ఓటరు నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు చాన్స్.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే..

  •    18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే..
  •     ఓటరు నమోదుకు స్పెషల్​క్యాంపెయిన్​
  •     ఆఫ్​లైన్​లో కుదరకపోతే ఆన్​లైన్​లో నమోదుకు అవకాశం​
  •     పోలింగ్​ శాతం పెంపుపై ఎలక్షన్​ కమిషన్​ దృష్టి

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుకు ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ 15 వరకు చాన్స్ ఇచ్చింది. పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా యువ ఓటర్ల నమోదుకు స్పెషల్​క్యాంపెయిన్​ చేపట్టింది. ఇంతకుముందు కూడా పలుమార్లు ఓటరు నమోదు చేపట్టినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. విద్య, ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారికి ఆఫ్​లైన్​లో నమోదు చేసుకోవడానికి వీలుకావడం లేదు. దీంతో వారు ఎక్కడ ఉన్నా ఆన్​లైన్​లో రిజిస్టర్​ చేసుకోవడానికి ఎలక్షన్​కమిషన్​ అవకాశం ఇచ్చింది.

ఈసీ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ ఇంకా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువజనులందరికీ భారత రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. తద్వారా అసెంబ్లీ, లోక్​సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకులకు ఓటువేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. యువత చైతన్యంతో ఓటుహక్కును పొంది స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది.  

ఓటరు నమోదు ఇలా..

యువజనులు ఆఫ్​లైన్​లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు తహసీల్దార్​ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫామ్​ 6లో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. ఆధార్ ​కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్​నకు సంబంధించి కరెంట్​ బిల్లు, గ్యాస్ ​బిల్లు, డ్రైవింగ్​లైసెన్స్​ వంటి వాటిలో ఏదో ఒకటి దరఖాస్తుకు జత చేయాలి. బూత్​ లెవల్​ ఆఫీసర్లు (బీఎల్​ఓలు) క్షేత్రస్థాయిలో ఎంక్వయిరీ చేసి ఓటరుగా రిజిస్టర్ చేస్తారు. 

ఆఫ్​లైన్​లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు లేకపోతే ఆన్​లైన్​లో http:///voters.eci.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లి రిజిస్టర్​ చేసుకోవచ్చు. ముందుగా ఫోన్​ నంబర్​తో రిజిస్ట్రేషన్​ చేసుకొని వెబ్​సైట్​లో లాగిన్ ​కావాలి. కొత్తగా ఓటరు నమోదుకు ఫామ్​ 6 ఫిల్​చేసి, ఆధార్​కార్డు, అడ్రస్​ ప్రూఫ్​ కాపీలు సబ్మిట్​ చేస్తే సరిపోతుంది. ఏఈఆర్వోలు పరిశీలించి ఓటరుగా నమోదు చేస్తారు. వెబ్​సైట్​ద్వారా కూడా నమోదు చేసుకునే చాన్స్​ లేకపోతే స్మార్ట్​ఫోన్​ ద్వారా కూడా చేసుకోవచ్చు.  

గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి Voter helpline  mobile app డౌన్​లోడ్​ చేసుకొని దాని ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం http:///voters.eci.gov.in వెబ్​సైట్ ​నుంచి ఓటరు గుర్తింపు కార్డు (ఈ–ఎపిక్​) కార్డును డౌన్​లోడ్ చేసుకోవచ్చు.  

ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి..

ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్​15 వరకు ఓటరు నమోదుకు ఎలక్షన్​ కమిషన్​ గడువు ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి. జిల్లాలో ఓటరు నమోదు, పోలింగ్​ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది. అది ఓటుహక్కుతోనే సాధ్యమవుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటుహక్కు పొందాలి. – బి.సంతోష్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి