ప్రధానమంత్రి పట్టా ఇచ్చిన భూముల్లోకి రానిస్తలేరు

ప్రధానమంత్రి పట్టా ఇచ్చిన భూముల్లోకి రానిస్తలేరు
  • మెదక్ ​జిల్లా నాగసాన్ పల్లి గ్రామ రైతుల ఆవేదన
  • గ్రామ పంచాయతీ ఆఫీసు ఎదుట పట్టా పాస్​బుక్​లతో నిరసన 
  • అధికారులు ఓ భూస్వామికి సహకరిస్తున్నారని ఆరోపణలు

కౌడిపల్లి, వెలుగు: సాక్షాత్తు  ప్రధానమంత్రి అందజేసిన పట్టా సర్టిఫికెట్లు, పాస్​బుక్​లు ఉన్నా అధికారులు తమ భూమిలోకి రానివ్వడం లేదని కౌడిపల్లి మండల పరిధి నాగసాన్ పల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్టిఫికెట్లు, పట్టా పాస్ బుక్ లతో ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం..2005 సంవత్సరం ఆగస్టులో మెదక్ లో జరిగిన భూ పంపిణీ కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొని గ్రామానికి చెందిన 25 మంది పేద రైతులకు భూపట్టాలు అందజేశారన్నారు. సర్వే నంబర్​93లో 30 ఎకరాల భూమి కేటాయిస్తూ సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు.

తర్వాత తమకు కొత్త పట్టా పాస్​బుక్​లు కూడా వచ్చాయన్నారు. సర్వే చేసి తమకు భూమి పొజిషన్​ చూపించాలని ఎన్నిసార్లు  రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. వారం క్రితం ఇదే సర్వే నంబర్​లో అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి తమ భూమికి ఆనుకొని ఉన్న వందల ఎకరాల భూస్వామికి తమ పొలాలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తమకు ఇచ్చిన భూమిలో నుంచే  వంద ఎకరాల భూములకు చెరువు నీళ్లు సరఫరా చేసేందుకు ఉన్న కాలువను ధ్వంసం చేశారన్నారు. వందల ఎకరాల భూములున్నవారికి సహకరిస్తున్న అధికారులు..తమ లాంటి పేద  రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం తమ భూమి తమకు కేటాయించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాధిత రైతులు అల్మాయిపేట అంజయ్య, వద్ది అంజయ్య, చింతల గారి లక్ష్మి, చల్ల భూమయ్య, చెల్లా నాగమయ్య, రాములు, శ్రీనివాస్ హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు పొజిషన్​ చూపించి న్యాయం చేయాలని కోరారు.