స్వచ్ఛ్ భారత్ వైపు జనం అడుగులు

స్వచ్ఛ్ భారత్ వైపు జనం అడుగులు

ఐదేళ్ల కిందట ప్రారంభమైన ‘స్వచ్ఛ్ భారత్ మిషన్ ’ అంచెలంచెలుగా సక్సెస్ అయింది. స్వచ్ఛ్ భారత్ ప్రారంభమైన ఏడాదికి చేసిన సర్వేలో తమ పట్టణాలు పరిశుభ్రంగా మారాయని కేవలం 23 శాతం మంది ప్రజలు చెప్పారు. ఆ తరువాతి ఏడాది మళ్లీ సర్వే  చేస్తే  వీరి సంఖ్య 61 శాతానికి పెరిగింది. ఐదేళ్ల తరువాత చేసిన తాజా సర్వేలో తామున్న ఊళ్లు, పట్టణాలు శుభ్రత విషయంలో బాగుపడ్డాయని 72 శాతం మంది ప్రజలు చెప్పడం విశేషం. అయితే ప్లాస్టిక్ వాడకంపై, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయడం పై  ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి పెద్ద ఎత్తున డంప్ యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

స్వచ్ఛ్  భారత్ ఒక సాదాసీదా పథకం కాదు. పరిశుభ్రతకు గాంధీజీ టాప్ ప్రయారిటీ ఇచ్చారు. గాంధీజీ ఇచ్చిన ఇన్ స్పిరేషన్ తో ఐదేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని  ప్రారంభించారు. ఈ ఐదేళ్ల కాలంలో దేశాన్ని ‘ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ’ గా ( బహిరంగ మల విసర్జన) మార్చడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రయత్నమే చేసింది. ఆరు లక్షల గ్రామాలు, 63 లక్షల నగరాల్లో పది కోట్ల టాయిలెట్లను నిర్మించింది. పరిశుభ్రతకు సంబంధించి గాంధీజీ కలల్ని నిజం చేశామన్నారు ప్రధాని మోడీ.

స్వచ్ఛ్​ భారత్ మిషన్ (ఎస్బీఎం) ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. ఈ దశలో చేయాల్సింది చాలానే ఉంది. టాయిలెట్ల నిర్మాణంతోనే అంతా అయిపోయిందనుకోకూడదు. పల్లెల్లో టాయిలెట్లు నిర్మిస్తున్నారు కానీ వాటిని వాడుకోవడానికి ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదన్న సమాచారం అందుతోంది. శానిటేషన్ ప్రోగ్రాంకు, స్వచ్ఛ్ భారత్ మిషన్ కు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే. గతంలో అమలు చేసిన ‘నిర్మల్ భారత్ అభియాన్’ వంటి శానిటేషన్ ప్రోగ్రాముల్లో టాయిలెట్ల ఉపయోగించడం పై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేవలం టాయిలెట్ల నిర్మాణంతోనే సరిపెట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అనేక పల్లెల్లో పెద్ద ఎత్తున టాయిలెట్లు నిర్మించారు. అయితే  కొన్ని చోట్ల ఇళ్లల్లో టాయిలెట్లు ఉన్నా  ఆరుబయటకు పోవడానికే ఇష్టపడుతున్నారు. మగవాళ్లలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. చాలా మంది మగవాళ్లు ఇప్పటికీ  టాయిలెట్ అవసరం తీర్చుకోవడానికి పొలాల్లోకో…పొదల్లోకో వెళ్లే అలవాటు నుంచి బయటపడటం లేదు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ మనతో పోలిస్తే చాలా చిన్న దేశం. అయితే అక్కడ మొదటినుంచి టాయిలెట్ వాడకంపై అవగాహన ఉండటంతో అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి.

సర్వే ఫలితాలు ఏమంటున్నాయి ? 

‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ ప్రారంభించి ఐదేళ్లయిన సందర్భంగా చేసిన సర్వేలో 72 శాతం మంది ప్రజలు ఈ పథకం వల్ల తమ పట్టణాలు, నగరాలు మరింత పరిశుభ్రంగా మారాయని చెప్పడం విశేషం. అలాగే ఈ ఐదేళ్లలో మునిసిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు  బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్లు చెప్పారు. పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయని 43 శాతం మంది ప్రజలు చెప్పారు. స్వచ్ఛ్ భారత్ వల్ల స్కూలు పిల్లల్లో పరిశుభ్రత తో పాటు సివిక్ సెన్స్ అంశాలపై అవగాహన పెరిగిందని 55%మంది తెలిపారు.

కొత్త కోడళ్ల కండిషన్లు

‘స్వచ్ఛ్ భారత్ మిషన్ ’ ప్రభావం పల్లెల్లోని ఆడవాళ్ల పై బాగా పడింది. టాయిలెట్ సౌకర్యం లేని అత్తవారిళ్లకు వెళ్లేది లేదని అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తెగేసి చెప్పారు. స్వచ్ఛ్ భారత్ ను ఒక ఉద్యమంలా వీళ్లు నడిపారు. దీని ఫలితంగా అప్పటికప్పుడు ఇళ్లకు టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న సంఘటనలు  నార్త్ ఇండియాలో ఎక్కువగా జరిగాయి.

పిల్లలకూ అబ్బింది

స్వచ్ఛ్ భారత్ ప్రభావం సామాన్య ప్రజలపైనే కాదు స్కూలు పిల్లలపై కూడా పడిందని లేటెస్ట్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. పరిశుభ్రతపై స్కూలు పిల్లలకు అవగాహన పెరిగిందని 55 శాతం మంది ప్రజలు చెప్పడం విశేషం. ఐదేళ్ల కిందట చాలా మంది చిన్నారులకు క్లీన్లీ నెస్ పై  ఎలాంటి అవగాహన ఉండేది కాదన్నారు. స్వచ్ఛ్ భారత్ పుణ్యాన చాలా మంది చిన్నారులకు జీవితంలో పరిశుభ్రత ఎంత ఇంపార్టెంట్ అంశమో తెలిసి వచ్చిందన్నారు. పరిశుభ్రత ఒక్కటే కాదు సివిక్ సెన్స్ కూడా పెరిగిందన్నారు.