హైదరాబాద్, వెలుగు : కొన్నేండ్లుగా వివాదాలు, అవినీతి ఆరోపణలో వార్తల్లో నిలిచిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రాతను మార్చే అవకాశం ఇప్పుడు ఆ సంఘం ఓటర్ల చేతుల్లో ఉంది. హెచ్‌సీఏ నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నిక జరగనుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ ఆరు పోస్టులకు నాలుగు ప్యానెళ్ల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రెసిడెంట్ కోసం కె. అనిల్ కుమార్, జగన్ మోహన్ రావు, పీఎల్ శ్రీనివాస్, అమర్‌నాథ్ బరిలో నిలిచారు. ప్రతీ పోస్టుకు నలుగురు చొప్పున మొత్తం 24 మంది పోటీలో ఉన్నారు.
దాంతో, ఏ ప్యానెల్ కూడా క్లీన్‌స్వీప్ చేసే అవకాశం కనిపించడం లేదు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ 57 క్లబ్‌లపై వేటు వేసిన తర్వాత ఓటర్ల సంఖ్య 173కి తగ్గిపోయింది. 101 క్లబ్స్, 48 ఇన్‌స్టిట్యూషన్స్, 9 జిల్లా క్రికెట్ సంఘాల ప్రతినిధులతో పాటు 15 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్స్ ప్రకటిస్తారు.