కరోనా వైరస్ ఎమోషన్స్​తో ఆటలాడుతున్నది

కరోనా వైరస్ ఎమోషన్స్​తో ఆటలాడుతున్నది

కరోనా సెకండ్ వేవ్ దాడి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం మనుషులపై భౌతికంగానే కాదు వారి మనసులపైనా తీవ్రంగా ఉంది. మనోభావాలపై పడుతున్న ప్రతికూలత ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో ఉండవచ్చు. ఒక నిరంతర విద్యార్థిగా, మనోభావనా జ్ఞానంలో నిష్ణాతుడిగా వ్యక్తులను ప్రభావితం చేస్తున్న కొన్ని తీవ్రమైన భావోద్వేగాలు, వాటి కారణంగా తలెత్తుతున్న వినాశనకర ఫలితాలను నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. 

భావోద్వేగాలు అన్నవి మానవ జీవితంలో ఒక భాగం. అలాంటివి లేకపోతే జీవితమే ఉండదు. మనం నిత్యం చేసే ప్రతీ పని భావోద్వేగాలను సంతృప్తి పరుచుకునేందుకు చేసేదే. ప్రస్తుతం మీ జీవితంలో చోటు చేసుకుంటున్న ప్రతి విషయం వెనుక ఉన్నది భావోద్వేగాల పరంపరే. నేడు మీలో కలుగుతున్న ప్రతీ భావనకు కారణం.. మీ చుట్టు ఉండి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న వాతావరణంపై మీ ప్రతిస్పందన కావచ్చు లేదా ఇతర మనోభావనలు లేదా మీరు స్వతహాగా తీసుకునే క్రియాశీలక నిర్ణయాలు కావచ్చు. ఏది ఏమైనా మీ సంపూర్ణ జీవితాన్ని “భావనలు–ఆలోచనలు–-క్రియా చక్రం”గా చెప్పవచ్చు. అంతర్గత లేదా బాహ్య ప్రేరణ ద్వారా భావోద్వేగాలు చోటు చేసుకుంటాయి. కరోనా అన్నది అంతర్గతమే కాదు, బాహ్య ప్రేరణ కూడా. దాని బారిన పడిన రోగులు, కోలుకున్నవారు సైతం లోపల–-వెలుపలా ప్రభావితమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ సమాజాలు ఈ అనూహ్యమైన భావోద్వేగ కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్నారు. మనోభావనా జ్ఞానం లేని వారిని అది విపత్కర నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది. దాని కారణంగా జీవితాన్ని మార్చే అనేక తీవ్రమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న కొన్ని మనోభావనలను వివరించాలని అనుకుంటున్నాను. సవాళ్లతో కూడిన ఈ మనోభావలను ఎలా ఎదుర్కోవాలో, వాటి ద్వారా సానుకూల ఫలితాలను ఎలా రాబట్టుకోవచ్చో కూడా వివరిస్తున్నాను.

అనిశ్చితి

అనిశ్చితి అన్నది ఒక తీవ్రమైన, అధిక ప్రభావం చూపే భావోద్వేగం. ఇది ఎన్నో ఇతర భావనలకు కారణమవడమే కాదు ఆలోచనలను బలహీనపరచగలదు. ఈ బలహీన ఆలోచనలను సకాలంలో కట్టడి చేయకపోతే అవి బలహీనమైన చర్యలకు దారితీస్తాయి. వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపారులు, సంస్థలపైనే కాదు దేశాలపైనా ఈ అనిశ్చితి తీవ్ర ప్రభావం చూపుతుంది. స్థిరత్వం లేని ప్రతికూల ఆలోచనల కారణంగా ఆలోచించే శక్తి హరించుకుపోతుంది. వ్యక్తిగతంగా ఇది గందరగోళం, నిరాశ, నిస్సహయతకు దారితీస్తుంది. 

