పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.12 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీంను బీఆర్ఎస్ ప్రకటించింది. గత ప్రభుత్వాలు డబ్బా ఇండ్లు, అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లు నిర్మించారని, అల్లుడు అత్తవారింటికి వస్తే పడుకోవడానికి గతిలేదని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని బీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో తెలిపింది.
9 ఏండ్లలో ఇచ్చింది 23వేల ఇండ్లే
2015లో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2,92,057 ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇండ్లు ఉన్నాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలిస్తే నగరంలో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఈ ఇండ్ల ఆశతో పేదలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇంత వరకూ ఆ హామీని నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 12,61,796 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలోనే 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.18 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయగా, మరో 69వేల ఇండ్లు 90శాతం పూర్తవగా, 60వేల ఇండ్ల నిర్మాణాన్ని నిధుల కొరతతో ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఇప్పటివరకు కేవలం 23 వేల ఇండ్లు మాత్రమే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది.
కట్టిన ఇండ్లైనా పంపిణీ చేయలే
పూర్తి చేసిన ఇండ్లు సైతం పంపిణీ చేయకుండా ప్రభుత్వం నాన్చుతుంది. దీనితో పేదలు విసిగిపోయి తాళాలు పగలగొట్టి గృహప్రవేశాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోంది. దీనితో పూర్తయిన ఇండ్లు పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అర్హత లేకపోయినా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని పేద ప్రజలు అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నారు. నిర్మించిన ఇండ్లు తమకు ఎప్పుడు ఇస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 124 ఎకరాల స్థలంలో 15,620 ఇండ్లను నిర్మించి రెండేళ్లు అవుతున్నా ఇంత వరకు లబ్దిదారులకు వాటిని అందించడం లేదంటే ఈ పథకం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో గమనించొచ్చు.
కేంద్ర ఆవాస్ యోజన స్కీమూ పట్టదా?
ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షకుపైగా ఇండ్లు అందిస్తామని తెలిపింది. ఈ పథకం కింద గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.72 వేలు, పట్టణాల్లో రూ. లక్షా 50 వేలు కేంద్రం ఇస్తోంది. ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తే రాష్ట్రానికి రూ.1300 కోట్లు వస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీంను పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుంటే పెండింగ్ లో ఉన్న గృహాలను పూర్తి చేసే అవకాశముంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
పక్కా ఇండ్ల పథకం తెచ్చింది తెలుగుదేశమే
ఉమ్మడి రాష్ట్రంలో పక్కాగృహ నిర్మాణ పథకాన్ని మొదట ఎన్టీఆర్ ప్రారంభించారు. తెలుగు ఆశ్రమ పథకం కింద నెలకు రూ.300 లోపు ఆదాయం గల గ్రామీణ పేదలకు, రూ.700 లోపు ఆదాయం గల పట్టణ పేదలకు ఈ పథకం కింద 1983 నుంచి ఏటా లక్షా 40 వేల ఇండ్లను తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 9 ఏళ్ల కాలంలో 22.57 లక్షల ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
మొత్తంగా ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41 లక్షలకు పైగా ఇండ్లను పేదలకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో తెలుగుదేశం పాలనలో ఐదేళ్లలో 12 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వగా, 6 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉండగా ప్రభుత్వం మారిపోయింది. ఇదే సమయంలో తెలంగాణలో 9 ఏళ్ల కాలంలో కేవలం 23 వేల ఇండ్లను మాత్రమే పేదలకు పంపిణీ చేయడం జరిగింది.
ప్రజాధనం పాలకుల భవనాలకు
పేదలకు ఇండ్లు ఇవ్వడం చేతగాలేదు కానీ, కేసీఆర్ తనకు, ఎమ్మెల్యేలకు మాత్రం గృహాలు నిర్మించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తనకోసం పంజాగుట్టలో ఐఏఎస్ అధికారుల నివాసాలను కూల్చివేసి రూ.100 కోట్ల ఖర్చుతో రాజభవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మించుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను కట్టించారు. రూ. 1200 కోట్లతో సెక్రటేరియట్ కు కొత్త భవనాన్ని నిర్మించారు.
ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయించి అందులో పార్టీ కార్యాలయాలను నిర్మింపజేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ డబ్బంతా పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు పెడితే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ లు మొత్తం పూర్తయి పేదలకు గృహవసతి సమకూరేది. ఇచ్చిన హామీని మరిచి తమను మోసం చేసినందుకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
5 లక్షలు పోయి.. 3 లక్షలే
గ్రామాల్లో ఇండ్ల కోసం బీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో వారిని పక్కదారి పట్టించడం కోసం రూ. రూ.3 లక్షల స్కీంను ప్రభుత్వం హఠాత్తుగా తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల సమయంలో సొంత జాగాలు ఉన్నవారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ నాలుగేళ్లపాటు ఈ ఊసే ఎత్తకుండా కాలం గడిపింది. ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నది.
ఈ స్కీం అయినా పూర్తి స్థాయిలో అమలు అవుతుందా అనేది సందేహమే! గత ఏడాది బడ్జెట్లో ఈ స్కీంకు 12 వేల కోట్లను కేటాయించినా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుతం అక్కడక్కడ కొంత మందికి తూతూ మంత్రంగా రూ. 3 లక్షలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నది. ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం పన్నిన మరో ఎత్తుగడ. - కాసాని జ్ఞానేశ్వర్,అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