‘సూర్యాపేట’లో యథేచ్ఛగా నకిలీల అమ్మకం

సూర్యాపేట, వెలుగు: జిల్లా కల్తీ దందాకు అడ్డాగా మారుతోంది. మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు అసలా, కల్తీయా అని అంతుచిక్కడం లేదు. దీంతో జిల్లా ప్రజలు కల్తీ వస్తువుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. కంట్రోల్​ చేయాల్సిన ఫుడ్ ఇన్‌‌‌‌స్పెక్టర్, ఆఫీసర్లు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం కంప్లైంట్​ చేసేందుకు వెళ్లినా ఎవరూ అందుబాటులో ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు.  

 అడ్డూ అదుపు లేకుండా దందా

సూర్యాపేటతో పాటు పట్టణ ప్రాంతాలైన కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి లోనూ కల్తీ వ్యాపా రం జోరుగా సాగుతోంది. గతంలో  జిల్లా కేంద్రంలో కల్తీ టీ పౌడర్, కారం, నకిలీ విత్తనాలు మార్కెట్ లో భారీగా పట్టుబడ్డాయి. అనంతరం కొంత కాలం పెద్దగా పట్టుబడకున్నా.. ఇటీవల అక్రమార్కులు మళ్లీ రెచ్చిపోతున్నారు. పామాయిల్, వనస్మతి కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఈ నెయ్యిని వివిధ రకాల బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్ లో అమ్ముతున్నారు. దాబాలు, రెస్టారెంట్లు, హోటల్స్​, ఫాస్ట్​ఫుడ్​సెంటర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు.  జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో  బిర్యానీ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.  కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి సెంటర్ల నిర్వాహకులు ఆహారంలో  రంగులను వాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ బిర్యానీ తిన్న కస్టమర్లు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు చెప్తున్నారు. 

ఫిర్యాదులు చేసినా  పట్టించుకోని ఆఫీసర్లు

కల్తీ పదార్థాల విక్రయం గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో ఫిర్యాదు దారులకు తెలియడం లేదు. కల్తీ నియంత్రణపై ఆఫీసర్లు ప్రజలకు కనీస అవగాహన కూడా కల్పించడం లేదని  ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా అవగాహన ఉన్న వారు కల్తీపై సమాచారం ఇచ్చినా సంబంధిత ఆఫీసర్లు తాము అందుబాటులో లేమని సమాధానం ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గెజిటెడ్ ఫుడ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌తోపాటు ఫుడ్ ఇన్​స్పెక్టర్, ​ఒక అటెండర్ పని చేస్తుండగా.. ఫుడ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ సిద్దిపేట, సూర్యాపేట రెండు జిల్లాలకు ఇన్​చార్జిగా ఉన్నారు. ఆయన జిల్లాలో అందుబాటులో ఉండక పోవడంతో  కల్తీ పై ఫోన్​చేసి చెప్పినా.. వారం రోజుల వరకు శాంపిల్స్ సేకరించడం లేదు.  

 ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

ఇటీవల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పక్కన వనస్మతి కలిపిన నెయ్యి కొనుగోలు చేసిన  వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డారు. దీనిపై జిల్లా అధికారి కి ఫిర్యాదు చేయగా శాంపిల్స్ సేకరించిన అధికారులు నెయ్యిలో కల్తీ జరిగినట్లు గుర్తించారు. 
నేషనల్​హైవేపై  ఒక దాబాలో నిల్వ చేసిన చికెన్ వండుతున్నట్లు గుర్తించిన ఓ వినియోగదారుడు జిల్లా ఫుడ్​ కంట్రోల్ ​ఆఫీసర్​కు కంప్లైంట్​ చేయగా,  తాను అందుబాటులో లేనని సమాధానం చెప్పి శాంపిల్స్ కూడా సేకరించలేదు.
కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చిలుకూరు లోని ప్రభుత్వ హాస్టల్​లో చదువుతున్న కుమారుడికి  డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్లగా..  అవి తిన్న 11మంది స్టూడెంట్లు ఫుడ్ పాయిజన్ కావడంతో హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు.