మునుగోడు బై పోల్ : గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. చండూర్ డాన్ బోస్కో జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఈవీఎంలతో పాటు, పోలింగ్ సామాగ్రిని అప్పగిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లున్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5 వేల 685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఈ నెల 6న నల్గొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ జరగనుంది. 

పోలింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వేల 366 పోలీస్ సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలను నియోజకవర్గంలో మోహరించారు. 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బల్క్ ఎస్ఎంఎస్ లు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ బ్యాన్ పెట్టింది. నియోజకవర్గంలో ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైంది. ఆన్ లైన్ లోనూ ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 6 కోట్ల 80 లక్షల నగదును సీజ్ చేశారు. 4 వేల 500 లీటర్ల మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో స్థానికేతరులు మునుగోడు విడిచిపెట్టాలని ఈసీ ఆదేశించింది. దీంతో బయటి ప్రాంతాల వాళ్లు నియోజకవర్గం దాటి వచ్చేశారు.