మానవ అభివృధికి, సమాజ వికాసానికి తొలిమెట్టు విద్య. ప్రపంచ అభివృద్ధి, శాంతిస్థాపనలో విద్య పాత్రను తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
2025వ సంవత్సర అంతర్జాతీయ విద్యా దినోత్సవ థీమ్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్య. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని సంరక్షించడం’. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) జీవితకాల అభ్యాసం, వ్యక్తిగత అభివృద్ధికి అవసరమైన విద్యను మానవ హక్కుగా నిర్వచించింది.
యునెస్కో ప్రకారం ప్రస్తుతం 250 మిలియన్ల మంది పిల్లలు, యువత విద్యకు దూరంగా ఉన్నారు. 763 మిలియన్ల పెద్దలు నిరక్షరాస్యులు. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం కేరళలో అత్యధిక అక్షరాస్యత రేటు 94% నమోదవగా లక్షద్వీప్ 91.85%, మిజోరంలో 91.33% అక్షరాస్యత నమోదు అయింది. బిహార్‌లో అత్యల్ప అక్షరాస్యత రేటు 61.8% నమోదు అయింది.
భారతదేశంలోని విద్యా ప్రమాణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. వారికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలలలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి.
దీనికి విరుద్ధంగా సరిపోని మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన విద్యావేత్తల కొరత, విద్యా వనరులు పరిమితంగా ఉండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందటంలో ఇబ్బందులు పడుతుంటారు. పేదరికం, గ్రామీణ సమాజాలలో తక్కువ అక్షరాస్యత స్థాయిలు వంటి సామాజిక, ఆర్థిక కారణాల వలన కూడా ఈ అసమానతలు మరింత తీవ్రమవుతున్నాయి.
తత్ఫలితంగా గ్రామీణ భారతదేశంలోని విద్యార్థులు పట్టణ విద్యార్థుల్లాగ నాణ్యమైన విద్యను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు విరివిగా కృషి చేస్తున్నాయి. 2024 డిసెంబర్ నెలలో భారత ప్రభుత్వం తెలియచేసిన సమాచారం ప్రకారం, గత దశాబ్దంలో భారత దేశంలో గ్రామీణ అక్షరాస్యత రేటు 10 శాతం పాయింట్లు పెరిగి గణనీయమైన మెరుగుదలని నమోదు చేసింది.
పట్టాలు కాగితపు పులులు అవుతున్నాయి
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ అక్షరాస్యత రేటు గణనీయమైన మెరుగుదలను చూపింది. అయితే, అనేక ఇతర దేశాలతో పోలిస్తే ఇది ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల లభించిన డేటా ప్రకారం, ప్రపంచ అక్షరాస్యత సూచికలో భారతదేశం 105వ స్థానంలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల అక్షరాస్యత రేటు 100%కు దగ్గరగా ఉన్నది. భారతదేశంలో పురుష, స్త్రీల మధ్య గుర్తించదగిన అక్షరాస్యత రేటు వ్యత్యాసం 76.32% ఉంది.
భారతదేశం తన విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఈ అంతరాన్ని తగ్గించడానికి తన కృషిని కొనసాగిస్తోంది. నేడు మెజారిటీ విద్యార్థులకు విద్య అందుబాటులోకి వచ్చినప్పటికి విద్య నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి అని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ప్రైవేటు విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వరకు చదువుతున్నవారి సంఖ్య కూడా చాలావరకు పెరిగింది. విద్యార్థులు సాధించిన మార్కులు, సాధించిన డిగ్రీ చెప్పుకోవడానికి తప్ప విద్యార్థులకు చదివిన కోర్సులపై నాలెడ్జ్ ఉండటం లేదు. అంటే సాధించిన డిగ్రీ పట్టాలు ఒక ‘కాగితపు పులులు’గా చలామణి అవడానికి మాత్రమే పని చేస్తున్నాయి.
