కంటి ఆపరేషన్​ కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది..

సికింద్రాబాద్, వెలుగు: హబ్సిగూడలోని ఓ ఐ హాస్పిటల్ డాక్టర్లు కంటి ఆపరేషన్​ పేరుతో ఐదేండ్ల పాప మృతికి కారణమయ్యారు. ఆపరేషన్​కు ముందు మోతాదుకు మించి అనస్థీషియా ఇవ్వడంతో, కంటి నుంచి బ్రెయిన్​కు పాకి బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక దంపతులకు కూతురు అన్విక(5), కొడుకు(2) ఉన్నారు.

బోర్ ​వెల్​ కంపెనీలో సూపర్​వైజర్​గా పనిచేసే రవి ఫ్యామిలీతో కలిసి కొంతకాలంగా చందానగర్​ ఆర్సీపురంలో ఉంటున్నాడు. అన్విక ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. రెండు రోజుల కింద ఇంటి ముందు ఆడుకుంటున్న టైంలో కట్టె పుల్లను విరుస్తుండగా, చిన్న ముక్క ఎగిరి అన్విక కంట్లో గుచ్చుకుపోయింది. తల్లిదండ్రులు వెంటనే చందానగర్ లోని ఆనంద్​ఐ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు టెస్టులు చేసి ప్రాబ్లమ్​ఏమీ లేదని, డ్రాప్స్ వేస్తే తగ్గిపోతుందని చెప్పారు. ఒకరోజంతా అలాగే ఉంచారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా, పాప కన్ను నీరు కారుతూ.. ఎర్రగా మారింది. నొప్పి ఎక్కువవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్​చేయాలని చెప్పారు. 

అందుకోసం హబ్సిగూడలోని ఆనంద్​ఐ హాస్పిటల్ ​మెయిన్​ బ్రాంచ్​కు పంపించారు. అక్కడి డాక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆపరేషన్​ మొదలుపెట్టే ముందు అనస్థీషియా ఇచ్చారు. డోస్​ఎక్కువై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గుర్తించిన డాక్టర్లు పాప హార్ట్​బీట్​సరిగా లేదని ఒకసారి, లేదు బాగానే ఉంది.. కోలుకుంటోందని మరోసారి కుటుంబ సభ్యులకు చెప్పి హడావిడి చేశారు. మరో వైపు తార్నాక సురక్ష, ఎల్​బీనగర్​చింతలకుంటలోని రెయిన్​బో హాస్పిటళ్ల నుంచి ఐ స్పెషలిస్టులను పిలిపించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అన్వికను చింతకుంటలోని రెయిన్​బో ఆసుపత్రికి అంబులెన్స్​లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం పాప చనిపోయింది.

ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తం
పాప చనిపోయినప్పటికీ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెయిన్​ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామంటూ ఆనంద్​హాస్పిటల్​డాక్టర్లు నమ్మబలికారు. అనుమానంతో పాప కుటుంబ సభ్యులు రెయిన్ బో ఆసుపత్రిలో సంప్రదించగా అన్వికను వెంటిలేటర్​పై ఉంచామని, బ్రెయిన్​డెడ్ అయినట్లు తెలిపారు. కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు హబ్సిగూడలోని ఆనంద్ ​ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఆనంద్ ​హాస్పిటల్​ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు. అయితే పోలీసులు ఆనంద్ ​హాస్పిటల్​ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. నష్టపరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో బాధితులు పాప డెడ్​బాడీని తీసుకుని సొంతూరుకు వెళ్లిపోయారు.