ఆశ అన్నది ఒక శక్తిమంతమైన మనోభావన. అనిశ్చితి కారణంగా తలెత్తే అన్ని భావనలను అది సమర్థవంతంగా ఎదుర్కోగలదు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో ఆశ అన్నది ఒక బలమైన పెన్నిధి వంటిది. సానుకూల కథలు చదవడం, సానుకూల వ్యక్తులతో కలిసి ఉండటం, సానుకూల చర్చల్లో పాల్గొనడం, ఆశను చిగురింపజేసే వ్యక్తుల సహచర్యం అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి. చింత, గందరగోళం, నిర్ణయలేమి, నిస్సహాయత, తప్పుడు నిర్ణయాలు, నిరాశ వంటి ప్రతికూల ఆలోచనల వైపు మళ్లించగలిగే శక్తి అనిశ్చితికి ఉంది. తీవ్రమైన బాధ, నష్టాలు, వైఫల్యాలకు దారి తీసే నిర్ణయాలు తీసుకునేలా లేదా తీసుకోకుండా చూడగల శక్తి ఈ ఆలోచనలకు ఉంటుంది. ఈ బలహీన మనోభావనలను ఎదుర్కొనేందుకు “మల్టీ ఆప్షన్స్” మీరు కలిగి ఉండాలని నేను సూచిస్తున్నాను. ఏదైనా నిర్ణయం హడావుడిగా తీసుకోకుండా ముందు మీకు వచ్చిన ఐదు ఆప్షన్స్ రాసుకోండి, వాటిని లోతుగా పరిశీలించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.

భయం

భయం కూడా ఒక శక్తిమంతమైన మనోభావనే. ఎన్నో సానుకూల భావనలను అది సులభంగా పడదోయగలదు. కరోనా వైరస్, దాంతో వచ్చే బాధలు, పెరుగుతున్న మరణాలు అంతటా ఒకలాంటి భయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భయం ఓ వైపు ప్రజలు సురక్షితంగా ఉండేందుకు మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడానికి దోహదపడుతోంది. మరోవైపు అదే భయం, వదంతులను నమ్మేలా చేయడంతో పాటు వైరస్ వ్యాప్తి గురించి అతిగా స్పందించేలా చేస్తోంది. అంతే కాదు కరోనా పేషెంట్ల పట్ల నిర్దయగా వ్యవహరించేలా చేస్తోంది. వైరస్ మనకు సోకుతుందనే ఆలోచన, వివిధ అనారోగ్యాలు, సహజ రోగ నిరోధక శక్తిని కోల్పోవడం, తీవ్రమైన మానసిక క్షోభ, అనవసరమైన వేదనకు కూడా ఈ భయం కారణమవుతోంది. ఇది చాలా మందిని ఆస్పత్రుల వైపు పరుగులుదీసేలా చేస్తోంది. ఇంట్లో చికిత్సతో సరిపోయేదానికి ఆస్పత్రుల్లో చేరడం వలన అక్కడ బెడ్స్ నిండిపోయి, ఎంతో విలువైన వైద్య సేవలకు అవరోధం ఏర్పడుతోంది. భయం వలన శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధకతకు విఘాతం ఏర్పడి అది దారుణమైన పరిణామాలకు దారితీస్తోంది.

విపరీతమైన భయం కారణంగా “ఫైట్ ఆర్ ఫ్లైట్” సిండ్రోమ్ తలెత్తితే వైరస్ సోకిన వ్యక్తిని అది వినాశనకర నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. తనకూ సోకుతుందనే భయం చాలా మందిలో అభద్రతను సృష్టించి అది శారీరక, మానసిక ఒంటరితనం వైపు లాక్కెళ్తుంది. భయాన్ని తట్టుకోలేని వారిలో తీవ్ర ఆందోళనలు చోటుచేసుకుంటాయి. దాంతో గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరిగి అనేక అవయవాల పనితీరు దెబ్బతింటుంది. జాగ్రత్త పెంచుకునేందుకు భయాన్ని ఉపయోగించుకోవచ్చు, అంతకు మించి దాన్ని ముందడుగు వేయనీయొద్దు. భయాన్ని దూరం పెట్టేందుకు సానుకూల సాధ్యతలపై దృష్టి సారించడం మంచిది.

