
ఢిల్లీ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. జాగృతి బొడెద్దులుకు 49వ ర్యాంక్ లభించింది. తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత పొందారు.
NEETకు అర్హత సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నీట్-యూజీ పరీక్ష నిర్వహించారు. భారత్ ఆవల అబుదాబ, బ్యాంకాక్, కొలంబో, దోహ, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియా్, షార్జా, సింగపూర్, దుబాయ్, కువైట్ సిటీల్లో నీట్ పరీక్ష నిర్వహించారు.
జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన NTA.. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.
విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి వారికి ఎన్టీఏ.. ఆల్ ఇండియా ర్యాంకులు ఇస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ మెరిట్ ప్రాతిపదికన యూనివర్సిటీలు సీట్లు కేటాయిస్తాయి. ఆల్ ఇండియా ర్యాంకును బట్టి, విద్యార్థులు తమ రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రాల్లోనూ విద్యార్థుల మెరిట్ లిస్ట్ ప్రకారం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తాయని ఎన్టీఏ అధికారులు తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ లో తమ పాత్రమే ఉండదని ఎన్టీఏ అధికారులు చెప్పారు.
అబ్బాయిలదే హవా
నీట్ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలే హవా చాటారు. టాప్ 50 అభ్యర్థుల్లో 40మంది అబ్బాయిలే ఉండగా.. 10మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల్లో పంజాబ్‌కు చెందిన ప్రంజల్ అగర్వాల్ (4వ ర్యాంకు), అషికా అగర్వాల్ (11వ ర్యాంకు) 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
టాప్ 20 ర్యాంకర్లు వీరే..
* ప్రభంజన్ జె (720 మార్కులు); బోరా వరుణ్ చక్రవర్తి (720)
* కౌస్తవ్ బౌరి (716)
* ప్రంజల్ అగర్వాల్ (175)
* ధ్రువ్ అడ్వానీ (715)
* సూర్య సిద్ధార్థ్ (715)
* శ్రీనికేత్‌రవి (715)
* స్వయం శక్తి త్రిపాఠి (715)
* వరుణ్ ఎస్ (715)
* పార్థ్ ఖండేవాల్ (715)
* అషికా అగర్వాల్ (715)
* సాయన్ ప్రధాన్ (715)
* హర్షిత్ బన్సల్ (715)
* శంకర్ కుమార్ (715)
* కేసీ రఘురామ్ రెడ్డి (715)
* శుభమ్ బన్సల్ (715)
* భాస్కర్ కుమార్ 715)
* దేవ్ భాటియా (715)
* అర్నాబ్ పటి(715)
* శశాంక్ సిన్హ (715)