసీఆర్​ఏడేండ్ల కింద శంకుస్థాపన చేసినా ఫండ్స్​ లేక మధ్యలోనే ఆగిపోయాయి. అసలు డిండి స్కీంకు నీళ్లు ఎక్కడి నుంచి తేవాలనే విషయంలోనూ ఇప్పటికీ సర్కారుకు క్లారిటీ లేదు. ఏదుల రిజర్వాయర్​, లేదంటే ఉల్పర బ్యారేజీ నుంచి నీటిని తరలించాలన్నది ప్లాన్​ కాగా, ఇందుకు రూ.600 కోట్లతో అంచనా తయారు చేశారు. ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో మరోప్లాన్ తయారు చేశారు. ఈ రెండింటిలో ఏది  బెటర్ అనేది తేల్చకుండా ఏడేండ్ల నుంచి ప్రభుత్వం నాన్చుతోంది. కాగా, డిండి ప్రాజెక్టు కోసం రూ.6 వేల కోట్లు కేటాయించగా.. అందులో ఇప్పటివరకు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకూ నీళ్లందించిన పాపాన పోలేదు. దీంతో నల్గొండ జిల్లాలో పంట పొలాలకు ఫ్లోరైడ్​ పీడ పోలేదు.

2007 నుంచి నాన్చుతున్నరు.. 
ఉమ్మడి ఏపీలో డిండి ప్రాజెక్టు కోసం డీపీఆర్​తయారు చేయాలని 2007లో అప్పటి సర్కారు నిర్ణయించింది. కానీ తెలంగాణ ఏర్పడేదాకా డీపీఆర్​లు ప్రభుత్వానికి సమర్పించలేదు. అయితే ఫ్లోరైడ్​మహమ్మారి పోవాలంటే భూ ఉపరితల జలాలతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్​పలు సందర్భాల్లో చెప్పారు. భగీరథ నీటితో 10 శాతం మాత్రమే తాగునీటి సమస్య తీరుతుందని, పూర్తిస్థాయిలో తాగు, సాగునీటి సమస్య తీరాలంటే డిండి ఎత్తిపోతల పథకం ఒక్కటే శరణ్యమని పేర్కొన్నారు. 2015లో శివన్నగూడెంలో సీఎం కేసీఆర్​ రిజర్వాయర్​ పనులకు శంకుస్థాపన చేశారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 3.41 లక్షల ఎకరాల్లో ఆయకట్టును నిర్ధారిస్తూ రూ.6,194 కోట్లతో 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందులో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక జరిగే 6 మండలాల పరిధిలోని 83 గ్రామాల్లో 1,76,320 ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ ఏడేండ్లు కావొస్తున్నా ఇప్పటివరకు శ్రీశైలంలో ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలన్నది నిర్ధారణ కాలేదు. 

ఫైనల్​కాని ప్రతిపాదనలు
శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకునేలా డిండి ప్రాజెక్టు చేపట్టారు. మొదట పాలమూరు ఎత్తిపోతలలోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పుల 60 రోజులపాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీని తర్వాత పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్​ నార్లాపూర్​నుంచి నీటిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఇందుకు భూసేకరణ చేయాల్సి రావడంతోపాటు అటవీ భూములు ముంపునకు గురవుతుండడంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజాగా మళ్లీ కొత్త ప్రపోజల్ తెచ్చారు. వట్టెం నుంచి వాటర్​ డైవర్షన్  చేద్దామని, ఆ రకంగా ఎస్టిమేట్లు తయారు చేయాలని ఈఎన్​సీ చెప్పారు. ఆ మేరకు రూ.1,320 కోట్లతో ప్రపోజల్​రెడీ చేసి పంపారు. ఈ ప్రతిపాదనపై తెలంగాణ రిటైర్డ్​ ఇంజినీర్ల ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదుల నుంచి ఉల్పర రిజర్వాయర్​లోకి నీటిని మళ్లిస్తే గ్రావిటీ కాలువల ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న రిజర్వాయర్లలోకి తరలించవచ్చని, ఇందుకు  రూ.635 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పింది. దీంతో ఈ ప్రపోజల్​నూ ఈఎన్​సీకి పంపారు. ఈ 2 ప్రతిపాదనలు సర్కారు వద్దే పెండింగ్​లో ఉన్నాయి.

ఆగిన రిజర్వాయర్ల పనులు
డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం ఆగిపోవడంతో ఫ్లోరైడ్​ నిర్మూలన కోసం చేపట్టిన శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పనులు కూడా పెండింగ్​లో పెట్టారు. చౌటుప్పల్​ మండలానికి తాగు, సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులూ పూర్తికాలేదు. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఈ పనులు ఆగాయి.  నార్కట్​పల్లి మండలంలో నిర్మిస్తున్న బ్రహ్మణవెల్లంల రిజర్వాయర్​ నుంచి మునుగోడు మండలంలో 11 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ప్రధాన కాల్వల పనులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోడంతో పనులు ఆగిపోయాయి. రాచకొండ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయింది.