మెట్రో పిల్లర్ ను చూసుకోకుండానే నాలా పనులు

మెట్రో పిల్లర్ ను చూసుకోకుండానే నాలా పనులు
  • పనులు మొదలయ్యాక పిల్లర్ అడ్డురావడంతో మళ్లీ ప్లాన్ చేంజ్ 
  • ఈ ఏడాది ఏప్రిల్ 10న పికెట్​ నాలా పనులు స్టార్ట్
  • ఒకవైపు పూర్తి, మరోవైపు ఇంకా కొనసాగుతున్న పనులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. స్టాటజిక్ నాలా డెవలప్ మెంట్​ ప్రొగ్రామ్(ఎస్ఎన్డీపీ) పనులే ఇందుకు నిదర్శనం. రసూల్ పురా  పికెట్ నాలా పనులకు సంబంధించి  ఎస్​ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారులు మొదట రూపొందించిన డీటైయిల్డ్ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్)తో  మెట్రో పిల్లర్లకు ప్రమాదమేర్పడింది.  పిల్లర్​ను చూడకుండానే ఇంజనీర్లు డీపీఆర్ ఫైనల్ చేశారు.  పనులు ప్రారంభించిన తర్వాత స్కానింగ్​లో మెట్రో పిల్లర్ అడ్డుగా రావడం, ఒకవేళ ఈ పనులు చేయాలంటే పిల్లర్ కిందకు గుంత తవ్వాల్సి రావడంతో  వెంటనే మళ్లీ డీపీఆర్​ను చేంజ్ చేశారు. మెట్రో పిల్లర్​కు  దూరంగా పనులు మొదలు పెట్టారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే మెయిన్ రోడ్డుపై జరుగుతున్న పనుల్లోనే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే.. ఇక మిగతా ప్రాంతాల్లో నాలాల పనులు ఏ విధంగా కొనసాగుతున్నా
యోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నాలా నిర్మాణంలో నిర్లక్ష్యం..

రసూల్ పురా వద్ద పోలీస్ స్టేషన్ పక్కన, కరాచీ బేకరీ పక్కన రెండు వైపులా రూ.10 కోట్లతో నాలా పనులు చేపట్టాలని గతంలో బల్దియా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 10న ముందుగా పోలీస్ స్టేషన్ పక్కన పనులు మొదలుపెట్టారు. అక్కడ మెట్రో పిల్లర్ అడ్డురావడంతో కొన్నాళ్లు పనులకు బ్రేక్ పడింది. మళ్లీ డీపీఆర్ ప్లాన్ చేంజ్ చేసి పనులు మొదలు పెట్టారు.  మరికొద్దిరోజులకు మిల్లర్ల సమ్మెతో కంకర లేక  పనులు నిలిచిపోయాయి. ఇంకొన్నాళ్లు వర్షాలు కురవడంతో నిలిచిపోయాయి. చివరగా 45 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ  98 రోజుల తర్వాత జులై 17న ఒక వైపు పోలీస్ స్టేషన్ పక్కన బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. కరాచీ బేకరీ పక్కన కూడా పనులు అదేవిధంగా జరుగుతున్నాయి. 45 రోజుల్లో పనులు పూర్తిచేస్తామని జులై 20న పనులు మొదలుపెట్టినప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. ఈ నెలాఖరులోగా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

డైలీ రెండు లక్షల మందికి ఇబ్బంది..

మెయిన్ రోడ్డుపై నిర్వహిస్తున్న పనులను కూడా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో అవి నిలిచిపోతున్నాయి. డైలీ 2 లక్ష
లకుపైగా వెహికల్స్​ తిరిగే రసూల్ పురా  మెయిన్ రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులే ప్లానింగ్ లోపంతో  ఇంత ఆలస్యమైతే అంతర్గత రోడ్లపై జరుగుతోన్న పనుల పరిస్థితేంటని సిటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  రసూల్​పురా నాలా  పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినప్పుడు  ట్రాఫిక్​ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడంలేదు. 
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ రూట్​లో రెగ్యులర్ గా జర్నీ చేసే వాహనదారులు  బల్దియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

వానాకాలంలో మొదలుపెట్టడంతో.. 

రసూల్ పురా నాలాపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వానాకాలానికి కొద్ది రోజుల ముందే ప్రారంభించారు. పోలీసు స్టేషన్ పక్కన ముందుగా నిర్మించగా అప్పట్లోనూ వర్షాలు కురవడం, కంకర లేకపోవడంతో నెల రోజులపాటు పనులు జరగలేదు. ఇప్పుడు కరాచీ బేకరీ పక్కన  జరుగుతున్న నిర్మాణానికి కూడా ఎన్నో  అడ్డంకులు వచ్చాయి. ఈ పనులు ప్రారంభించిన నెలరోజుల్లో వర్షాల కారణంగా 15 రోజులు  నిలిచిపోయాయి. వర్షాకాలంలో పనులు చేయడంతోనే ఈ సమస్య ఏర్పడింది. వర్షాకాలానికి రెండు, మూడు నెలల ముందే ఈ పనుల నిర్మాణం చేపట్టి ఉంటే తొందరగా పూర్తయ్యేదని.. లాక్ డౌన్ టైమ్​లో పనులు చేపట్టి పూర్తిచేసినా ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదని వాహనదారులు అంటున్నారు.

ప్యారడైస్ నుంచి పంజాగుట్ట రూట్​లోనే ట్రాఫిక్ జామ్

రసూల్​పురా నాలా పనుల కారణంగా పంజాగుట్ట నుంచి ప్యారడైజ్, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ఇబ్బందులు లేనప్పటికీ, ప్యారడైజ్​  నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వారికి ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు. 4 నెలలుగా ఇదే పరిస్థితి. పోలీసు స్టేషన్ వైపు పనులు జరిగిన సమయంలోనూ పంజాగుట్ట నుంచి  సికింద్రాబాద్ వైపు వెహికల్స్​ను కరాచీ బేకరీ నుంచి డైవర్ట్ చేశారు.  ఇప్పుడు పోలీసు స్టేషన్ పక్కన బ్రిడ్జి ఓపెన్ కావడంతో పంజాగుట్ట నుంచి  ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్  వెళ్తున్నాయి. కానీ ప్యారడైజ్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే  వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.  సింధికాలనీ నుంచి  మినిస్టర్ రోడ్ మీదుగా నుంచి పంజాగుట్ట వైపు వస్తున్నామని.. ఈ   రూట్​లో ట్రాఫిక్ జామ్​తో గంటకు పైగా టైమ్​ పడుతోందని  వాహనదారులు అంటున్నారు.