సూర్యాపేట జిల్లా : కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ కేటాయిస్తే పార్టీకి సహకరించమని అసమ్మతి వర్గం తేల్చి చెప్పింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ సూచనతో బొల్లం మల్లయ్య యాదవ్ ను గెలిపించామని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు అన్నారు. కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోదాడ టికెట్ బొల్లం మల్లయ్యకి కేటాయిస్తే రెబల్ గా పోటీ చేస్తానని కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఇన్ చార్జ్ శశిధర్ రెడ్డి చెప్పారు. నాయకులు, ప్రజలు సహకరిస్తేనే 700 ఓట్లతో బొల్లం మల్లయ్య గెలిచాడని, ఈసారి నాయకులు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే ఎమ్మెల్యే బొల్లంకు పోలైన ఓట్లు 11వేలు మాత్రమే అని చెప్పారు. ఇప్పుడు పోటీచేస్తే 11 వేల ఓట్లు కూడా రావన్నారు. మల్లయ్య యాదవ్ కి మళ్లీ టికెట్ కేటాయిస్తే.. అవినీతిగా కేరాఫ్ అడ్రస్ గా కోదాడ మారుతుందన్నారు. కోదాడ నుండి బొల్లం మల్లయ్య యాదవ్ కి టికెట్ ఇస్తే ఒడిస్తామని హెచ్చరించారు.