ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు కల నెరవేరాలి

ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు కల నెరవేరాలి

దక్షిణ తెలంగాణకు వరప్రదాయమైన  కృష్ణానది పక్కనే పరవళ్ళు తొక్కుతున్నా.. ఉమ్మడి నల్గొండ,  మహబూబ్ నగర్ జిల్లాల రైతాంగం ఎన్నో దశాబ్దాలుగా  సాగునీరుకు నోచుకోవడం లేదు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని ఈ  రెండు జిల్లాలు  సమైక్యాంధ్ర  పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైతే,  ప్రత్యేక తెలంగాణ  ఏర్పడ్డ తర్వాత  పదేండ్ల  కేసీఆర్ పాలనలో  కూడా అంతకంటే  ఎక్కువ వివక్షకు  గురైందన్నది చారిత్రక సత్యం.  

ఉమ్మడి  నల్గొండ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, రైతన్నల శ్రేయస్సే లక్ష్యంతో  రెండు దశాబ్దాల క్రితం జలయజ్ఞంలో భాగంగా మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సంకల్పానికి రూపమే  శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్​బీసీ) ప్రాజెక్టు.  నాటి  కాంగ్రెస్ హయాంలో 2004లో  వై.ఎస్.ఆర్  ప్రారంభించిన ఎస్ఎల్​బీసీ   సొరంగ మార్గం  తవ్వకాలు  నాలుగు ఏండ్లలో  పూర్తి చేయాలన్నది  ప్రభుత్వ లక్ష్యం.  కానీ,  ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు.

ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టు పూర్తయితే  ఉమ్మడి  నల్గొండ జిల్లాలోని  దేవరకొండ,  మునుగోడు,  నల్లగొండ,  నకిరేకల్,  తుంగతుర్తి  నియోజకవర్గాలతోపాటు  నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట  వంటి  కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయవచ్చు. 1980లో  కృష్ణా జలాల్లో  జరిగిన నీళ్ల ఒప్పందం ప్రకారం  శ్రీశైలం  జలాశయం నుంచి మిగులు జలాలను ఎస్ఎల్​బీసీ  సొరంగం ద్వారా 45 టీంఎసీల  నీటిని  నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేలా గతంలో ఒప్పందం జరిగింది.  ఈ ఒప్పందం ప్రకారమే నల్గొండ,  నాగర్​కర్నూల్  జిల్లాల  సరిహద్దు  నల్లమల అటవీ ప్రాంతంలోని  మన్నేవారిపల్లిలో సుమారు 44 కిలోమీటర్ల  (43.930 కి.మీ) ఎస్ఎల్ బీసీ  సొరంగ మార్గం తవ్వకాలకు నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

ఇరవై ఏండ్ల క్రితం  ప్రారంభమైన ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు పనులు

ఇరవై  ఏండ్ల క్రితం  ప్రారంభమైన ఎస్ఎల్ బీసీ  ప్రాజెక్టు  సొరంగ మార్గం తవ్వకాలు నాడు  దేశంలోనే అతి  పెద్దదైన  సొరంగ మార్గం తవ్వకాలు.  ఎస్ఎల్​బీసీ  సొరంగ మార్గం  ద్వారా  రోజుకు 4000  క్యూసెక్కుల  నీరు గ్రావిటీ ద్వారా  అందిం చాలన్నది  ప్రభుత్వ లక్ష్యం. అంత ప్రతిష్టాత్మక  ప్రాజెక్టును  రూ.1,925 కోట్ల  అంచనాతో  పూర్తి చేయుటకు  నాటి  కాంగ్రెస్  ప్రభుత్వం సిద్ధమైంది.  గడిచిన 20 ఏండ్లలో  శ్రీశైలం నుంచి నీటిని తీసుకువచ్చే వైపు  (ఇన్​ లెట్) నుంచి 13.9 కి.మీ  మేర  సొరంగం  తవ్వకాలు  పూర్తవగా,  నీళ్లు బయటకు  వచ్చే వైపు  (అవుట్ లెట్) నుంచి 20.40 కి.మీ  దూరం  తవ్వారు.  ఈ సొరంగ  మార్గం  పనులన్నీ  ఉమ్మడి ఏపీలో జరిగినవే!  టన్నెల్ మధ్యలో ఇంకా 9.559 కి.మీ సొరంగం తవ్వాల్సి ఉంది. కానీ,  కేసీఆర్  హయాంలో ఒక్క కిలోమీటర్ కూడా సొరంగ మార్గం తవ్వకాలు చేయలేదు.  

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి  2014కు  ముందే సమైక్యాంధ్రలోనే 43.930 కి.మీ సొరంగ మార్గానికిగాను 34 కి.మీ తవ్వకాలు పూర్తయ్యాయి. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎస్ఎల్​బీసీ  టన్నెల్ పనులు పడకేశాయి. మొత్తం సొరంగం మార్గంలో 34 కి.మీ పూర్తవగా, పదేండ్ల  కేసీఆర్​  పాలనలో  మిగిలిన 10 కి.మీ సొరంగ మార్గం తవ్వకాలు పూర్తి కాలేదు. 2019-–20 బడ్జెట్​లో  ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టుకు  కేటాయించింది  కేవలం  రూ.3 కోట్లు మాత్రమే. 2020-–21 లో  కూడా  అవే రూ.3 కోట్లు కేటాయించి గత 
ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టుపై  కేసీఆర్ నిర్లక్ష్యం

కేసీఆర్  హయాంలో  శ్రీశైలం  జలాశయం  నుంచి 75 శాతం  డిపెండబుల్  ప్రవాహాల్లో  90 టీంఎసీల  నీటిని పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వినియోగించుకునేందుకు.. నాడు కేసీఆర్ ప్రభుత్వం 2022 ఆగస్టు 18న జీవో  నెం. 246 తీసుకువచ్చి  శ్రీశైలం  జలాశయం  నుంచి  ఎస్ఎల్​బీసీకి  కేటాయించిన 45 టీంఎసీల నీటిని రద్దు చేసింది.  కృష్ణా నది నుంచి నాటి ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌‌‌‌‌‌‌‌‌‌ 8 నుంచి 11 టీఎంసీల  నీటిని అక్రమంగా తరలిస్తున్నా అడ్డుకోని  కేసీఆర్  ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టుకు   కేటాయించిన  నీటిని  రద్దు  చేయడంలో  ఆంతర్యం  ఏమిటో  ఆయనకే  తెలియాలి.  

ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టుకు 30 టీఎంసీలు,  పాలమూరు- – రంగారెడ్డికి  40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు  20 టీఎంసీల  నీరు  కేటాయించాలన్న  ప్రతిపక్షాల  డిమాండ్ ను   కేసీఆర్  పెడిచెవిన  పెట్టడంతో  ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టు  భవితవ్యం  ప్రశ్నార్థకంగా  మారింది.  కాంట్రాక్టర్ల  పొట్ట నింపే కాళేశ్వరానికి లక్షల కోట్లు వెచ్చించి  పూర్తిచేసిన  బీఆర్ఎస్​ ప్రభుత్వం  4 లక్షల  ఎకరాలకు  సాగునీరు  అందించే  ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టును  ఎందుకు పూర్తి  చేయలేదో  కేసీఆర్  ప్రజలకు సమాధానం  చెప్పాలి.  

నిర్వాసితులను సీఎం రేవంత్​ ఆదుకోవాలి

ఎస్ఎల్​బీసీ, నక్కలగండి ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ జరిగి 20 ఏండ్లు గడిచినా  ఇప్పటికీ కొంతమంది నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్  ప్యాకేజీ  చెల్లించలేదు.  దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మానవతా  దృక్పథంతో వ్యవహరించి  ప్రాజెక్టు  నిర్మాణంలో  భూములు కోల్పోయిన  నిర్వాసితులకు  నష్టపరిహారం చెల్లించి, ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టు చేయాలి.  కేసీఆర్ హయాంలో పెండింగ్​లో ఉన్న ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు, మహాత్మా గాంధీ  కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్  నెట్టెంపాడు ఎత్తిపోతల,  రాజీవ్ భీమా ఎత్తిపోతల,  ఎలిమినేటి మాధవరెడ్డి  ప్రాజెక్ట్,   డిండి ఎత్తిపోతల,  బునియాది గాని కాల్వ,  పిల్లాయిపల్లి,  ధర్మారెడ్డి కాల్వల పనులు పూర్తి చేయడంలో,  మూసీ నది  ప్రక్షాళన చేయడంలో  బీఆర్ఎస్​ ప్రభుత్వం విఫలమైంది. 

ఉత్తర తెలంగాణకు  అత్యంత ప్రాధాన్యమిచ్చి  ప్రాణహిత– -చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి,   లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కొత్తగా నిర్మించి పూర్తి చేశారు.  కాంగ్రెస్  ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునియాదిగాని కాల్వ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.266.65 కోట్లు మంజూరు చేసింది. 98.640 కి.మీ పొడవున బునియాదిగాని  కాల్వ పనులు  పూర్తయితే మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న పిల్లాయిపల్లి,  ధర్మారెడ్డి కాలువ పరిధిలోని రైతులకు న్యాయం జరుగుతుంది.

సీఎం రేవంత్ చొరవతో  రైతుల్లో ఆశలు

కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు పూర్తి చేయుటకు గడువును 2014,  2017,  2020,  2023 వరకు  ఇలా పొడిగించారు తప్ప  ప్రాజెక్టు పూర్తికి నిధులను మంజూరు చేయలేదు.  తాజాగా  సీఎం రేవంత్ రెడ్డి 2026 డిసెంబర్ నాటికి ఎస్ఎల్​బీసీ  ప్రాజెక్టు  పూర్తి  చేస్తామని  ప్రకటించడంతో  నల్గొండ  జిల్లా  రైతాంగంలో  మళ్లీ ఆశలు చిగురించాయి.  ఎస్ఎల్​బీసీ   ప్రాజెక్టు  పనుల  పురోగతిపై  ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క,  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో  ఉమ్మడి  నల్గొండ,  మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీల బృందం  ప్రాజెక్టు పనుల పురోగతిపై  ఇప్పటికే  క్షేత్రస్థాయి  పరిశీలనతో ఇరిగేషన్,  ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.   రూ.1,925 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు,  గత పాలకుల నిర్లక్ష్యంతో   ఎస్ఎల్​బీసీ టన్నల్ నిర్మాణ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.4,637 కోట్లకు పెరిగింది.  మిగిలిన 9.6 కి.మీ  సొరంగ మార్గం  తవ్వకానికి ప్రతి నెల  రూ.14 నుంచి  రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు  ప్రభుత్వం సిద్ధమైంది.  కాళేశ్వరం   ప్రాజెక్టు కోసం  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్  ద్వారా  లక్ష కోట్లు  అప్పు తెచ్చి నాసిరకంగా  ప్రాజెక్టును నిర్మించి పూర్తి చేసిన కేసీఆర్​కు  పదేండ్ల కాలంలో ఎస్ఎల్​బీసీ సొరంగ మార్గం 10 కి.మీ పూర్తి చేయుటకు మరో  రూ.1,125 కోట్లు దొరకలేదా అన్నది మిలియన్  డాలర్ల  ప్రశ్న!

-డా. చెట్టుపల్లి మల్లికార్జున్-