హరిప్రియకు బీఫాం ఇస్తే మేం పనిచేయం : ఇల్లెందు అసమ్మతి నేతల అల్టిమేటం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో మండలాల వారీగా అసమ్మతి నేతలు మీటింగ్​లు పెడుతూనే ఉన్నారు. ఈసారి హరిప్రియకు బీఫాం ఇస్తే తాము పనిచేయబోమని బీఆర్ఎస్ హైకమాండ్​కు ఇల్లెందు అసమ్మతి నేతలు అల్టిమేటం ఇచ్చే వరకు వెళ్లారు.

ఆదివారం బయ్యారం మండలంలో అధికారపార్టీ అసమ్మతి నేతలు సమావేశమై ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాగా అసమ్మతి నేతలు ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మంత్రి హరీశ్​రావుకు ఎమ్మెల్యే తీరుపై కంప్లైంట్​ఇచ్చారు. నియోజకవర్గంలో హరిప్రియ, ఆమె భర్త ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ఏ విధంగా నష్టపోతున్నదో వివరించారు.

హరిప్రియకు కాకుండా ఇతరులెవరికైనా టికెట్​ఇస్తేనే తాము పనిచేస్తామని త్వరలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను కలిసి వింవరించేందుకు అసమ్మతి నేతలు సన్నద్దమవుతున్నారు. బయ్యారంలో జరిగిన అసమ్మతి నేతల మీటింగ్​లో ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు, బీఆర్​ఎస్​ జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు మూల మధుకర్​ రెడ్డి, దేవీలాల్​ నాయక్​, జానీ, గణేశ్​పాల్గొన్నారు.