పదేండ్లలో బీఆర్ఎస్ ​చేసిందేమిటి?.. జడ్పీ చైర్​పర్సన్​ని నిలదీసిన ఉపాధి కూలీలు

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడిగేందుకు వచ్చిన వరంగల్​ జడ్పీ చైర్​పర్సన్​గండ్ర జ్యోతిని ఉపాధికూలీలు నిలదీశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బుధవారం ఉపాధి కూలీలను కలిసిన గండ్ర జ్యోతి బీఆర్ఎస్​కు ఓటు వేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​నాలుగు నెలల్లో ఏమీ చేయలేదంటూ విమర్శించారు. దీంతో  ఉపాధి కూలీలు గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్​ఏం చేసిందంటూ మండిపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక్క డబుల్​బెడ్​రూం ఇల్లు కూడా ఇయ్యలే. పింఛన్​కోసం వస్తే ఏ ఊరమ్మ మీదంటూ ప్రశ్నించారు. 

ఏ మోహం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చినవ్​’ అని నిలదీశారు. ‘ఐదేండ్ల క్రితం మీరు (మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి) కాంగ్రెస్​పార్టీలో గెలిచి పార్టీ ఎందుకు మారారు’ అని ప్రశ్నించారు. దీంతో రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమే అని జ్యోతి సమాధానం ఇవ్వడంతో ‘మీరు అధికారంలో ఉననప్పుడు మంచి చేస్తే మీతో ఉన్న లీడర్లు ప్రస్తుతం పార్టీ ఎందుకు మారారు’ అంటూ జ్యోతికి కౌంటర్​ ఇచ్చారు.  ‘మీరు ఇప్పటి వరకు ఊళ్లల్లో అభివృద్ధి చేస్తే మీరే గెలిచెటోళ్లు కదా.  బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేళ్లలో బాగుపడింది ఒక్క మీ లీడర్లే తప్పా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు’ అని అన్నారు. దీంతో అసహనానికి గురయిన జ్యోతి ప్రచారాన్ని కావాలనే ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ఇలా ప్రచారాన్ని అడ్డుకోవడం అనేదాన్ని  మీ విచక్షణకే వదిలేస్తున్నానని అంటూ వెళ్లిపోయారు.