ఒంటరితనం

ఒంటరితనం కూడా ప్రమాదకరమైన మనోభావనే. మీ చుట్టు చాలా మంది ఉన్నా ఒంటరిననే భావన మీలో కలిగిస్తుంది. ఒంటరిగా ఉండటం అంటే ఒక్కరే ఉండటం కాదు, మన చుట్టు ఎంత మంది ఉన్నా వారిని గుర్తించలేకపోవడం. చేయూత అందించేవారు లేరనే భావన, అశక్తుడిననే ఆలోచన, పట్టించుకునేవారు లేరనే వ్యధ ఏకాంతంగా ఉన్నప్పుడు మనస్సుల్లోకి చొచ్చుకువస్తుంది. కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది ఈ భావోద్వేగానికి గురవుతున్నారు.  వ్యాధి బారిన పడి ఏకాంతంలో ఉండాల్సి వచ్చినవారు, ఆస్పత్రుల్లో కోలుకుంటున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు దూరంగా ఉంటున్న వయసైపోయిన తల్లిదండ్రులు, ముసలివారిపై దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఐసోలేషన్ నిబంధనల కారణంగా వేరుగా ఉంటున్న దంపతులు కూడా ఈ వ్యధను అనుభవిస్తున్నారు. వైరస్ సోకినప్పుడు, ఏకాంతంలో ఉంటున్నప్పుడు, కోలుకుంటున్నప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మీ ఆలనాపాలన చూసే వారితో కలిసి ఉండటం చాలా ముఖ్యం. అంతే కాదు రోగులతో మాట్లాడుతూ వారికి భరోసా, భావోద్వేగ చేయూత అందించే బాధ్యత వైద్య సంరక్షణ అందించేవారిపై కూడా ఉంటుంది. ఒంటరితనపు ఆలోచనలు ఆత్మహత్య, వంచనకు గురి అయ్యాననే భావనలకు దారితీస్తాయి.  దీనిని సకాలంలో చక్కదిద్దకపోతే అది శరీరంలో సహజ రోగనిరోధకశక్తిని క్షీణింపజేస్తుంది.
గడిచిన 15 నెలలుగా సమస్త మానవజాతి ఎదుర్కొంటున్న భావోద్వేగాల్లో ఇవి కొన్ని మాత్రమే. అనేక మంది ఈ భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుంటూ సానుభూతి చూపడం అవసరం. ఈ సంక్షోభ సమయంలో మీ శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాదు, మీ మానసిక, భావోద్వేగ స్థితిని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ భావోద్వేగాలను మీరు తెలుసుకొని వాటిని అదుపులో ఉంచుకోగలిగితే మీ మనసు, శరీరాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చు.

విసుగు

లాక్‌డౌన్ వల్ల చిన్న గదులకే పరిమితం కావడంతో విసుగు అనే మనోభావనకు దారితీస్తుంది. ఉపాధి కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధ, సమయం వృధా అవుతుండటం వల్ల తీవ్రమైన విసుగు వస్తుంది. రోజువారీ పనులు చెడిపోవడం, సమయాన్ని, నైపుణ్యాన్ని వినియోగించుకో లేకపోవడం, మందులపై ఖర్చు పెరగడం, ఆర్థిక సమస్యలు, సంబంధాల సంఘర్షణలు, ఎక్కువ కాలం పాటు ఇంటికే పరిమితం కావడం వంటివన్నీ ఈ సంక్షోభ సమయంలో విసుగు స్థాయిని తీవ్రం చేస్తాయి. ప్రత్యామ్నాయాలు వెదకడం, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం, ఆన్లైన్ కోర్సుల్లో చేరడం, పుస్తకాలు చదవడం, స్నేహితులతో తరచూ మాట్లాడుతూ ఉండటం వలన విసుగును దూరం పెట్టవచ్చు. 

కోపం

ప్రతికూల భావోద్వేగాల్లో కోపానిది మొదటిస్థానం. ఇది మానవ సహజ ప్రవృత్తి కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు అధికస్థాయి భావోద్వేగ జ్ఞానం ఉండాలి. పేరుకుపోయిన ప్రతికూల మనోభావనను దీర్ఘకాలం పాటు వ్యక్తం చేయలేని సందర్భాల్లో ఇది బయటకు వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కోపంతో మిమ్మల్ని మీరు గాయపరుచుకోవడం, లేదా ఇతరులను గాయపరచడం జరగొచ్చు. భావోద్వేగంతో తలెత్తే చర్యలను నిలుపు చేయగలిగే లేదా జాప్యం చేయగలిగే లేదా అదిమి ఉంచగల సామర్ధ్యం కలిగిన వ్యక్తులు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలరు. కోపంతో చేపట్టే చర్యల ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహించడం ద్వారా మీరు ఈ భావోద్వేగాన్ని దూరం పెట్టగలరు. కోపం కారణంగా సంబంధాలపరంగా తలెత్తే ప్రభావం, జరిగే నష్టాన్ని అంచనా వేయడం ద్వారా ఈ భావోద్వేగాన్ని దారి మళ్లించవచ్చు.
- కృష్ణసాగర్​ రావు, 
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి