- సామాజిక బాధ్యతగా ఓటేశామంటున్న ఆదివాసీలు
- ములుగు జిల్లా గిరిజనులను మెచ్చుకున్న ఎలక్షన్ ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వాళ్లంతా సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఓ గుట్టపైన నివసిస్తుంటారు. వీరికి పక్కా ఇండ్లు లేవు.. కరెంట్ సౌకర్యం ఉండదు. ప్రతి నెల సర్కారు అందించే రేషన్ బియ్యం కోసం తప్ప గుట్ట నుంచి కిందికి దిగరు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలు అందవు. అయినా లోక్సభ ఎన్నికల్లో సామాజిక బాధ్యతగా సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం 20 కిలోమీటర్ల దూరం కొండాకోనల్లో 5 గంటలకు పైగా నడిచారు. ప్రాణాలకు తెగించి మూడు గుట్టలు దిగి.. మూడు వాగులు దాటుకుంటూ వచ్చి ఓటేశారు. వీరి పట్టుదలను చూసి ఎలక్షన్ ఆఫీసర్లే నివ్వెరపోయారు.
ఎన్నికలపై వీరికున్న బాధ్యతను చూసి శభాష్ అని మెచ్చుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలో పెనుగోలు గుట్టపైన 10 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 26 మందికి ఓటు హక్కు ఉంది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వీరిలో 10 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే కాలినడకన గుట్ట నుంచి కిందికి దిగారు. రక్షణ కోసం చేతుల్లో కర్రలు పట్టుకొని నడవడం స్టార్ట్ చేశారు. దారి మధ్యలో వచ్చే నల్లన్ దేవి వాగు, పాల మడుగు, నేరేడు వాగులు దాటారు. గుమ్మడిదొడ్డి గుట్ట, దట్టల గుట్ట, పెనుగోలు గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ ఉదయం 10 గంంటల వరకు వాజేడులోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడే క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది తెలిసి ములుగు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు శభాష్ అని వారిని మెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి వీరిని ఫోన్‌లో అభినందించారు. ఈ సందర్భంగా పెనుగోలు గ్రామస్తులు మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలు అందకపోయినా.. ఎలక్షన్లలో పోటీ చేసే నాయకులు ఇంటింటికి వచ్చి ప్రచారం చేయకపోయినా.. హామీలు ఇవ్వకపోయినా.. ఓటు వేయడం తమ సామాజిక బాధ్యతగా భావించి వచ్చి ఓటు వేశామని తెలిపారు.