- తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేయలే
- పట్టించుకోని అధికారులు, ప్రబుత్వం
- ఇదీ కెఎంసీ సీఎంఎస్ఎస్ వై ఆస్పత్రిలో పరిస్థితి
హనుమకొండ, వెలుగు :నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దవాఖానా నిర్లక్ష్యానికి గురవుతోంది. రూ.కోట్లు ఖర్చు చేసి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) ఆవరణలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఏర్పాటు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో పైసా ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని వస్తున్న నిరుపేద పేషెంట్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మండుటెండలో కనీసం గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది. డాక్టర్లు రాసే మందులు కూడా సగం బయట కొనుక్కోవాల్సి వస్తోంది. అంతేగాకుండా దవాఖానాలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. తరచూ పవర్‌కట్ అవుతుండడంతో స్కానింగ్, ఆపరేషన్ల కోసం పేషెంట్లు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరించాల్సిన ఆఫీసర్లు చేతులెత్తేయడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద రోగులు తిప్పలు పడుతున్నారు.
20 కోట్లే ఇచ్చిన రాష్ట్ర సర్కారు
ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాకు చెందిన నిరుపేదలు వైద్యం కోసం ఎంజీఎం దవాఖానాకు వస్తుంటారు. ఏం తక్కువ రోజూ మూడు నుంచి నాలుగు వేల వరకు ఓపీ ఉంటుంది. 200 నుంచి 300 మంది ఇన్పేషెంట్లుగా జాయిన్ అవుతుంటారు. ఇందులో కొంతమందికి సూపర్‌స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవసరమవుతుంది. ఎంజీఎంలో పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ లేక చాలామంది ప్రైవేటు దవాఖానాలకు వెళ్లేవారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద వరంగల్‌కు రూ.150 కోట్లతో 250 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.120 కోట్లు కాగా..రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు భరించాలన్నది ఒప్పందం. కాగా, రాష్ట్రం ఇవ్వాల్సిన వాటాలో రెండు విడతలుగా రూ.20 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయగా.. ఏడాదిన్నర కిందట కేఎంసీ ఆవరణలో ఉన్న బిల్డింగ్‌లో ఎక్విప్మెంట్ ఫిక్స్చేశారు. దీంతో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విభాగాల్లో ట్రీట్మెంట్ అందించే ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేయడంతో వివిధ జిల్లాల నుంచి పేషెంట్లు ఇక్కడికి తరలివస్తున్నారు.
గొంతు తడిచే మార్గం లేదు
దవాఖానాలో 250 బెడ్లు ఉండగా..రోజూ ఓపీ కోసం 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. ఐదు నుంచి 10 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. దవాఖానా నిర్వహణను చూసుకోవాల్సిన రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం మానేయడంతో హాస్పిటల్లో నీళ్ల కోసం గోస పడాల్సి వస్తోంది. టాయిలెట్స్ కోసం వాటర్ సప్లై సిస్టం ఏర్పాటు చేసినా, డ్రింకింగ్ వాటర్ సంగతి పట్టించుకోలేదు. కనీసం నల్లాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఓపీ సేవలు మొదలై ఏడాది దాటినా ఇంతవరకు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో పేషెంట్లు, అటెండెంట్లు బయట నుంచి బాటిల్స్ కొనుక్కుని వచ్చి తాగుతున్నారు. ఒకవేళ దవాఖానా లోపలకు వచ్చిన తర్వాత దాహం వేస్తే నీళ్లు కొనుక్కోవడానికి దాదాపు కిలోమీటర్ వరకు నడిచి వెళ్లాల్సి వస్తోంది. హాస్పిటల్లో పని చేసే సిబ్బంది కూడా ఇంట్లో నుంచి నీళ్ల బాటిల్స్ తెచ్చుకుని తాగుతున్నారు.
సగం మందులు బయట కొనుడే
దవాఖానాలో డాక్టర్లు మందులు రాస్తున్నప్పటికీ..ఇందులో సగం మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా మందులను బయట ప్రైవేటు మెడికల్‌షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తోంది. నిజానికి పేషెంట్లకు డాక్టర్లు రాసే మందులను బట్టి సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు ఇండెంట్ పెట్టి స్టాక్ తెప్పించాలి. కానీ ఇక్కడ సూపర్వైజింగ్ బాధ్యతలు చూస్తున్న ఆఫీసర్లు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో పేషెంట్లు ప్రైవేటు మెడికల్‌షాపుల బాట పట్టాల్సి వస్తోంది.
