ఇంజినీరింగ్​తోనే ప్రపంచ అద్బుతాలు ఈఎస్​సీఐ డైరెక్టర్ రామేశ్వరావు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని అద్భుతాలన్నీ ఇంజినీరింగ్ టెక్నాలజీతోనే సాధించారని, చరిత్ర ప్రారంభంతోనే ఇంజినీరింగ్ టెక్నాలజీ కూడా ప్రాణం పోసుకున్నదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ సీఐ) డైరెక్టర్  డా. జి రామేశ్వర రావు అన్నారు. రాబోయే రోజుల్లో ఇంజినీరింగ్ విద్య మానవ మేధస్సుని చాలెంజ్ చేసేలా ఉండే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఇంజినీర్స్ డే సందర్బంగా గచ్చిబౌలిలో ప్రముఖ ఇంజినీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డైరెక్టర్ తో పాటు ఫ్యాకల్టీ నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా రామేశ్వర రావు మాట్లాడారు. ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటంతోనే ప్రపంచం ప్రగతిని సాధించిందని, భవిష్యత్తులో ఈ వేగం మరింత పుంజుకుంటుందని చెప్పారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను 1981లో హైదరాబాద్ లో స్థాపించారని పేర్కొన్నారు. గత 40 ఏండ్లుగా వేలాది మంది అభ్యర్థులకు ఇంజినీరింగ్ కు సంబంధించిన విద్యలో శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలువురు ఇంజినీర్లు డా. కృష్ణప్రసాద్ రావు, డా. విద్యా సాగర్, డా. ప్రశాంత్, డా.ఎ.జగన్ మోహన్ రెడ్డి, డా. ఆదినారాయణ, డా. చంద్రకళ, లక్ష్మీకాంతరావు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.