రెమ్డిసివిర్‌‌ ప్రభావం తక్కువే

రెమ్డిసివిర్‌‌ ప్రభావం తక్కువే

హైదరాబాద్, వెలుగు: కరోనాపై రెమ్డిసివిర్​ఇంజక్షన్​ ప్రభావం తక్కువేనని చెన్నైకి చెందిన కావేరి హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ ​ఎన్.శ్రీధర్ వెల్లడించారు. ‘కరోనా వైరల్ ఇన్‌‌ఫెక్షన్‌‌ను రెమ్డిసివిర్ కంట్రోల్ చేస్తుందని, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిన పేషంట్‌‌ను వెంటిలేటర్ స్టేజీ వరకు వెళ్లకుండా కాపాడుతుందని, మరణాల రేటును తగ్గిస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ ఇంజెక్షన్​వల్ల వీటిలో ఏ ఒక్క ప్రయోజనమూ నెరవేరదని డబ్ల్యూహెచ్‌‌వో సహా అనేక సంస్థల ట్రయల్స్‌‌లో తేలింది’ అని స్పష్టం చేశారు. రెమ్డిసివిర్ ఇంజెక్షన్‌‌పై ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రయోగాలు జరిగాయని ఆయన తెలిపారు. వాటిలో డబ్ల్యూహెచ్‌‌వో ఆధ్వర్యంలో సాలిడారిటీ ట్రయల్ పేరిట జరిగిన రీసెర్చ్​ అతి పెద్దదని, 30 దేశాలకు చెందిన వేలాది పేషెంట్లు ఈ ట్రయల్స్‌‌లో పాల్గొన్నారని చెప్పారు. అన్ని ట్రయల్స్‌‌లోనూ రెమ్డిసివిర్ ఇంజెక్షన్‌‌ వల్ల కరోనా నుంచి ఎటువంటి రక్షణ దొరకదని తేలిందన్నారు. వైరల్ ఇన్‌‌ఫెక్షన్ తగ్గించడం గానీ, పేషెంట్ ఐసీయూ, వెంటిలేటర్ వరకూ వెళ్లకుండా కంట్రోల్ చేయడంగానీ చేయలేదని నిర్ధారణ అయిందని చెప్పారు. ‘కరోనాపై రెమ్డిసివిర్ ప్రభావం చాలా తక్కువ. స్టెరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్​ల్లాంటి మెడిసిన్స్​మాత్రమే  రక్తం గడ్డ కట్టకుండ చేస్తూ కరోనాపై సమర్థవంతంగా పని చేస్తాయని రుజువైంది. ఈ మెడిసిన్స్‌‌కు మార్కెట్‌‌లో కొరత కూడా లేదు’ అని శ్రీధర్​ పేర్కొన్నారు.