రష్యా నడిబొడ్డున ఉక్రెయిన్ డ్రోన్ దాడి

రష్యా నడిబొడ్డున ఉక్రెయిన్ డ్రోన్ దాడి

రష్యా నడిబొడ్డున ఉక్రెయిన్ డ్రోన్ దాడి
బార్డర్​ దాటి 600 కి.మీ. లోపలికి చొచ్చుకొచ్చిన డ్రోన్లు

మాస్కో: రష్యాలోని ఎంగెల్జ్ ఎయిర్​ బేస్​ పై డ్రోన్​ దాడి జరగడం కలకలం రేపింది. ఎయిర్​ బేస్​ పైకి దూసుకొస్తున్న డ్రోన్​ ను ఆఖరి నిమిషంలో గుర్తించిన సెక్యూరిటీ ఆఫీసర్లు..  దానిని గాల్లోనే పేల్చేశారు. ఆ శిథిలాలు మీదపడి ఎయిర్​ బేస్​ కు కాపలాగా ఉన్న ముగ్గురు సోల్జర్లు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ అటాక్​ జరిగిందని రష్యా మిలటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్​ బేస్​ లు టార్గెట్​గా డ్రోన్ దాడులకు ప్రయత్నం జరగడం ఈ నెలలో ఇది రెండోది. ఈ నెల 5న కూడా ఇదే ఎయిర్​ బేస్​పై ఇలాంటి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే బాంబర్లు ఉన్న ఎయిర్​ బేస్​ పై దాడి జరగడంపై డిఫెన్స్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పైగా, ఈ ఎయిర్​ బేస్ ఉక్రెయిన్​ బార్డర్​ కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. శత్రు దేశానికి చెందిన డ్రోన్ బార్డర్​ దాటి ఏకంగా 600 కిలోమీటర్లు లోపలికి ప్రయాణించి వచ్చి మరీ దాడికి ప్రయత్నించడంపై ప్రపంచ దేశాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. డ్రోన్లు బార్డర్​ దాటుతుంటే రష్యా ఎయిర్​ డిఫెన్స్ వ్యవస్థ ఏంచేస్తోందనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. 

ఉక్రెయిన్​ ఏమంటోంది..

డ్రోన్ అటాక్​పై ఉక్రెయిన్​ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే, రష్యా ఎయిర్​ బేస్ పై దాడి ఘటనపై ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి యూరి ఇహ్నాత్ స్పందించారు. తన దూకుడుతనానికి రష్యాకు దక్కిన ప్రతిఫలమేనని చెప్పారు. రష్యా అంతర్భాగాలపై యుద్ధ ప్రభావం పడదని భావించడం తప్పని తాజా ఘటన నిరూపిస్తోందన్నారు. అయితే, డ్రోన్ దాడి తమ పనేనని ఆయన కమిట్​ కాలేదు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో జరుగుతున్న పలు అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, మిలటరీ బేస్​లపై హై ప్రొఫైల్​ దాడులపైనా ఉక్రెయిన్​ మౌనం పాటిస్తూ వస్తోంది.

కొనసాగుతున్న రష్యా షెల్లింగ్​..

ఉక్రెయిన్​ సిటీలలో రష్యా షెల్లింగ్​ కొనసాగుతోంది. రష్యా బలగాలు జరుపుతున్న షెల్లింగ్​ వల్ల ఆదివారం ఒక్కరోజే నలుగురు పౌరులు చనిపో యారని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ ఆఫీసు తెలిపింది. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న ద్నిప్రొపెట్రోవ్స్క్​లో రష్యా బలగాలు షెల్లింగ్ ఆపేశాయని చెప్పింది. వరుసగా 3 రోజులు ఇక్కడ కాల్పుల మోత వినిపించలేదని పేర్కొంది.

ఎక్కడుందీ ఎయిర్​ బేస్..

సారటోవ్​ రీజియన్​ లో వోల్గా నది ఒడ్డున ఈ ఎయిర్​ బేస్ ఉంది. ఉక్రెయిన్​ బార్డర్​ నుంచి ఈ బేస్ సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు చెప్పారు. ఇందులో అణ్వాయుధాలను మోసుకెళ్లే బాంబర్లకు కూడా షెల్టర్​ ఉంది. టీయూ 95, టీయూ 160 గా వ్యవహరించే ఈ స్ట్రాటజిక్​ బాంబర్లను ఉక్రెయిన్​పై దాడులకు రష్యా ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఈ ఎయిర్​ బేస్​ పై దాడి ప్రయత్నం జరగడంపై ఆర్మీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, బేస్​లోని ఎయిర్​క్రాఫ్ట్​ లకు ఈ దాడిలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని మిలటరీ వర్గాలు తెలిపాయి.