
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. తదుపరి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ ను మళ్లీ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. టీఎస్ పీఎస్సీ సరిగా రూల్స్ పాటించలేదని, పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని చెప్పింది.
సెప్టెంబర్ 26న విచారణ సందర్భంగా..
గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహణ విషయంలో టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా? ఇంత నిర్లక్ష్యమా? అంటూ సీరియస్ అయింది. గూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే ముందు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీసింది. ‘‘నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను చూశాం. వాళ్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేయలేకపోవడం ఏంటి? మీరు పెట్టిన నిబంధనలను మీరే తుంగలోకి తొక్కుతారా? నిబంధనలను అమలు చేయలేనప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా? పేపర్ల లీక్ వల్ల ఒకసారి గ్రూప్ 1 పరీక్ష రద్దయినా మళ్లీ సమర్థంగా పరీక్షను నిర్వహించలేకపోతే ఎలా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సెప్టెంబర్ 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబర్ 26న) న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు?
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదో పేర్కొంటూ వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహణ తర్వాత వెల్లడించిన అభ్యర్థుల సంఖ్య, కమిషన్ అధికారిక వెబ్ నోట్‌లోని సంఖ్యకు ఎందుకు తేడా వచ్చిందో చెప్పాలని స్పష్టం చేసింది. ‘‘ఏండ్లుగా ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశల్ని ఆవిరి చేస్తారా? ఒకసారి లీకేజీ వైఫల్యం తర్వాత కూడా రెండోసారి ప్రిలిమ్స్‌ను లోపాలు లేకుండా నిర్వహించలేరా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలియదా? మీరు విధించిన నిబంధనలను మీరే పాటించరా? బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకున్న సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వైఫల్యం తర్వాత ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇతర పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు తీసుకున్నారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు ఎందుకు తీసుకోలేదు? మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య ఎందుకు తేడా వచ్చింది?” అని నిలదీసింది.టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగ సంస్థ..
కోర్టుల పరిధి నామమాత్రమే : ఏజీ
కమిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరారు. ‘‘గ్రూప్ 1 పోస్టుల భర్తీకి వెలువరించిన నోటిఫికేషన్‌లోనే నిబంధనల మార్పులు, చేర్పులు వంటివి చేసే అధికారాలు కమిషన్‌కు ఉంటాయని ఉంది. అభ్యర్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లలో కూడా బయోమెట్రిక్ విధానం గురించి పేర్కొనలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ప్యాన్ వంటి అధికారిక గుర్తింపు కార్డులతో హాజరుకావాలని చాలా స్పష్టంగా చెప్పారు. పరీక్షలను రద్దు చేయాలని కేవలం ముగ్గురే అభ్యర్థులు హైకోర్టుకు వచ్చారు. 2.32 లక్షల మంది అభ్యర్థుల్లో ముగ్గురు కోరితే దాన్ని ఆమోదించడం అన్యాయం” అని చెప్పారు.
బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని పరీక్షను సింగిల్ జడ్జి రద్దు చేయడం చెల్లదని చెప్పారు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లోనే నిబంధనలను సవరించే అధికారం తమకు ఉందని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. కమిషన్ రాజ్యాంగ సంస్థని, అధికారాలు ఉంటాయని, ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం చేసుకునే పరిధి నామమాత్రమని చెప్పారు. హాల్‌టికెట్ తీసుకున్నాక ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు కోర్టుకు రావాలని, పరీక్ష నిర్వహణ అయ్యాక కోర్టును ఆశ్రయించడం చెల్లదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘‘నిబంధనలను సవరించే అధికారాలు కమిషన్‌కు ఉన్న మాట వాస్తవమే.
అయితే ఆ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లోని బయోమెట్రిక్ విధానం అమలు చేయడం లేదని అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలియదా? నియామక పరీక్షలు సాదాసీదా పోస్టులకు కాదు. ఎంపికైన వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత అధికారుల తర్వాత స్థాయి పోస్టుల్లో విధులు నిర్వహిస్తారు. ఇలాంటి కీలక పోస్టుల భర్తీ పరీక్షనే సమర్థంగా, రూల్స్‌కు అనుగుణంగా నిర్వహించకపోతే ఎలా?” అని నిలదీసింది. 2,33,248 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారని చెప్పిన కమిషన్.. తర్వాత ఆ సంఖ్య 2,33,506 మందిగా పేర్కొందని, అంటే హాజరైన అభ్యర్థుల సంఖ్య మారిందని, ఏకంగా 258 మంది పెరిగారని గుర్తు చేసింది. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే పోస్టుల భర్తీ ప్రక్రియ లోపభూయిష్టమే అవుతుందని అభిప్రాయపడింది.
