ఎమ్మెల్సీ ఇస్తామంటే అసమ్మతి నేతలు.. నమ్ముతలే

ఎమ్మెల్సీ ఇస్తామంటే అసమ్మతి నేతలు.. నమ్ముతలే
  • గతంలో చెప్పినోళ్లకే ఇంకా ఇయ్యలేదనే ఫీలింగ్‍
  • ఉన్న 40 స్థానాలు ఫుల్​.. 2025లో ఖాళీ కానున్న 7 స్థానాలు

వరంగల్‍, వెలుగు: అధికార బీఆర్‍ఎస్‍ పార్టీలో అసమ్మతి నేతల వద్ద ‘ఎమ్మెల్సీ అస్త్రం’ పనిచేయడం లేదు. నాలుగు రోజుల కింద పార్టీ అధినేత కేసీఆర్ 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. 95 శాతం కంటే ఎక్కువ సిట్టింగులకే తిరిగి సీట్లు కేటాయించారు. గతంలో పెద్దాయనతో పాటు పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్ కేటీఆర్‍ మాటతో నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగిన ఇతర లీడర్లంతా నారాజ్‍ అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో క్యాండిడేట్లను మార్చాలని.. లేదంటే సహకరించే ప్రసక్తి లేదని బాహాటంగానే మీటింగులు పెడ్తున్నారు. కాగా, పార్టీ పెద్దలు మాత్రం ‘ఎమ్మెల్సీ పోస్ట్’ ఇస్తామంటూ వారికి ఆశ చూపుతున్నారు. అయితే ఇంకో రెండేండ్ల దాకా రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. మరోవైపు వివిధ సందర్భాల్లో గతంలో ‘ఎమ్మెల్సీ ఆఫర్‍’ పొందిన్నోళ్లు చాలా మంది ఇంకా వెయిట్‍ చేస్తూనే ఉన్నారు.

కడియం, కౌశిక్​ రాజీనామా చేస్తే..

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 40 మాత్రమే. వీటన్నింటిని ఎప్పుడో నింపేశారు. ఈ మధ్యనే ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‍, కుర్మయ్యగారి నవీన్‍ కుమార్‍, చల్లా వెంకట్రామిరెడ్డిలను అధినేత నామినేట్ చేశారు. గవర్నర్‍ కోటాలో దాసోజు శ్రవణ్‍, కుర్రా సత్యనారాయణలను ఎంపిక చేశారు. ప్రస్తుత బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకున్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‍ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తే ఆ రెండు మాత్రమే ఖాళీ అవుతాయి. 

ఏడాదిన్నర తర్వాతే

2025 మార్చి 29 వరకు ఆగితే.. ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలు, పట్టభద్రుల కోటాలో నిజామాబాద్‍ ఆదిలాబాద్‍, మెదక్‍, కరీంనగర్‍ 01, టీచర్స్ కోటాలో నల్గొండ, వరంగల్‍, ఖమ్మం 01, నిజామాబాద్‍ ఆదిలాబాద్‍, మెదక్‍, కరీంనగర్‍ 01 ఖాళీ అవుతాయి. ఈ లెక్కన ఏడాదిన్నర ఆగాల్సిందే. 2026లో మరో ముగ్గురు, 2027 వరకు 10 మంది.. ఇలా 2029 వరకు ఒక్కొక్కరి గడువు ఉంది. 2025లో గడువు ముగిసేవారిలో సైతం గిరిజన మహిళా మంత్రి సత్యవతి రాథోడ్‍, మహ్మద్‍ అలీ వంటి మరోసారి పదవులు వచ్చే అవకాశం ఉన్న వర్గాల నేతలే ఉన్నారు.

వెయిటింగ్​లిస్ట్​లో పదుల సంఖ్యలో లీడర్లు

రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‍ ఫ్యామిలీ స్వయంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు చెబుతున్న నేతలే 20 నుంచి 25 మంది వరకు ఉన్నారు. వీరంతా ఏండ్లుగా కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే.. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మునుగోడు బైఎలక్షన్ల ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్‍ స్వామి గౌడ్‍, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‍, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, హుజూరాబాద్‍ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‍ వెంటున్న ఎంబీసీ కార్పొరేషన్‍ చైర్మన్‍ తాడూరి శ్రీనివాస్‍, ఉమ్మడి వరంగల్‍కు చెందిన కేయూ ప్రొఫెసర్‍, మాజీ ఎంపీ సీతారాం నాయక్​ వంటి నేతలు ఉన్నారు. వీరేగాక వివిధ కోటాల్లో.. జీహెచ్‍ఎంసీ మాజీ కోఆప్షన్‍ మెంబర్‍ విద్యా వర్ధని, పీఎల్‍ శ్రీనివాస్‍, రాజీవ్‍ సాగర్‍, కామారెడ్డి టీఆర్‍ఎస్‍ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‍, టీఎస్​పీఎస్సీ మాజీ చైర్మన్‍ గంటా చక్రపాణి తదితరులు వెయిటింగ్‍ లిస్టులో ఉన్నారు.

ఎమ్మెల్సీలకు  అవమానాల' ఫీలింగ్‍

రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి అనేది కేవలం అలంకారప్రాయం అనే ఫీలింగ్‍ ఉంది. అధికార బీఆర్‍ఎస్‍ పార్టీ నుంచి 33 నుంచి 35 మంది ఎమ్మెల్సీలుగా ఉండగా.. మంత్రి పదవులు దక్కించు కున్నవారు తప్పించి ఇతరులకు అంత గా ప్రాధాన్యం లేదు. నియోజకవర్గాల్లో ‘ఎమ్మెల్యేలే కింగ్‍’ అనేలా సీఎం కేసీఆర్‍ పవర్స్​ ఇవ్వడంతో ఎమ్మెల్సీ పదవులు దక్కినోళ్లు ఆఫీసులకే పరిమితం అవు తున్నారు. కనీసం ప్రొటోకాల్‍ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానం కూడా అంద డం లేదు. కేడర్‍ ఎవ్వరిని వీరివెంట తిరగనివ్వడంలేదు. మెజార్టీ ఎమ్మె ల్సీలు ఓ విధంగా నియోజకవర్గాల్లో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ గమనిస్తున్న అసమ్మతి నేతలు ఆలోచనలో పడ్డారు.