విద్యలేని దేశాల్లో అశాంతి, అస్థిరత
ఒక దేశంలో అశాంతి, అస్థిర పరిస్థితులను సృష్టించాలంటే యుద్ధాలు చేయకుండా కేవలం విద్యా
విధానాన్ని ధ్వంసం చేస్తే సరిపోతుందని మేధావులు స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన సమయంలో (1979– -1989) సోవియట్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ లో తప్పనిసరి విద్యను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వం అక్షరాస్యతను ప్రోత్సహించింది. పురుషులు, మహిళలకు సమాన విద్యావకాశాలను కల్పించింది. సరియైన విద్యావిధానం లేని (ఇస్లామిక్ విద్యను అభ్యసించిన) ప్రస్తుత తాలిబన్లు మహిళలకు విద్యను నిషేధించారు. శాస్త్రీయమైన విద్యను అమలుపరచడం లేదు. వారి పాలనలో అశాంతి, అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యునెస్కో చెప్పినట్లుగా ‘విద్య’ శాంతి స్థాపనలో కీలకపాత్ర పోషిస్తుంది. విద్య సమాజంలోని వ్యక్తుల మేధాశక్తిని పెంచడం
వల్ల సమాజం పురోగతి చెందుతుంది.
స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ మాదిరిగా మారిన రీసెర్చ్ పేపర్స్ ప్రచురణ
ప్రస్తుతం ఆన్ లైన్లో పైసలు చెల్లిస్తే చాలు నిమిషాలలో స్విగ్గీ ఫుడ్ మన ఇంటికే వచ్చి కడుపు నింపుతుంది. అదేవిధంగా ప్రస్తుతం విద్యాసంస్థలలో ప్రయోగశాలలు లేకపోయినప్పటికీ, పరిశోధనలు నిర్వహించనప్పటికీ, పరిశోధనలకు గైడ్ లేనప్పటికీ ఆన్లైన్లో పైసలు చెల్లిస్తే చాలు పరిశోధన పత్రాలను ప్రచురించే స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ లాంటి సౌకర్యం కూడా ప్రస్తుతం మన విద్యాసంస్థలలో విరివిగా అమలులో ఉంది.
దీన్ని ప్రభుత్వం కట్టడి చేస్తే మంచిది. లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ పరిశోధనల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. శాస్త్రీయమైన, నాణ్యమైన విద్యావిధానం సమాజంలో శాంతిని, సుస్థిరతను నెలకొల్పటంలో కీలకపాత్ర వహిస్తుంది.
విద్యార్థులలో కొరవడుతున్న ప్రతిభ
విద్యార్థులలో ప్రతిభ లేకపోవడానికి కారణం నాణ్యతలేని విద్యాసంస్థలు. స్కిల్స్ నేర్పమని డిమాండ్ చేయకుండా కేవలం అధికశాతం మార్కులతో డిగ్రీ పట్టా వస్తే చాలు అనే ఆలోచనలో విద్యార్థులు ఉండటం కూడా ఒక కారణం. అదేవిధంగా విద్యార్థుల దగ్గర ఎక్కువగా ఫీజులు వసూలు చేసి, తక్కువ వేతనాలకు వచ్చే నాణ్యతలేని ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించి ఏదోవిధంగా అధికశాతం మార్కులతో విద్యార్థులను పాస్ చేసి డిగ్రీ పట్టాలు విద్యార్థుల చేతిలో పెట్టి బయటికి పంపిస్తే చాలులే అని విద్యాసంస్థలు ఆలోచించడం మరొక కారణం.
ఇక్కడ విద్యార్థులకు డిగ్రీలు పొందాలనే తాపత్రయం, విద్యా సంస్థలకు డబ్బు సంపాదించుకోవాలని తాపత్రయం తప్ప విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, నైపుణ్యాలు నేర్చుకోవటం అనే విషయాలను పట్టించుకోరు. నాలెడ్జ్ లేని ఉపాధ్యాయుడు నాలెడ్జ్ గల విద్యార్థులను తయారు చేయలేడు. ‘మోటివేట్’ చేయలేడు. ప్రస్తుతం విద్యాసంస్థలలో విద్యార్థి కనపరిచిన ప్రతిభ కన్నా ఎక్కువ మొత్తంలో మార్కులు ఇస్తున్నారు. ఈ కల్పిత మార్కులను చూసి విద్యార్థులు తాము ఎంతో నాలెడ్జ్ సాధించామని తప్పుగా అంచనా వేసుకుంటున్నారు. డిగ్రీ పట్టా సాధించిన విద్యార్థి నాలెడ్జ్ అతని కెరీర్ అభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి.
- డా.శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్-