ఎంపీ నామాకు ఈడీ షాక్

ఎంపీ నామాకు ఈడీ షాక్
  • ఇప్పటి దాకా రూ.154.39 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​
  • కెనరా బ్యాంకు నుంచి రూ.1,030 కోట్ల రుణం
  • షెల్‌‌ కంపెనీల ద్వారా రూ.361.29 కోట్లు మళ్లింపు
  • 2019లో కేసు నమోదు

 

హైదరాబాద్‌‌/ న్యూఢిల్లీ/వెలుగు:టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎంపీ నామా నాగేశ్వర్‌‌‌‌రావుకు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) షాక్‌‌ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన హైదరాబాద్‌‌, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని రూ.80.65 కోట్ల విలువజేసే 28 ఆస్తులను అటాచ్‌‌ చేసింది. జూబ్లీహిల్స్‌‌లోని మధుకాన్ ఆఫీస్‌‌ను సీజ్ చేసింది. ఆస్తుల జప్తు వివరాలను హైదరాబాద్‌‌ ఈడీ బృందం సోమవారం వెల్లడించింది. 

మధుకాన్‌‌ గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీలకు నామా నాగేశ్వరరావు ప్రమోటర్‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌గా ఉన్నట్లు తెలిపింది. రాంచీ ఎక్స్‌‌ప్రెస్‌‌ వేస్ లిమిటెడ్ పేరుతో కెనరా బ్యాంక్‌‌ నుంచి  1,030 కోట్లు లోన్ తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో 361.29 కోట్లను 6 షెల్‌‌ కంపెనీల ద్వారా మధుకాన్‌‌ కంపెనీలోకి మళ్లించినట్లు వెల్లడించింది. దీనిపై సీబీఐ2019 మార్చిలో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది జులైలో రూ.73.74 కోట్లు విలువజేసే105 ఆస్తులను అటాచ్ చేసింది.

రాంచీ ఎక్స్‌‌ప్రెస్‌‌ వే గోల్‌‌మాల్‌‌ 
నేషనల్‌‌ హైవేస్‌‌ అథారిటీ 2011లో రాంచీ-– రార్‌‌గావ్-– జంషెడ్‌‌పూర్‌‌(ఎన్​హెచ్​33) హైవేలో 114 కి.మీ నుంచి 277.50 కి.మీ వరకు 4 వరుసల ఎక్స్‌‌ప్రెస్‌‌ హైవే నిర్మాణానికి టెండర్ పిలిచింది. ఈ ప్రాజెక్ట్‌‌ను నామాకు చెందిన మధుకాన్‌‌ గ్రూప్‌‌ దక్కించుకుంది. రాంచీ ఎక్స్‌‌ ప్రెస్‌‌వేస్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని రిజిస్టర్‌‌‌‌ చేసింది. దీనికి కమ్మ శ్రీనివాస్‌‌రావు, నామా సీతయ్య, నామా పృథ్వీతేజలు ఫౌండర్ డైరెక్టర్లుగా ఉన్నారు. కెనరా బ్యాంకు నుంచి రూ.1,030 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఉషా ప్రాజెక్ట్స్, బీఆర్‌‌‌‌ విజన్స్, శ్రీ ధర్మ శాస్తా కన్​స్ట్రక్షన్స్, నాగేంద్ర కన్‌‌స్ట్రక్షన్స్, రాగిణి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మి కన్‌‌స్ట్రక్షన్స్ ద్వారా రూ.75.50 కోట్లు క్యాష్‌‌ విత్‌‌డ్రా చేశారు. ఈ ఆరు షెల్‌‌ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య నిర్వహిస్తున్నారు.

రూ.361.29 కోట్లు మళ్లించారు
షెల్‌‌ కంపెనీల ద్వారా మధుకాన్ గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీలకు రూ. 361.29 కోట్లు మళ్లించారు. తప్పుడు లెక్కలతో నష్టాలు చూపించారు. ప్రాజెక్ట్‌‌ పూర్తి చేయకపోగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు చెల్లించలేదు. దీంతో ఎన్‌‌హెచ్‌‌ఏ, కెనరా బ్యాంక్ 2019 మార్చి 12న సీబీఐకి ఫిర్యాదు చేశాయి. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేశారు. ఫోరెన్సిక్ ఆడిటర్లు, ఇంజనీర్లు, సబ్-కాంట్రాక్టర్లు, మధుకాన్ గ్రూప్ ప్రమోటర్ల స్టేట్‌‌మెంట్‌‌లను తీసుకుని 2020 డిసెంబర్‌‌‌‌లో చార్జ్‌‌షీట్‌‌ ఫైల్ చేశారు. ఈ ఏడాది జూన్‌‌లో హైదరాబాద్‌‌లోని నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని మధుకాన్‌‌ డైరెక్టర్లు,ప్రమోటర్ల ఇండ్లు,ఆఫీస్‌‌ల్లో సోదాలు జరిపారు. నామా ఇంటి నుంచి రూ.34లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌‌ ఖాతాలు సీజ్‌‌ చేశారు.