- రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండీషన్
- నేడు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో భేటీ కానున్న కేబినెట్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండీషన్ పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్4 వరకు పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులెవరూ కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది.
ఈ మేరకు కండీషన్స్‌తో కూడిన పర్మిషన్ను ఆదివారం ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్‌తో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆఫీసర్లంతా అందుబాటులో ఉండాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
18నే జరగాల్సి ఉండగా..!
రైతు రుణమాఫీ, ఏపీ–తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన శనివారమే (ఈ నెల 18న) కేబినెట్ భేటీ నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది.
ఈ అంశాలతో పాటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కూడా చర్చించాలని సీఎం భావించారు. కానీ, జనరల్ ఎలక్షన్‌తో పాటు వరంగల్ – -నల్గొండ – -ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది. ఈసీ నుంచి పర్మిషన్ వస్తుందని భావించి శనివారం రాత్రి 7 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సెక్రటేరియెట్లోనే వేచి చూశారు.
కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేశారు. సోమవారం వరకు ఈసీ స్పందించకపోతే ఢిల్లీకి వెళ్లి ఈసీ అధికారులను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇంతలోనే కేబినెట్ సమావేశానికి షరుతులతో కూడిన అనుమతిని ఇస్తూ ఆదివారం ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో కేబినెట్ మీటింగ్ జరగనుంది.