కావాలనే అమలు చేయలే: పిటిషనర్
ఎన్‌ఎస్‌యూఐ తరఫున పిటిషన్ వేసిన న్యాయవాది నర్సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కమిషన్ కావాలనే బయోమెట్రిక్ అమలు చేయలేదని చెప్పారు. గత అక్టోబర్‌లో తొలిసారి పరీక్ష నిర్వహించినప్పుడు అమలు చేసిందని చెప్పారు. లీకేజీకి ముందునాటి నోటిఫికేషన్ మేరకే జూన్‌లో మళ్లీ పరీక్ష నిర్వహించారని, కానీ బయోమెట్రిక్ మాత్రం లేదని తెలిపారు. ఈ వాదనలపై స్పందించిన హైకోర్టు.. బయోమెట్రిక్ లేదనే విషయం హాల్‌టికెట్‌లో ఉన్నప్పుడు పరీక్ష నిర్వహించడానికి ముందుగానే హైకోర్టుకు ఎందుకు రాలేదని ప్రశ్నించింది.
ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దయిందని, ఇప్పుడేమో బయోమెట్రిక్ అమలు చేయలేదని రద్దు అయ్యిందని, ఇలానే కొనసాగితే రాత్రింబవళ్లు కష్టపడిన అభ్యర్థుల శ్రమకు ఫలితం లేకపోతే ఎలాగని నిలదీసింది. ఎన్నో ఏళ్ల తర్వాత పోస్టుల భర్తీ చేయబోతున్నారని, రద్దు చేసుకుంటూపోతే అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించింది. రేపు కమిషన్ పరీక్ష ఏర్పాటు చేశాక బయోమెట్రిక్ విధానం ఉండదని అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే ఏం చేస్తారని నిలదీసింది. ఏండ్లుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతకాలం వేచి ఉండాలని అడిగింది. కేవలం ఇది ప్రిలిమ్స్ మాత్రమేనని చెప్పింది. వీటిలో ఎంపికైనా తర్వాత 1.50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గుర్తు చేసింది. ప్రతిభావంతులు కాకపోతే ఆ స్థాయికి చేరడం కష్టమే కదా అని ప్రశ్నించింది.
2.33 లక్షల మంది బయోమెట్రిక్ కష్టం: ఏజీ
మధ్యాహ్నం విచారణ తిరిగి ప్రారంభం కాగానే ఏజీ వాదనలు వినిపిస్తూ.. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 2.33 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకోవడం కష్టమని చెప్పారు. అందుకే బయోమెట్రిక్ లేదనే విషయాన్ని అభ్యర్థులకు జారీ చేసిన హాల్‌టికెట్‌లో కమిషన్ పేర్కొందని తెలిపారు. ఈ వాదనలను గిరిధర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ అమలు చేసిందన్నారు.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 1.30 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారని, మరో లక్ష మంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు హాజరైనప్పుడు కూడా బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు ఎందుకు తీసుకోలేరని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఎన్ని కేంద్రాల్లో నిర్వహించారు, ఆయా కేంద్రాల వారీగా పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలను సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించింది. గతంలో ఇతర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు బయోమెట్రిక్ అమలు చేసిన వాటి వివరాలు కూడా ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
పేపర్ లీకేజీ కేసు ఏమైంది?
ఇంతకీ పేపర్ లీకేజీ కేసు ఏమైంది? సీబీఐకి ఇవ్వాలన్న వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఒకసారి పేపర్ లీకేజీ తర్వాత జరిగిన పరీక్షను కూడా సమర్థంగా నిర్వహించకపోతే ఎలా? రెండోసారి కూడా పరీక్ష రద్దు చేయాలని కోరుతూ కేసులు దాఖలయ్యాయంటే ఏమనుకోవాలి? టీఎస్‌పీఎస్సీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. లక్షల మంది అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టారు. గ్రూప్ 4 పరీక్షలకు బయోమెట్రిక్ తీసుకోవడం లేదని అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి.. గ్రూప్ 1 విషయంలో అవసరం లేదని ఎలా చెబుతారు. లీకేజీ బాగోతం తేలే వరకు పరీక్షలు నిర్వహించొద్దని అనేక వ్యాజ్యాలు దాఖలు అవుతున్నా.. ఏ దశలోనూ పరీక్షను హైకోర్టు అడ్డుకోలేదు.
అయినా పరీక్షల నిర్వహణను టీఎస్‌పీఎస్సీ సమర్థంగా చేపట్టలేకపోయింది. 258 మంది అభ్యర్థుల సంఖ్య తేడా ఉంది. వీళ్లలో వంద మంది ఎంపికైతే.. వాళ్లు కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యాక పరిస్థితి ఏం కావాలి? బయోమెట్రిక్ తీసుకోకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఈ సందేహాలకు, అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది కమిషనే కదా! ఒక అభ్యర్థిని సంతకం తేడా వచ్చిందని చెప్పి.. ఆమె మ్యారేజి సర్టిఫికెట్‌ను కమిషన్ సమర్పించడం విస్మయం కలిగిస్తున్నది. రాజ్యాంగ సంస్థ అయిన కమిషన్.. మ్యారేజి సర్టిఫికెట్ కోసం అభ్యర్థి ఇంటికి వెళ్లే స్థాయికి తగ్గిపోయిందా?” అని హైకోర్టు ప్రశ్నించింది.