- పెండ్లిళ్లు, పరామర్శలు, అంతిమయాత్రలకు హాజరు
- వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ
- క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్లతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం
- పోటాపోటీగా డివిజన్ల వారీగా కార్యక్రమాలు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలోని నియోజకవర్గాల్లో ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలైంది. గడిచిన రెండు వారాలుగా.. ప్రధాన పార్టీల లీడర్లు నిత్యం జనాల్లో ఉంటున్నారు. గతానికి భిన్నంగా పెండ్లిళ్లు, అంతిమయాత్రలు, పరామర్శలకు హాజరవుతున్నారు. ఇవే కాకుండా హల్దీ ప్రోగ్రాంలు, శారీ ఫంక్షన్లు, గృహ ప్రవేశాలకు కూడా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. గతంలో పీకే, ఇప్పుడు టీఆర్‍ఎస్ అధినేత కేసీఆర్ సర్వేలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి పబ్లిక్ వద్దకు పరుగులు పెడుతున్నారు. పెద్ద స్వాములతో వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లీడర్ల బర్త్ డేలు, పెళ్లిరోజుల సందర్భంగా నియోజకవర్గాల్లో ఫెక్ల్సీలతో నింపేస్తున్నారు.
ఒక్క చాన్స్ కూడా వదలట్లే..
వరంగల్ సిటీలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. ఇక్కడ నిన్నమొన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు, ఆసరా పెన్షన్లకే పరిమితమైన తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‍భాస్కర్.. ఇప్పుడు స్పీడ్ పెంచి, ప్రజలు కలిసేందుకు ఏ ఒక్క చాన్స్ వదులుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘కేసీఆర్ దీక్షా దివస్’ ను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ 10 రోజుల పాటు నిర్వహించారు. ఉద్యమకారులు, జర్నలిస్టులు, కేయూ జేఏసీలు.. ఇలా వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి సన్మానాలు, సత్కరాలు చేసి, వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, విజయానంద తీర్థలతో అనఘాష్టమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
చిన్న వాటికి కూడా..
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍కు నియోజకవర్గంలో విపక్ష లీడర్లతో పాటు సొంత పార్టీలోనూ గ్రూపులు ఉన్నాయి. దీంతో నిత్యం పదుల సంఖ్యలో పెళ్లిలు, శుభకార్యాలకు అటెండ్ అవుతున్నారు. హల్దీ కార్యక్రమాలు, శారీ ఫంక్షన్లు, డివిజన్లలో చిన్న లీడర్ల పెళ్లి రోజులకు సైతం వెళ్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఆర్థిక సాయం చేస్తున్నారు. ఉదయం రోడ్లమీదకు వెళ్లి వాకర్స్ తో ముచ్చటిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్‍లో ఆధ్మాత్మిక ఏర్పాటు చేసి.. భక్తులు దగ్గరయ్యేలా చేశారు.
బీజేపీ లీడర్ల దూకుడు..
వరంగల్ తూర్పు పరిధిలో బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‍రావు ఎమ్మెల్యే నరేందర్‍తో పోటాపోటీగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిత్యం జనాలకు దగ్గరవుతున్నారు. డివిజన్ల వారీగా ప్రోగ్రాంలు ప్లాన్ చేసుకుని శుభకార్యాలు, చావులు, పరామర్శలతో ఓటర్లకు, లోకల్ లీడర్లను దగ్గర చేసుకుంటున్నారు. యూత్‍ను ఆకట్టుకునేలా ముందుకువెళుతున్నారు. అదే టైంలో టీఆర్‍ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ నియోజకవర్గ, గ్రేటర్ నేతలతో సమన్వయం చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. వరంగల్ పశ్చిమలో టిక్కెట్ ఆశిస్తున్న హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఎవరికివారుగా జనాలకు దగ్గరయ్యేలా అడుగులు వేస్తున్నారు. మార్నింగ్ వాక్, డివిజన్ సమస్యలు, నియోజకవర్గం అభివృద్ధి అంశంలో, ఎమ్మెల్యే అసమర్థతపై నిలదీస్తున్నారు. ఇటీవల రాకేశ్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.
ధర్నాలతో కాంగ్రెస్ నేతలు యాక్టివ్..
ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో కాంగ్రెస్ లీడర్లు మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరంగల్ తూర్పు నుంచి పోటీలో ఉండనున్నట్లు ప్రకటించిన కొండా దంపతులు ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. పార్టీలో సరైన అవకాశం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై ఫైర్ అవుతూ మళ్లీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ మారేది లేదని.. వంద శాతం తూర్పు నుంచి బరిలో ఉంటామని చెప్పి కేడర్‍ను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే నరేందర్ పీఏ దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మొత్తంగా జనరల్ ఎలక్షన్లకు దాదాపు పది నెలల సమయం ఉండగానే గ్రేటర్ పరిధిలో ప్రధాన పార్టీలు, లీడర్లు ప్రచారంలో సై అంటే సై అంటున్నారు.
టోర్నమెంట్లతో..
వరంగల్ సిటీకి ఆనుకుని ఉన్న స్టేషన్ ఘన్ పూర్ లోనూ రాజకీయం హీటెక్కింది. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు నడుస్తుండగా.. ఎవరికివారు పోటాపోటీగా ముందస్తు ప్రచారం చేస్తున్నారు. టికెట్ ఎవరికి వరిస్తుందో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరువురు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇప్పటికే నమిలిగొండలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి యూత్ ను ఆకట్టుకున్నారు. గెలుపొందిన జట్టుకు రూ.50వేల నుంచి రూ.లక్ష నగదు బహుమతి ప్రకటించారు.
వచ్చే సంక్రాంతికి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పెట్టి, గెలుపొందిన టీంకు రూ.లక్ష క్యాష్ ప్రైజ్ ఇస్తానని కూడా వెల్లడించారు. నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా, అది తన ఖాతాల్లోకే వస్తుందన్నారు. హుండీలో ఎవరు పైసలు వేసినా, అవి దేవుడికే చెందుతాయని, అలాగే ఎవరు పనిచేసినా అది తన అకౌంట్లోనే వస్తుందన్నారు.