గడువు పెంచుతున్నా కంప్లీట్​ కాని రిపేర్​ వర్క్స్

కారేపల్లిలోని జిల్లా పరిషత్​ హైస్కూల్​ లో 400 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. మన ఊరు– మన బడి కింద టాయిలెట్స్ రిపేర్, కిచెన్​ షెడ్​ నిర్మాణం, ఎలక్ట్రికల్ వర్క్స్​ను ప్రతిపాదించారు. స్కూల్ కు రూ.8 లక్షలు మంజూరు చేయగా, మే 15న ఫండ్​ కూడా వచ్చింది. కానీ ఇంత వరకు ఈ స్కూల్ లో పనులు చేపట్టలేదు. గతంలో నిర్మించిన 8 టాయిలెట్స్​కు​ రిపేర్లు చేయకపోవడంతో మరో బిల్డింగ్ లో ఉన్న నాలుగు టాయిలెట్స్​ నే 400 మంది స్టూడెంట్స్  ఉపయో గించుకోవాల్సి వస్తోంది. 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో 1215 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మన ఊరు– మన బడి కింద మొదటి విడతలో 426 స్కూల్స్​లో పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. రూ.59 కోట్లతో క్లాస్​ రూమ్ లకు రిపేర్లు, కొత్త గదుల నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, కరెంట్, కిచెన్​ షెడ్లు, టాయిలెట్లు వంటి 12 పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా స్కూళ్లలో రూ.30 లక్షల్లోపు పనులను నామినేషన్ పద్దతిపై ఎస్ఎంసీలే పనులు అప్పగించేలా నిబంధనలు ఉండడం కలిసి వచ్చింది. చాలా చోట్ల సర్పంచులు, స్కూల్​ కమిటీ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే రూ.59 కోట్లకు గాను రూ.4 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో పనులు ముందుకు సాగడం లేదు. అధికారులు చెబుతున్న ప్రకారం ఇప్పటి వరకు రూ.కోటిన్నర పనులు మాత్రమే జరిగాయి. ఎండాకాలంలో పనులు ప్రారంభించి, జులై నెలాఖరు లోపు పూర్తి చేసి ఉంటే విద్యార్థులకు ఇబ్బందిలేకుండా ఉండేది. కానీ నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. 

ముందుకు సాగని పనులు..

జిల్లాలో అధికారులు చెబుతున్న ప్రకారం ఇప్పటి వరకు 340 వరకు పాఠశాలల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మిగిలిన చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. గడువులోగా పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో రెండు సార్లు టైం పొడిగించారు. తాజాగా మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని జిల్లా స్థాయి ఆఫీసర్లు మౌఖిక ఆదేశాలిచ్చారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం తమ చేతిలో ఉన్న డబ్బులతో పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 నుంచి 40 శాతం వరకు పనులు చేసిన కాంట్రాక్టర్లు తాము చేసిన పనుల బిల్లులు వచ్చిన తరువాతే మిగిలిన పనులు చేస్తామని అంటున్నారు. 

క్వాలిటీ అంతంతమాత్రమే..

పనుల్లో క్వాలిటీపైనా అనుమానాలున్నాయి. తక్కువ క్వాలిటీ ఎలక్ట్రికల్ సామాన్లు, మెటీరియల్​ తెచ్చి నాసిరకంగా పనులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం పనులు క్వాలిటీగా జరుగుతున్నాయని చెబుతున్నారు. నిధుల కొరత కూడా లేదని అంటున్నారు. 

మండలాల్లో ఇదీ పరిస్థితి.. 

కారేపల్లి మండలంలో 84 పాఠశాలలు ఉండగా మన ఊరు–మనబడి కింద 24 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. 15 ప్రైమరీ స్కూల్స్, 5 యూపీఎస్​లు, 4 జడ్పీ హైస్కూల్స్​ ఉన్నాయి. వీటన్నింటికీ నిధులు మంజూరై నాలుగు నెలలు కావస్తున్నా కొన్నింటిలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. పేరుపల్లి జడ్పీ స్కూల్లో రెండు నెలలైనా సగం పనులే పూర్తి కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు తరగతి గదుల్లో పాడైపోయిన కిటికీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త కిటికీలను అమర్చారు. మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడంతో వాటిలో నుంచి కోతులు తరగతి గదుల్లోకి వస్తున్నాయి. ఇక్కడ టాయిలెట్ నిర్మాణ పనులు కూడా పునాదుల్లోనే ఆగిపోయాయి. విద్యుత్ మరమ్మతులు కూడా నిలిపివేశారు. కొన్ని గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసినా గాలి రావడం లేదని తెలుస్తోంది. పెనుబల్లి, వేంసూరు మండలాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పెనుబల్లి మండలంలో రూ.16 లక్షల పనులు, వేంసూరులో రూ.15 లక్షల పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. విఎం బంజరు జడ్పీ హై స్కూల్  ఎలక్ట్రిసిటీ పనులకు, స్లాబ్ రిపేర్, టాయిలెట్స్, వంట షెడ్ కు కలిపి రూ.30 లక్షలు మంజూరవగా, పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వంట షెడ్ మాత్రమే పూర్తి చేశారు.