కరెంట్ కటకట
పీఎంఎస్ఎస్వై బిల్డింగ్ కు పవర్‌సప్లై విషయంలో టెక్నికల్ఇష్యూస్ ఉండడంతో తరచూ కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా ఆపరేషన్లు, ఎమ్మారై, ఇతర స్కానింగ్ లు ఆగిపోతున్నాయి. బుధవారం ఉదయం కూడా ఉదయం ఏడు గంటలకు పోయిన కరెంట్ సాయంత్రం ఆరు గంటల వరకూ రాలేదు. దీంతో దవాఖానా మొత్తానికి పవర్‌సప్లై నిలిచిపోవడంతో పేషెంట్లు, డాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. ట్యాంకులోకి వాటర్ ఎక్కించకపోవడంతో టాయిలెట్స్‌కు నీళ్ల సరఫరా ఆగిపోయి అందులో ఉన్నవారు ఇబ్బందులు పడ్డారు. ఇలా కరెంట్సరఫరా నిలిచిపోవడం కొత్తేమీ కాదని, వారంలో రెండు, మూడు రోజులు ఇలాగే ఉంటుందని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. సూపర్వైజింగ్ చేయాల్సిన ఆర్ఎంవో స్థాయి ఆఫీసర్ తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం, పెద్దాఫీసర్లు లైట్తీసుకుంటుండటంతో పేషెంట్లకు అవస్థలు తప్పడం లేదు.
నీళ్లు కొనుక్కొని తాగుతున్నం
మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే నాలుగు రోజుల కిందట కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో అడ్మిట్ చేశాం. కానీ తాగడానికి నీళ్లు లేక బయటి నుంచి కొనుక్కుని తాగుతున్నాం. ఆఫీసర్లకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– అశోక్, పేషెంట్ బంధువు, వరంగల్
కరెంట్ లేదని ఆపేసిన్రు
మా బంధువుకు పక్షవాతం వస్తే ఎంజీఎంలో అడ్మిట్ చేసినం. ఎమ్మారై కోసం సూపర్‌స్పెషాలిటీ దవాఖానాకు పంపించారు. ఇక్కడ కరెంట్ లేదని, డాక్టర్లు లోపలికే రానియ్యలే. ఎప్పుడొచ్చినా కరెంట్‌లేదు మేమేం చెయ్యాలె అంటున్నరు. మెరుగైన వైద్యం అందుతుందనుకుంటే ఇక్కడే ఎక్కువ ఇబ్బంది అవుతోంది.
– ఎండీ అస్లమ్, పేషెంట్ బంధువు, హనుమకొండ
మందులు బయట కొనుక్కోమన్నరు
ఛాతిలో నొప్పి వస్తోందని డాక్టర్‌కు చూపించుకుందామని వచ్చిన. చెకప్ చేసి మందులు రాసిండు. కానీ ఇక్కడున్నోళ్లు రెండు రకాల గోళీలు లేవని, బయట కొనుక్కోమని చెప్పి పంపిస్తున్నరు. అసలే ఎండా కాలం. నడుచుకుంట ఎంతదూరం పోవాలె. మందులన్నీ ఒకేచోట ఇచ్చేలా చూడాలి.
– యాకయ్య, దుగ్గొండి, వరంగల్ జిల్లా
ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినం
పీఎంఎస్ఎస్వై దవాఖానాకు పవర్ సప్లై విషయంలో వైరింగ్ ప్రాబ్లమ్ ఉంది. సమస్యను సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ, ఉన్నతాధికరుల దృష్టికి తీసుకెళ్లాం. వాటర్ ప్రాబ్లమ్ గురించి కలెక్టర్ కు విన్నవించాం. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అన్ని రకాల మందులు దొరికేట్టు చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళతాం. పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
-– డా.గోపాల్‌రావు, ఆర్ఎంఓ, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్