- చంచల్‌గూడ జైల్‌లో నందకుమార్ విచారణ
- ఇయ్యాల మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
- ఏడేండ్లుగా నందుతో జరుగుతున్న వ్యాపారాలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ కేంద్రంగా జరిగిన రూ.250 కోట్ల డీల్ వివరాలను రాబడుతున్నది. రోహిత్‌రెడ్డికి ఆఫర్ చేశారని చెప్తున్న రూ.100 కోట్లు, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇస్తామన్న రూ.150 కోట్లు ఎక్కడనే దానిపై ఆరా తీస్తున్నది. ఈ కేసులో కీలక నిందితుడైన నందకుమార్‌ను చంచల్‌గూడ జైలులో సోమవారం ఈడీ విచారించింది. తొలి రోజు విచారణలో భాగంగా వ్యక్తిగత వివరాలు, రోహిత్‌రెడ్డితో కలిసి చేసిన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించినట్లు తెలిసింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతి ఉండగా.. కరోనా టెస్ట్‌ల నెగటివ్ సర్టిఫికెట్స్‌లో ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ అధికారులు జైలుకు చేరుకున్నారు. ప్రత్యేక గదిలో అసిస్టెంట్ డైరెక్టర్స్ సుమిత్ గోయల్, దేవేందర్‌సింగ్ సహా నలుగురు సభ్యుల టీమ్ నందకుమార్‌ను విచారించింది. అడ్వకేట్ సమక్షంలో సుమారు 4 గంటలు ప్రశ్నించింది. ల్యాప్‌టాప్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.
ఎంతకాలంగా డీల్‌కు ప్లాన్ చేస్తున్నారు?
మొయినాబాద్, బంజారాహిల్స్ పీఎస్‌లో నందుకుమార్‌పై రిజిస్టరైన చీటింగ్ కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్(పీఎంఎల్‌ఏ) యాక్ట్ కింద గత నెల15న ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. రూ.వందల కోట్లు ప్రస్తావన వచ్చినందున ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇదే కేసులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఈ నెల 19,20 తేదీల్లో రెండు రోజుల పాటు విచారించింది. మంగళవారం మరోసారి ప్రశ్నించనుంది.
మరోవైపు తొలి విడత విచారణలో రోహిత్‌రెడ్డి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా నందుకుమార్‌ను విచారించారు. ప్రధానంగా ఫామ్‌హౌస్ కేసు వివరాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంతకాలంగా డీల్‌కు ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ డీల్ కుదిరితే ఆఫర్ చేసిన డబ్బు ఎవరు ఇస్తారు? వారికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే రోహిత్‌రెడ్డి, నందుకుమార్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించింది.
వ్యాపారాలపై ఆరా
వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో నందుకుమార్‌కు ఉన్న పరిచయాలను గురించి ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో గత ఏడేండ్లుగా నందుకు పరిచయం ఉన్నట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఏడేండ్ల కాలంలో ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు ఎన్ని? వంటి విషయాలను గురించి ఆరా తీసినట్లు సమాచారం. 2015 నుంచి నందుకుమార్‌కు చెందిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసినట్లు తెలిసింది.
రోహిత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నందు చేసిన వ్యాపారాలు, వాటికి సంబంధించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ (ఆర్‌ఓసీ) రికార్డ్స్ ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రముఖులతో కలిసి చేసిన వ్యాపారాలు, ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ వివరాలను సేకరించినట్లు తెలిసింది. మంగళవారం మరోసారి విచారించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.